టంపు – ఇంపు

Tumpu - Impuఆఫీసులో సిబ్బంది అంతా తమ పనుల్లో నిమగమై ఉన్నారు. పని ఒత్తిడి మరీ ఎక్కువగా ఉండటంతో, పక్క సీట్లోని వారితో కూడా మాట్లాడుకోకుండా పని చేసుకుంటున్నారు. ఆఫీసు బాయ్‌ యాదగిరి మాత్రం అన్ని సీట్ల వద్దకు వెళ్లి, వారికేం కావాలో అవన్నీ సమకూర్చుతున్నాడు.
ఇంతలో ఉన్నట్టుండి రఘు ”యాహూ..” అని గట్టిగా అరిచాడు. అందరూ ఉలిక్కిపడి రఘువైపు చూశారు. రఘు సీనియర్‌ క్లర్కు. దాదాపు యాభై ఏండ్లకుపైగా ఉంటాడు. అలాంటి వ్యక్తి చిన్న పిల్లాడిలా అరిచేసరికి అంతా ఆశ్చర్యపోయారు! అయితే రఘు, అరుపుతోనే సరిపెట్టుకోలేదు! యాదగిరిని పిలిచి వెయ్యి రూ||లు గూగుల్‌పే చేశాడు ”పుల్లారెడ్డి స్వీట్సు తీసుకుని రాపో”! అన్నాడు దిలాసాగా.
”నేను పోను సార్‌”! అన్నాడు యాదగిరి నిర్లక్ష్యంగా.
”ఏం ఎందుకు?” అడిగాడు ఆశ్యర్యంగా రఘు. సాధారణంగా యాదగిరి ఎదురు చెప్పడు.
”ఈ ముష్టి వెయ్యి రూపాయలకు పుల్లారెడ్డి స్వీట్లు రావు సార్‌!” అన్నాడు యాదగిరి అదే టోన్‌లో.
రఘు రెండువేలు యాదగిరికి పంపాడు. ”రెండువేలు పంపించాను. మొత్తం మూడు వేలు! ఇప్పుడు పో!’ అన్నాడు.
రఘు మాటలు వింటూనే పక్క సీట్లోని రాణి కండ్లు తిరిగి పడిపోయింది! మిగిలిన వాళ్లంతా పడిపోకుండా ఎలాగోలా నిలదొక్కుకున్నారు. యాదగిరి అప్పటికే బయటికి వెళ్లిపోయాడు.
రాణిని లేపి కూర్చోపెట్టారు! ఎవరో తెచ్చిచ్చిన నీళ్లు తాగి స్థిమిత పడింది రాణి! ఎప్పుడూ జేబులో నుండి, ఫోను నుండి గాని టెస్టింగ్‌ ట్రాన్స్‌ఫర్‌ కోసమైనా ఒక్క రూపాయి కూడా రఘు ఖర్చు పెట్టడు. అందులో కూడా ”హారు” మాత్రమే పంపుతాడు అలాంటి రఘు ఏకంగా మూడువేల రూపాయలు, ఆఫీసులో స్వీట్లు పంచటానికి ఖర్చు చేస్తున్నాడంటే ఇంకా ఎవరూ నమ్మలేకపోతున్నారు!
”సార్‌ లాటరీ ఏమైనా తగిలిందా?” అడిగింది రాణి.
”లేదు! స్వీట్లు తినేటపుడు చెబుతాను!” అని రఘు అంటూ ఉండగానే యాదగిరి స్వీట్లు తెచ్చి అందరికి పంచాడు.
”సార్‌ స్వీట్లు ఎందుకు తెప్పించారు?” ఈసారి యాదగిరి ప్రశ్న.
”మన ట్రంప్‌ భారీ మెజార్టీతో గెలిచాడు కదా! అందుకే స్వీట్లు తెప్పించాను!” అన్నాడు రఘు ఉత్సాహంగా.
ఆ మాట వింటూనే యాదగిరి కాకరకాయ తిన్నట్లు మొహం పెట్టాడు. మిగిలిన వాళ్లలో కొందరు విచిత్రంగా చూశారు!
”అదేంటి అంతా మొహం అట్లా పెట్టారు? మన ట్రంప్‌ గెలవటం ఇష్టం లేదా? ఓహో రష్యా, చైనాలో కమ్యూనిస్టులు, పాకిస్థాన్‌, బంగ్లా దేశ్‌లో ఎవరో గెలిస్తే మీకు సంతోషం కదూ? అన్నాడు రఘు.
”ఎవరు గెలిస్తే సంతోషమో తర్వాత మాట్లాడుకుందాం! కాని మీరు మళ్లీ, మళ్లీ మన ట్రంప్‌ అనకండి సార్‌! కడుపులో తిప్పుతున్నది” అన్నాడు సురేష్‌.
”ట్రంప్‌ గెలిస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంది! ఎందుకంటే ట్రంప్‌ మన పెద్దాయనకు క్లోజ్‌ ఫ్రెండ్‌. అందువల్ల ఇక నుండి అమెరికా మన దేశానికి అనుకూలంగా ఉంటుంది! మనకు ఎంతో సహాయం చేస్తుంది!” అన్నాడు రఘు.
”యాదగిరి ఘొల్లున నవ్వాడు.
”సార్‌! మీరు ట్రంప్‌ను ఫాలో అయ్యారు గాని, ట్రంప్‌ క్యాంపెయిన్‌ను ఫాలో కానట్లున్నారు! అమెరికా ఫస్ట్‌ అని నినాదమిచ్చి గెలిచాడు!” అంటే ప్రపంచంలో అన్నింటిలో అమెరికాను మొదటి స్థానంలో నిలుపుతానని ఆయన వాగ్దానం చేశాడు. అంటే మనకు అమెరికా నుండే పోటీ ఉంటుందన్న మాట!” అన్నాడు యాదగిరి.
”అమెరికా ఫస్ట్‌ అయితే మనం సెకండ్‌ అవుతాం కదా! పెద్దాయన మనకు కావల్సిన దానిని ట్రంప్‌ వద్ద నుండి సాధించగలడు! అదే నా నమ్మకం!” అన్నాడు రఘు.
”సార్‌! అమెరికా తనకు కావల్సింది, ఇతరుల నుండి లాక్కుంటుంది కాని, ఇతరులకు కావల్సిందేది ఇవ్వదు! ట్రంప్‌ మొదటిసారి అధ్యక్షుడైనపుడు మనకేమిచ్చాడో చెప్పండి సార్‌!” అన్నాడు యాదగిరి.
”ఎందుకివ్వలేదు? చాలా ఇచ్చాడు! మనకు కావల్సిన యుద్ధ విమానాలు, మందుగుండు సామాగ్రి, ఇలాంటివెన్నో మనకు అమ్మాడు తెలుసా?” అన్నాడు రఘు గొప్పగా.
”అవన్నీ అమ్మటం సరే! వాటిని తయారు చేసే టెక్నాలజీ ఏదైనా మనకు ఇచ్చారా?” అన్నాడు యాదగిరి.
”టెక్నాలజీ ఇవ్వటానికి అమెరికా ఏమైనా పిచ్చిదా?” అన్నాడు రఘు.
”మిగ్‌, సుఖోరు లాంటి ఫైటర్‌ జెట్ల టెక్నాలజీని మనకు ఇచ్చి తయారు చేసుకోమని చెప్పింది ఎవరో తెలుసా సార్‌! మీరు ఇందాక ఆడిపోసుకున్ప కమ్యూనిస్టు రష్యానే! అంతే కాకుండా మన రూపాయలే తీసుకుంటామని మాట ఇచ్చి అమలు చేసింది కూడా ఆ పిచ్చి రష్యానే సార్‌!” అన్నాడు యాదగిరి.
”ట్రంప్‌ అంటే ఆఫ్ట్రాల్‌ అటెండర్‌వి నీ కెందుకంత కోపం!” కోపంగా అన్నాడు రఘు.
”ఎందుకంటే నేను నా మాతృదేశాన్ని ప్రేమిస్తున్నాను గనక. విదేశాలలోని ప్రభుత్వ విధానాలు నా దేశానికి, భారతీయులకు ఏవిధంగా ఉపయోగపడతాయో ఆలోచిస్తాను గనక” అన్నాడు యాదగిరి.
”మేం దేశభక్తులం! మా కన్నా ఎక్కువ తెలుసా నీకు!” అన్నాడు రఘు.
”దేశమంటే మట్టి కాదోరు! దేశమంటే మనుషులోరు!” అన్నాడు సార్‌ మన గురజాడ. మన ట్రంప్‌ అని మీరు నెత్తికెత్తుకుంటున్నది క్రిస్టియన్‌ను. మరి భారతీయ మూలలున్న కమలా హారిస్‌కు ఎందుకు మద్దతివ్వలేదో చెప్పగలరా? కాబోయే వైస్‌ ప్రెసిడెంట్‌ భార్య, మన తెలుగమ్మాయని, తెలుగింటి అల్లుడు అని సంబరపడుతున్నారు! బ్రిటన్‌కు రిషిసునాక్‌ ప్రధాని అయ్యాడని అప్పట్లో ఇదే విధంగా సంబరపడ్డారు! కాని ఆయన మన దేశానికేమైనా సహాయ పడ్డాడా? కనీసం మన కోహినూర్‌ వజ్రాన్ని తిరిగి మనకు ఇచ్చాడా?” ప్రశ్నించాడు యాదగిరి.
రఘు తలదించుకున్నాడు.
”మన మూలాలు ఉండి విదేశాలకు వెళ్లి అక్కడ గెలిస్తే మనకు ఏమీ లాభం లేదు సార్‌! మన పెద్దాయనకు మంచి దోస్తానా ఉంటే ఏమీ లాభం లేదు సార్‌! వారు అనుసరించే విధానాలు మన దేశానికి తోడ్పడాలి! మనం రోజూ తిట్టుకునే ముస్లిం దేశమైన ఇరాన్‌, కాశ్మీర్‌పై అంతర్జాతీయంగా మనకు మద్దతు ఇచ్చింది! అంతే కాదు! తక్కువ ధరకు క్రూడాయిల్‌ సరఫరా చేసి డాలర్లకు బదులు రూపాయలే తీసుకున్నది. అమెరికా మాత్రం ఇరాన్‌ వద్ద క్రూడాయిల్‌ కొన్నదని మనదేశంపై ఆంక్షలు విధించింది! దాంతో డాలర్లు పెట్టి అధిక ధరకు కొంటున్నాము. ట్రంప్‌ వచ్చి ఆంక్షలు ఎత్తేసి మనకు మేలు చేస్తాడని మీరు చెప్పగలరా?” అడిగాడు యాదగిరి.
రఘు నోరెత్తలేదు!
”సార్‌ నన్ను మీరు ఆఫ్ట్రాల్‌ అన్నారు! మీరు డిగ్రీ చదివి ఉద్యోగం చేస్తున్నారు. నేను ఎం.ఎ. పొలిటికల్‌ సైన్స్‌ చేశాను. మీరు కూడా బాగా చదువుకోండి సార్‌! మీకు వీలుకాకపోతే అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో చదువుకోండి! కాని వాట్సప్‌ యూనివర్సిటీలో చదువుకుని, మనకు నష్టం చేసేవి, కష్టం కలిగించేవే గొప్పవని ప్రచారం చేయకండి సార్‌!” అంటూ యాదగిరి కాకినాడ కాజా రఘు నోట్లో పెట్టాడు.
-ఉషాకిరణ్‌