పసి బాలల కృషి

Children's workగాజా స్ట్రిప్‌లో పిట్ట కూడా రెక్కలు కొట్టుకోకుండా జాగ్రత్తలు తీసుకొంది ఇజ్రాయిల్‌. గాజా ప్రజలకు తాగడానికి రెండు నీటి చుక్కలు కూడా లేకుండా చేసింది. కొన్ని మీటర్ల ఎత్తులో ఉన్న నీటి టాంకర్లను కూల్చేసింది. అండర్‌ గ్రౌండ్‌ లో ఉన్న నీళ్లసంప్‌లో కాంక్రీట్‌ పోసి పూరించింది. ఆకలి దప్పులతో పాలస్తీన ప్రజలు ప్రాణాలు వదలసాగారు. గాజా ఇజ్రాయిల్‌చే నలువైపులా ఆక్రమించుకోబడ్డ ఒపెన్‌ జైల్‌లా ఉంది.
గాజాకు దక్షిణం వైపున ఈజిప్టు బార్డర్‌ ఉంది. అది రఫా బార్డర్‌. చాలా ఎత్తైన కాంక్రీట్‌ గోడ. చిన్న ప్రవేశ ద్వారం ఉంది. చెక్‌ పోస్ట్‌. ఇక్కడినుంచి ఆహారం, మందు సామాగ్రి రఫా లోకి వెళ్ళడానికి వీలుంది. కాని ఇజ్రాయిల్‌ ససేమిరా ఒప్పుకోవడం లేదు. కొన్ని సార్లు దారితప్పి వచ్చినట్లు ఏ ఒక్క ట్రక్కు లోనికి ప్రవేశించినా ఇజ్రాయిల్‌ వాటిని ధ్వంసం చేస్తుంది.
ఉస్మాన్‌ పదేళ్ల కుర్రాడొకడు తన తెలివితేటలనుపయోగించి ఎంతో ధైర్యసహాసాలతో, తన ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రహరీ గోడలో చిన్న రంధ్రం చేశాడు. రోజుకు కొన్ని గంటలు ఎవరి కంటబడకుండా తన ప్రయత్నంలో సఫలీకతుడయ్యాడు. ఒక్కక్కటిగా రొట్టెలను ఆ రంధ్రంలో నుంచి గాజా వైపుకు తోసేవాడు. ఆ వైపున ఉన్న వాళ్లు ఆ రొట్టెలను, సాండ్‌విచ్‌ లను అందుకునే వారు. అలా ప్రతి ఉదయం సూర్యోదయానికి ముందునుంచి సూర్యాస్త మయం వరకు దాదపు వెయ్యి సాండ్‌ విచ్‌ లు, రొట్టెలను ఆ చిన్న రంధ్రం ద్వారా గాజా వైపుకు తోసేవారు వీలునుబట్టి! అతని ఇద్దరు తమ్ముళ్లు ఖాలీద్‌, జకరీయా రోజంతా ప్రజల దగ్గర్నుంచి డబ్బులు పోగు జేసేవారు. ఆహారం కొనుగోలు కోసం అప్పుడప్పుడు ఈజిప్టు వైపు పహారా కాస్తూన్న సెక్యూరిటీ వాళ్లు చూసీచూడకుండా, చిన్నగా నవ్వుతూ దాటి పోయేవాళ్లు. పైగా ఆ చిన్నారి చేస్తున్న ధైర్యాన్ని, ఉపాయాన్ని మెచ్చుకొనేవారు. అలా వారం రోజులు గాజా వాళ్లు కనీసం కొన్ని రొట్టెలు, సాండ్‌ విచ్‌లు, తాగే మంచి నీళ్ల బాటిల్స్‌ అందుకొంటూండే వాళ్లు. ఆ కుర్రాళ్లను దీవించే వాళ్లు.
జకరీయా తన పెద్దన్న ఉస్మాన్‌ తో, ”శుఫ్‌ యా అఖీ (చూడన్న)… ముష్కిల కతీర్‌!” (చాలా కష్టతరమైన… ప్రమాదకరమైన పని) అని చిన్న గొంతుతో హెచ్చరించాడు.
ఉస్మాన్‌ పెదవులపై చూపుడు వేలు పెట్టి మాట్లాడబాకన్నట్లు సైగ చేశాడు.
ఉస్మాన్‌ ”ఆల్లV్‌ా ఫి” (దేవుడు మనతో ఉన్నాడు) అంటూ ఆకాశంపై చూపుడు వేలు పెట్టాడు.
పిల్లలు మూగాళ్లుగానే కేవలం సైగలతోనే తమ ప్రణాళికను కొనసాగించారు.
ఓ రోజు, ఈజిప్టు బార్డర్‌ వైపునుంచి బార్డర్‌ భారీ గోడకు చేసిన రంధ్రం నుంచి రొట్టెల సరఫరా చేస్తూండగా అవతలి వైపు నుంచి తుపాకీ గోలీల శబ్దాలు… ప్రజల మూలుగులు, ఆక్రందనలు వినిపించాయి. ఆరేళ్ల ఖాలీద్‌ ఆ రంధ్రంలో నుంచి ఓ కన్నుపెట్టి తదేకంగా అవతలి వైపు చూడసాగాడు. అలా కొన్ని నిమిషాలు చూస్తూండగా ఓ తుపాకీ గోలీ పేలింది ఆ రంధ్రంలో నుంచి. బహుశా ఈ పిల్లల ఉనికి అవతలి బార్డర్లో ఉన్న సైనికులకు అనుమానం కలిగిందేమో! ఖాలీద్‌ పెద్దన్న దగ్గర్నుంచి అప్పుడే నీటి బాటిలొకటి తీసుకోవడానికి కొద్దిగా వంగాడు. తుపాకీ గోలి కొద్దిగా కుడి భుజాన్ని తాకుతూ వెళ్ళి పోయింది. రక్తం బాగానే కారసాగింది.
ఉస్మాన్‌, జకరియా భయపడుతూ, వణుకుతున్న చేతులతో ఖాలీద్‌ను ముళ్ల తీగల కంప నుంచి జాగ్రత్తగా బయటికి తీశారు. కొద్దిసేపటి తర్వాత ఈజిప్టు వైపున్న సైనిక వాహనం ఒకటి వీళ్లను చూసి ఆగింది. ఓ సైనికుడు వాహనంలో నుంచి దిగి సంగతేమిటో అర్ధం జేసుకున్నాడు. కొన్ని నిమిషాలలో అంబులెన్స్‌ అక్కడికి చేరుకుంది. ఆ ముగ్గురు బాలలు అంబులెన్స్‌లో కెళ్లారు. అది శరవేగంతో హాస్పిటల్‌ వైపుకుకు దూసుకొంటూ వెళ్లింది.
అమ్జద్‌