అమ్రాబాద్‌ గుత్తికోయల్ని మైదాన ప్రాంతాలకు తరలించండి

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
పులుల సంరక్షణ కోసం అమ్రాబాద్‌ అటవీప్రాంతంలోని గుత్తికోయల గ్రామాలను మైదాన ప్రాంతాలకు తరలించాలని అటవీశాఖ ప్రధాన సంరక్షణాధికారి ఆర్‌ఎమ్‌ డోబ్రియల్‌ అధికారుల్ని ఆదేశించారు. గతంలో కవ్వాల్‌ టైగర్‌ రిజర్వులో అక్కడి గ్రామాలను ఎలాగైతే తరలించారో అదే పద్ధతిలో గుత్తికోయల్ని పంపే ఏర్పాట్లు చేయాలని చెప్పారు. దూలపల్లి తెలంగాణ ఫారెస్ట్‌ అకాడమీలో ఆ శాఖ అధికారుల రెండ్రోజుల వర్క్‌షాప్‌ శనివారంతో ముగిసింది. అన్ని జిల్లాల సీసీఎఫ్‌, డీఎఫ్‌ఓ, ఎఫ్‌డీఓలు దీనిలో పాల్గొన్నారు. వారందరికీ డోబ్రియల్‌ దిశానిర్దేశం చేశారు. వైల్డ్‌ లైఫ్‌, క్యాంప, ఫైర్‌ మేనేజ్‌మెంట్‌, సోషల్‌ ఫారెస్ట్‌, హరిత నిధి వంటి పలు అంశాలను చర్చించారు. వచ్చే ఏడాదికి సంబంధించి ఎమ్‌జీఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పథకం కింద నర్సరీల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలనీ, రహదారుల వెంట అవెన్యూ ప్లాంటేషన్‌ ఏర్పాటు, ఎకో టూరిజం, అర్బన్‌ పార్కుల అభివృద్ధి తదితర కార్య క్రమాలు చేపట్టాలని చెప్పారు. జగిత్యాల, వికారాబాద్‌ జిల్లాల్లో నగర్‌ వాన్‌ యోజన పథకం పనుల పురోగతిని సమీక్షించారు. చెక్‌ పోస్టుల పనితీరు, రెగ్యులర్‌ పెట్రోలింగ్‌, బీట్‌ తనిఖీలపై కూడా చర్చించారు. దాడులకి సంబంధించి కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల విచారణను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పీసీసీఎఫ్‌(వైల్డ్‌ లైఫ్‌) ఈలుసింగ్‌ మేరు, పీసీసీఎఫ్‌(అడ్మిన్‌) సునీతా భగవత్‌, సీసీఎఫ్‌లు ప్రియాంక వర్గీస్‌, రామలింగం తదితరులు పాల్గొన్నారు.