ఇటీవల వర్క్ ఫ్రమ్ హౌమ్‌లు ఎక్కువయిపోయాయి. కంటిన్యూగా గంటల తరబడి కూర్చుని పనిచేయడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. సిట్టింగ్ జాబ్స్ ప్రాణాంతకంగా మారుతున్నాయనే హెచ్చరికలు ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. చాలామంది ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యాలయంలో కూర్చొని పనిచేస్తుంటారు. లేదంటే ఇంట్లో కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లతో గంటలతరబడి కుస్తీలు పడుతుంటారు. అయితే, ఒకేచోటు అలా కూర్చుని పనిచేయడం వల్ల రక్త ప్రసరణ సరిగా లేక డీప్ వీన్ త్రొంబోసిస్ (డీవీటీ) అనే వ్యాధికి గురయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రోజంతా కార్యాలయం పనిలో నిమగమయ్యి, పని ఒత్తిళ్లను ఎదుర్కొన్నా రోజుకు కనీసం 40 నిమిషాల పాటు వ్యాయామం తప్పక చేయాలని నిపుణులు చెబుతున్నారు. వ్యాయామం, నడక లాంటి వ్యాపకాలతో మంచి ఫలితాలు అందుతాయని నిపుణులు అంటున్నారు. రోజులో గంటలతరబడి ఒకేదగ్గర కూర్చుని పనిచేయడం వల్ల ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొవాలంటే వ్యాయామమే దానికి సరైన మార్గమని నిపుణులు సూచిస్తున్నారు.
గంటల తరబడి కదలకుండా కూర్చుని చేసే ఉద్యోగాల వల్ల అనారోగ్య సమస్యలు ఉంటాయని, వాటివల్ల ఎదురయ్యే దుష్ఫలితాలకు సంబంధించి నిర్వహించిన వివిధ పరిశీలనను ‘మెటా అనాలిసిస్’చేసింది. డబ్ల్యూహెచ్‌వో మార్గదర్శకాలకు అనుగుణంగా మెరుగైన ఆరోగ్యం కోసం బిజిలైఫ్లో రోజువారీ జీవన విధానాన్ని కొంత మార్చుకుని, దినచర్యలో భాగంగా ఫిజికల్ యాక్టివిటీస్ వంటివి చేర్చితే మెరుగైన ఫలితాలు వస్తాయని నిపుణులు భావిస్తున్నారు.
అనారోగ్య సమస్యలు ఇవే..
– గంటలతరబడి కూర్చుని ఉండడం వల్ల కదలికలు లేక కాళ్లలో రక్తం, ద్రావకాలు ఒకేచోట చేరడం వల్ల గుండెజబ్బులు వచ్చే సమస్యలు అధికంగా ఉన్నాయి.
– ఇది రక్తప్రసారంలో మార్పులకు కూడా కారణమవుతుంది దీంతో అధిక రక్తపోటుకు దారితీస్తుంది.
– ఎక్కువసేపు ఒకేచోట కూర్చుని పనిచేయడం వల్ల మధుమేహ సమస్యలు కూడా వచ్చే అవకాశాలున్నాయి.
– గంటల తరబడి కూర్చొవడం వల్ల కొన్నిరకాల కేన్సర్ల బారిన పడే అవకాశం కూడా ఉంది.
– మానసిక ఒత్తిళ్లతో పాటు ఆందోళనలు, చిరాకు వంటివి కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
వీటిని చేయండి..
– ఎక్కువ సేపు కూర్చోకుండా మధ్యమధ్యలో లేచి నిల్చోవాలి.
– కొంత దూరం అటు ఇటు నడిస్తే మంచిది.
– చేస్తున్న పని నుంచి కొంతసేపు విరామం తీసుకోవాలి.
– కూర్చునే పనిచేయకుండా కాసేపు వీలును బట్టి నిల్చోవాలి.