‘ఒకేదేశం-ఒకే ఎన్నిక’ లాగే కేంద్రం మరో కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. అయితే ఇది నూతన జాతీయ విద్యావిధానంలో భాగంగా తెచ్చినట్టు చెబుతున్నది. ఇప్పటికే ఈ విద్యావిధానం శాస్త్రీయం కాదని విద్యావంతులు, మేధావులు చెబుతూనే ఉన్నా, కేంద్రం ఎవరి అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకోకుండా ముందుకు సాగుతున్నది విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కొత్తగా ‘ఒకే దేశం-ఒకే స్టూడెంట్’ అనే కొత్త విధానాన్ని రూపొందించింది. అదే.. ఆటోమేటెడ్ పర్మినెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ (అపార్)కార్డు. ప్రతి విద్యార్థికి ఈ కార్డు ద్వారా కేజీ నుంచి పీజీ వరకు చదివే ప్రతి విద్యార్థికి గుర్తింపు సంఖ్యను కేటాయిస్తుందట! కార్డుపై క్యూఆర్ కోడ్‌తో పాటు పన్నెండు అంకెల గుర్తింపు సంఖ్య ఉంటుందట. అపార్‌తో ఎక్కడి నుంచైనా ప్రవేశాలు పొందవచ్చనేది పాలకుల వాదన. దేశంలో పౌరులకు గుర్తింపు కార్డుగా ఆధార్‌కార్డు తీసుకొచ్చినట్టే… విద్యార్థులకు కూడా ఆపార్‌కార్డులు తీసుకొస్తుందన్నమాట. ఇప్పటికే ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల్లో తొమ్మిది, పదో తరగతులు చదువుకుంటున్న విద్యార్థులకు ఈ కార్డులు జారీ చేసేందుకు మార్గదర్శకాలు విడుదల చేసింది. వన్‌నేషన్-వన్ స్టూడెంట్ నినాదం పేరుతో కేంద్ర విద్యాశాఖ అపార్ కార్డుల జారీకి శ్రీకారం చుట్టింది.
ఈ కార్డు తేవడం వెనుకున్న మతలాబేంటో తెలియదు కానీ, ఈ అపార్ నమోదులో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి.అపార్ కార్డు నమోదు కోసం ఆధార్ కార్డును ఉపయోగించాల్సి వస్తున్నది. అయితే నమోదు సమయంలో ఆధార్ కార్డులో వివరాలు, అడ్మిన్ రిజిస్టర్, యూడైస్‌లో వివరాలతో పోలిస్తే తప్పుగా ఉండటంతో సమస్యలు వస్తున్నాయి. దీంతో ఆధార్ కార్డులో మార్పులు చేసుకోవాల్సి వస్తోంది.ఆధార్, అపార్, బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డు అన్నీ లింక్ అయి ఉంటాయి. అపార్ వివరాలు సేకరించే ఏజెన్సీ ఎవరికైనా విక్రయిస్తే విద్యా ర్థులు తీవ్ర ఇబ్బందులకు గురికావడం ఖాయం. అక్టోబర్ 22 నుంచి 25 వరకూ అపార్ నమోదు కార్యక్రమం నిర్వహించారు. అయితే మీసేవా కేంద్రాల్లో కేవలం ఫోన్ నంబర్ అఫ్‌డేట్ వంటి చిన్న చిన్న సమస్యలను మాత్రమే కరెక్షన్స్ చేస్తున్నారు ఆధార్ కార్డులో పుట్టినరోజు, తండ్రి పేరు వంటి వివరాలు మార్చాల్సి వస్తే బర్త్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. ఆస్పత్రుల్లో జన్మించిన వారికి బర్త్ సర్టిఫికేట్ల సమస్య పెద్దగా ఉండటం లేదు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల వద్ద పుట్టిన వారికి ఈ పుట్టినరోజు ధ్రువపత్రం సమస్యగా వస్తోంది. నిరక్షరాస్యత, బర్త్ సర్టిఫికేట్‌కు దరఖాస్తు చేసుకోకపోవటమే ఇందుకు కారణం.
ఈ నేపథ్యంలో అపార్‌లో నమోదు చేసేముందు ఆధార్ కార్డులో, స్కూలు అడ్మిషన్ రిజిస్టర్‌లో వివరాలు ఒకేలా ఉన్నాయో లేదో సరిచూసుకోవటం మంచిది. అవి సరిగా లేకపోవడంతో మండల రెవెన్యూ ఆఫీస్ చుట్టూ విద్యార్థుల తల్లిదండ్రులు చెప్పులరిగేలా తిరుగుతున్నారు. అయినప్పటికీ పనికావడం లేదని వాపోతున్నారు. ఇలాంటి కార్డుల విధానం కేంద్రం తేవడం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది విద్యార్థికి తప్పనిసరి చెబుతుండటంతో, ఇదే అదనుగా నోటరీలకు గిరాకీ పెరిగింది. ఇంటర్నెట్, జిరాక్స్ సెంటర్లలో విపరీతమైన రద్దీ నెలకొంది. విద్యార్థుల నుండి అందినకాడికి దండుకుంటున్నారు. అపార్ నమోదు కోసం ఇన్ని తంటాలా? అని తల్లిదండ్రలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
– డా.ఎం.సురేష్‌బాబు