ఘనంగా యూనియన్ బ్యాంక్ 106వ వార్షికోత్సవం..

106th Anniversary of Union Bank– ఖాతాదారుల ఆదరణతోనే అభివృద్ధి పదంలో ఆర్ధిక సంస్థలు – యూబీ డీ.బీ.ఎం నాగబాబు
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఖాతాదారులు ఆదరణ వల్లే యూనియన్ బ్యాంకు అభివృద్ధి పదంలో ఉందని,  బ్యాంకు లాభాల్లో నడవడానికి వారి నిబద్దతే కారణమని యూనియన్ బ్యాంక్ డిప్యూటీ బ్రాంచ్ మేనేజర్ నాగబాబు అన్నారు.  యూనియన్ బ్యాంకు 106 వ వార్షికోత్సవాన్ని సోమవారం అశ్వారావుపేట శాఖ యూనియన్ బ్యాంక్ ఆర్డీవో శ్రీధర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మొదటిగా ఖాతాదారులు తో సమావేశం నిర్వహించిన బ్యాంక్ అధికారులు బ్యాంక్ అందిస్తున్న సేవలు, ఖాతాదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ ఖాతాదారులకు అందించే సేవలు విషయంలో పారదర్శకత పాటిస్తున్నాం అని,అందుకు వారి సహకారం కూడా సంపూర్ణంగా అందు తుందన్నారు. యూనియన్ బ్యాంకు ఖాతాదారులకు వారికి సంబంధించిన ఖాతాల్లో ఏ సమస్య ఉన్నా,సహాయం కావాలన్నా తక్షణం పరిష్కరించేందుకు అందుబాటులో ఉన్నామన్నారు. అశ్వారావుపేట బ్రాంచ్ రూ.230 కోట్లతో టర్నోవర్ జరుగుతుందని అందులో రూ.102 కోట్లు డిపాజిట్ కాగా రూ.128 కోట్లు రుణాల రూపంలో లావాదేవీలు నడుస్తున్నాయన్నారు. డిజిటల్ రంగంలో యూనియన్ బ్యాంకు మంచి ప్రగతి సాధిస్తుందని రాబోయే తరానికి ముందు చూపుతో సేవలను సులభతరం చేస్తున్నామన్నారు.ఇల్లు నిర్మించుకునేందుకు,వ్యాపార అభివృద్ధికి,వాహనాలకు, త్వరితగతిన రుణాలను మంజూరు చేసేందుకు మా సిబ్బంది సిద్ధంగా ఉన్నారని అర్హులైన వారు మా యూనియన్ బ్యాంకులో సంప్రదించాలని కోరారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు పిన్నమనేని మురళి ,పలువురు ఖాతాదారులు,అసిస్టెంట్ మేనేజర్  రంజిత్ బాబు, ఆర్డీఓ అజ్మీరా శ్రీధర్,బ్యాంకు సిబ్బంది హారిక,మాధవి,సతీష్, జరీనా, సునీత తదితరులు పాల్గొన్నారు.