భారతదేశంలో భిన్నమతాల ఉనికి, లౌకిక రాజ్యాంగ సూత్రాల గురించి, మతతత్వ రాజకీయ పార్టీలు ఇటీవల కాలంలో పదే పదే అనేక విధాల చర్చలు, వివాదాలు లేవనెత్తుతుతున్నాయి. ఈ నేపథ్యంలో అత్యున్నత న్యాయ స్థానం గత నెలరోజుల్లోనూ మూడుసార్లు దీనిపై సానుకూల స్పష్టతనివ్వడం స్వాగతించదగింది. గతంలో రాజ్యాంగ పీఠిక, తర్వాత యూపీ మదరసాల చట్టం, తాజాగా ఆలీఘర్ ముస్లిం యూనివర్సిటీ, ఈ మూడు కేసుల్లోనూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇదే సంకేతాలిచ్చారు. ఈ కేసుల తుది తీర్పులు రాలేదనుకున్నా రాజ్యాంగ నిర్దేశాలను మాత్రం వారు తేల్చిచెప్పారు. దక్షిణాదిన అందులోనూ తెలుగు రాష్ట్రాల్లోనూ ఇటీవల కేవలం బీజేపీ మాత్రమే గాక దానితో జట్టుకట్టిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వంటివారు కూడా లౌకిక సూత్రాల అన్వయం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తెలిసిందే.వీటన్నిటి కారణంగా ఆరోగ్యకరంగా ఆలోచించేవారిలోనూ అనవసరమైన అనుమానాలు అవాంఛనీయమైన సందేహాలు లేవనెత్తే ప్రయత్నం జరుగు తున్నది. ఇలాంటి ఆలోచనా ధోరణి వున్నవారే వివిధ కారణాలతో, పేర్లతో లౌకిక ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించేందుకు పరిపరి విధాల ప్రయత్నం చేయడం నిత్యకృత్యంగా మారింది. సరిగ్గా ఈ కారణంగానే పదవీ విరమణ చేసిన సిజెఐ చంద్రచూడ్, రాబోయే సిజెఐ సంజీవ్ ఖన్నాలతో సహా లౌకిక విలువల విషయంలో సానుకూల వ్యాఖ్యలు, తీర్పులివ్వడం ఆసక్తికరమవుతున్నది. సరళీకరణతో సహా వివిధ విషయాల్లో వివాదాస్పదంగా, విమర్శాపాత్రంగా తీర్పులిచ్చిన న్యాయమూర్తులు దేశ భవిష్యత్తు రీత్యా కీలకమైన లౌకిక సూత్రాల వరకైనా గట్టిగా సమర్థించుతూ మాట్లాడటం మంచిదే. అదే సమయంలో పాలక వర్గాలు మతాల మధ్య సంబంధాలను తమ రాజకీయస్వార్థం కోసం ఉపయోగించుకునే తీరును కూడా ఈ కేసులు విదితం చేస్తాయి.
మదరసాల చట్టం
రాజ్యాంగం 30వ అధికరణం మైనార్టీ మతాల భాషల వారికి, సొంత విద్యా వికాసాల కోసం సంస్థలు స్థాపించుకునే అవకాశం ఇస్తున్నది. అయితే అక్కడ మత సామరస్యం కోసం విద్యాభివృద్ధి కోస ం పాఠ్యాంశాలు వుండాలని , మతపరమైన విద్యకు అవి పీఠాలు కారాదని పేర్కొంటున్నది. ఉదాహరణకు యూపీ మదరసాలు ఎన్‌సిఇఆర్‌టి సిలబస్‌ను బోధించాలని వుంది.ముస్లిం మైనారిటీల విద్యావికాసం కోసం ఏర్పాటైన మదరసాల మీద మొదటినుంచి సంఫ్‌ుపరివార్ దాడి చేస్తూనే వుంది.మరో వంక ముస్లిం మతచాందసాల బోధనకు కూడా ప్రయత్నించే శక్తులు వాటి కోణంలో అవి పనిచేస్తుంటాయి. 2004 యూపీ మదరసాల చట్టం ఈ సంస్థలను నియంత్రించేందుకు కొన్ని నిబంధనలు జారీ చేసింది. వాటిని అలహాబాద్ హైకోర్టు కొట్టి వేసింది. ఈ చట్టం భారత రాజ్యాంగ మౌలిక స్వభావమైన లౌకికతత్వ వ్యతిరేకం గనక చెల్లదని పేర్కొంది. అయితే సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ధర్మాసనం పదవీ విరమణకు ముందురోజు దీనిపై తీర్పునిస్తూ ఒక చట్టం కేవలం రాజ్యాంగ మౌలిక స్వభావానికి విరుద్ధమనే కారణంతో కొట్టివేయడం సరైందికాదని, అందులోని నిబంధనలు రాజ్యాంగంతో ఎలా విభేదిస్తున్నాయో చెప్పాలని అభిప్రాయపడింది. ఆ కారణంతో హైకోర్టు మదరసాల బిల్లును కొట్టివేయడం కుదరదంది. అయితే అదే సమయంలో వాటిలో విద్య నాణ్యత గురించి తగు నిర్ణయాలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి వుంటుందని, ఈ రెంటినీ వేరుగా చూడాలని స్పష్టం చేసింది. పాఠ్యాంశాలు, బోధన తీరు వంటి విషయాలల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవచ్చునని పేర్కొంది.
లౌకికతత్వం వద్దా?
ముందుగా అక్టోబరు 24న కాబోయే సిజెఐ సంజీవ్‌ఖన్నా నాయకత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం పీఠిక నుంచి లౌకికతత్వాన్ని తొలగించాలనే కోర్కెను తప్పుపట్టింది. బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి, ఆ నేపథ్యంలో ప్రజాప్రయోజన వాజ్యాలు వేసే అశ్విన్ ఉపాధ్యాయ తదితరులు వేసిన పిటిషన్‌ను విచారించే సందర్భంలో తీవ్రవ్యాఖ్యలే చేసింది. ‘లౌకికతత్వం అనేది భారత రాజ్యాంగం మౌలిక స్వభావాల్లో ఒకటి. రాజ్యాంగం ఎప్పుడూ ఈ స్వభావాన్ని ప్రతిబింబిస్తున్నదని, ఈ కోర్టు అనేక తీర్పుల్లో చెప్పింది. సమానత్వహక్కు, రాజ్యాంగం మూడో భాగంలో పేర్కొన్న సౌహార్దత అనే పదం, హక్కులు చూస్తే లౌకికతత్వం రాజ్యాంగ మౌలిక లక్షణమని స్పష్టంగా తెలుస్తుంది’ అని జస్టిస్ సంజీవ్‌ఖన్నా వ్యాఖ్యానించారు. రాజ్యాంగ పరిషత్తు చర్చలలో ఈ పదం లేదనీ,1976లో లౌకికతత్వం,సోషలిజం అనే పదాలను 42వ సవరణ ద్వారా చేర్చారని పిటిషనర్లు వాదించారు. అయితే రాజ్యాంగ చర్చల సమయానికి మనకు ఫ్రెంచి రాజ్యాంగ నమూనా మాత్రమే వుందని, తర్వాత కాలంలో మన స్వంత నమూనా రూపొందించు కోగలిగామని జస్టిస్ ఖన్నా వివరించారు.ఇతర హక్కులు కూడా జోడించి మనం దాన్ని సమతుల్యం చేశామన్నారు. ‘మీరు భారతదేశం లౌకిక దేశంగా ఉండాలనుకోవడం లేదా?’ అని ప్రశ్నించారు. దేశం లౌకిక దేశంగానే ఉండాలని, అయితే ఈ పదాన్ని చేర్చడాన్ని మాత్రమే తాము సవాల్ చేస్తున్నామని పిటిషనర్లలో ఒకరైన బలరాంసింగ్ తరపున హాజరైన విష్ణుశంకర్‌జైన్ వాదించారు. అయితే సామ్యవాదం, లౌకికతత్వం అనే పదాలకు మనం ఇచ్చుకున్న అర్థం వేరని న్యాయమూర్తులు జవాబిచ్చారు. సమాన అవకాశాలు, దేశంలో సంపదను సమానంగా పంపిణీచేయడం అన్న అర్థంలో కూడా తీసుకోవచ్చని జస్టిస్‌ఖన్నా అన్నారు. ఆ రెండు పదాలు మన రాజ్యాంగ మౌలిక స్వభావంలో భాగమని కోర్టులు పదేపదే ప్రకటించాయని గుర్తు చేశారు.1949 నవంబరు 26న ఆమోదించిన పీఠిక ప్రకారం భారత ప్రజలు సోషలిస్టు లౌకిక రిపబ్లిక్‌గా అంగీకరించారని చెప్పడం తప్పవుతుందని స్వామి వాదించారు.వాటిని 1976లో కలిపారు గనకనే ప్రత్యేకంగా బ్రాకెట్లలో వుంచారని సమైక్యత, సమగ్రత అనే పదాలు కూడా సవరణతోనే చేర్చారని జస్టిస్‌ఖన్నా చెప్పారు. ఈ కేసు విచారణ ఇంకా పూర్తికాలేదు గానీ ముందే స్పష్టంగా చెప్పడం ద్వారా న్యాయ మూర్తులు తమ ఆలోచనను వ్యక్తం చేశారనుకోవచ్చు
ఆలిఘర్ విశ్వవిద్యాలయం కేసు
ఇక సిజెఐ చంద్రచూడ్ పదవీ విరమణ చివరి ఘట్టంలో ఆలిఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం (ఎంఎంయు) తీర్పు వెలువడింది.ఈ విశ్వవిద్యాలయం మైనార్టీ సంస్థనా, కాదా?అన్నదే ఇక్కడ వివాదం, బ్రిటిష్ పాలకుల హయాంలో చట్టం ద్వారా ఏర్పడింది గనక ఎఎంయు మైనార్టీ సంస్థ కాదనేది పిటిషనర్ల వాదన. ఈ కేసు దీర్ఘకాలంగా వాయిదా పడుతున్నది, చాలా చరిత్ర కూడా వుంది.స్వాతంత్య్ర పోరాట కాలంలో 1877లో సయ్యద్ అహ్మద్ ఖాన్ మహమ్మదన్ ఆంగ్లో ఒరియంటల్ కాలేజీ పేరిట దీన్ని ఏర్పాటు చేశారు.1920లో దాన్ని కేంద్ర చట్టం పరిధిలోకి తీసుకొచ్చారు. స్వాతం త్రానంతర కాలంలో ప్రతిష్టాత్మక విద్యాలయంగా ఆలిఘర్ విశ్వవిద్యాలయం విస్తరించింది. అయితే ఒక కేంద్ర విశ్వవిద్యాలయాన్ని మైనార్టీ సంస్థగా పరిగణించడం చెల్లదని 1967లో సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఎస్‌అజీజ్ వర్సెస్ కేంద్రం కేసులో తీర్పునిచ్చింది. ఎమర్జన్సీ ఓటమి తర్వాత తిరిగొచ్చిన ఇందిరాగాందీ 1981లో దాన్ని మైనార్టీ విద్యాసంస్థగా ప్రకటిస్తూ సవరణ చేసింది. అయితే అదే సమయంలో అన్ని వర్గాల విద్యార్థులకు ప్రవేశం వుంటుందని ఆ చట్టం పేర్కొంది.ఈ సవరణను 2006లో అలహాబాదు హైకోర్టు కొట్టివేసింది, అప్పటి యుపిఎ ప్రభుత్వం ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసింది. 2009లో ఎంఎంయు యాభై శాతం పీజీ సీట్లను ముస్లింలు రిజర్వు చేస్తూ కేంద్రం నిర్ఱయించడం చర్చకు దారితీసింది. దీర్ఘకాల చరిత్ర గల కేంద్ర విశ్వవిద్యాలయంలో ఈ విధంగా మత ప్రాతిపదికన రిజర్వే షన్లు కల్పించడం సరికాదని లౌకికవాదులు భావించారు. 1967 తీర్పు ప్రకారమైతే ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్ కాలేజీ, వెల్లూరు మెడికల్ కాలేజీ వంటి చాలా మైనార్టీ సంస్థల ఉనికికి ముప్పు కలుగుతుందంటూ కూడా పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే 2016లో మోడీ ప్రభుత్వం మైనార్టీ హోదాపై వైఖరి మార్చుకుంది దీనిపై విచారణలో సుప్రీం కోర్టు 2019లో ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి అప్పగించింది. ఇప్పుడు 4-3 తేడాతో వెలువడినతీర్పు 1967నాటి తీర్పును కొట్టివేసింది.
కేవలం కేంద్రచట్టం ప్రకారం ఏర్పడిందనే కారణంతో- మైనార్టీ పెద్దలు ఏర్పాటు చేసిన సంస్థ మైనార్టీ స్వభావం కోల్పోదని తేల్చింది. మైనార్టీల హక్కులకు సంబంధించిన 30వ అధికరణం లౌకిక విద్యకు కూడా వర్తిస్తుందని తీర్పు రాసిన సిజెఐ చంద్రచూడ్ పేర్కొన్నారు.30(10) అధికరణం వివక్షకు వ్యతిరేకం గానూ,ప్రత్యేక హక్కుల కోసమూ ద్విముఖ స్వభావం కలిగి వుంటుందన్నారు.అయితే తాము తమ సంస్కృతిని కాపాడుకోవడానికే దాన్ని ఏర్పాటు చేశామనేది మాత్రం ఆ వర్గానికి చెందిన వారే చెప్పవలసి వుంటుందని, ఇందుకోసం అప్పటి ఉత్తర ప్రత్యుత్తరాలు, పత్రాలు పరిశీలించాలని ధర్మాసనం అభిప్రాయపడింది. సంస్థ ఏర్పాటు తర్వాత నిర్వహణ ఎవరి చేతుల్లోకి వెళ్లింది? ఈ ప్రకారం ఎఎంయుకు మైనార్టీ హోదా వుంటుందా, లేదా? అనేది సాధారణ ధర్మాసనం నిర్ణయించాలని నిర్దేశించారు. అంటే ఈ కేసులో తుది నిర్ణయం జరగాల్సి వుంటుందన్నమాట. (అదే సమయంలో ముగ్గురు న్యాయమూర్తులు ఇందుకు భిన్నంగా మైనార్టీ తీర్పులిచ్చారు) సుప్రీంకోర్టు తీర్పుపై అలీఘర్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ నైమా ఖటూన్, అధ్యాపక ఉపాధ్యాయ సంఘాలు హర్షం వెలిబుచ్చాయి. తమ మైనార్టీ హోదాను కాపాడుకోవడానికి అవసరమైన పత్రాలు తమ దగ్గర వున్నాయని అన్నారు. మరో వంక బీజేపీ నాయకులు ఈహోదా సమస్య విచారణకు వచ్చినపుడు కేంద్రం తన వైఖరిని కచ్చితంగా చెబుతుందని ప్రకటించారు. జెఎన్‌యు వంటి చోట్ల నిర్బంధానికి పాల్పడిన కేంద్రం ప్రతి సందర్భంలోనూ ఎంఎంయును వివాదాస్పదం చేస్తూ బీజేపీ-ఆరెస్సెస్‌లు మత వివాదాలు రెచ్చగొట్టడానికి సహకరించింది. మొత్తంగానే యుజిసి నిధులు కోతకోయడంతో పాటు ఈ విశ్వవిద్యాలయానికి మరింత ఇబ్బం దులు కలిగించింది. ఇలాంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు మళ్లీ ఈ అంశాన్ని ఎప్పుడు ఏ విధంగా విచారిస్తుందనేది ఒకటైతే, బీజేపీ- ఆరెస్సెస్‌ల పాత్ర ఎలా వుంటుందనేది చూడాల్సిందే. మౌలికంగా లౌకికతత్వ సూత్రాలను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నొక్కిచెప్పడం మంచిదైనా, తుది వాక్యం చెప్పబడలేదని గుర్తుంచుకోవలసి వుంటుంది.
తెలకపల్లి రవి