– పాక్ ప్రభుత్వ నిర్ణయంపైనే పీసీబీ ఆశలు
లాహోర్: వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా జరగాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీ సజావుగా సాగే సూచనలు కనబడడం లేదు. భారత క్రికెట్ కంట్రోల్‌బోర్డు(బిసిసిఐ) టీమిండియా ఆటగాళ్లను పాకిస్తాన్‌కు పంపేందుకు సుముఖంగా లేకపోవడం ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. హైబ్రీడ్ మోడల్‌కు బిసిసిఐ ప్రతిపాదిస్తుండగా.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పిసిబి) అందుకు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు సిద్ధమవుతున్న పాక్‌కు ఇబ్బందులు తప్పడం లేదు. భారత జట్టు అక్కడికి వెళ్లేది లేదని పాక్ క్రికెట్ బోర్డుకు ఐసిసికి నివేదించింది. దీంతో పాక్‌కు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. హైబ్రిడ్ మోడల్‌కు ఒప్పుకొనేది లేదంటూ పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా.. ఒకవేళ టోర్నీ రద్దయితే ఆర్థికంగా నష్టపోవాల్సిన పరిస్థితి. భారత్ లేకుండా ఆడించినా, టోర్నీ నిర్వహించినా ఫలితమదే. దీంతో ఈ నిర్ణయాన్ని తమ ప్రభుత్వం చేతుల్లో పెట్టాలని పిసిబి నిర్ణయించింది. ఈమేరకు ఐసిసి పంపిన ఈ-మెయిల్‌ను ప్రభుత్వానికి పిసిబి పంపినట్లు సమాచారం. ఐసిసి మాత్రం షెడ్యూలింగ్ పేరుతో దాన్ని రద్దు చేసే యోచనలో ఉన్నట్లు వార్తలూ వచ్చాయి. హైబ్రిడ్ మోడల్‌కు పాక్ అంగీకరిస్తే.. భారత్ ఆడే మ్యాచులను దుబారు లేదా షార్జా వేదికగా నిర్వహించే అవకాశం ఉంది. భారత్ నిర్ణయాన్ని మాత్రం పాక్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్, ఇంజమాముల్ హక్ తప్పుబట్టారు. ఐసిసి టోర్నీలను బిసిసిఐ ఓ జోక్‌గా మార్చేసిందని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్‌కు భారత జట్టు వస్తే సకల మర్యాదలు చేసి, సాదరంగా ఆహ్వానిస్తామని ఇప్పటికే పాక్ కెప్టెన్ రిజ్వాన్ తెలిపిన సంగతి తెలిసిందే. అయితే, భద్రతాపరమైన కారణాలతో టీమిండియాను పంపేందుకు బిసిసిఐ అంగీకరించడం లేదు.