సంపన్న దేశాల సాయం పెరగాలి

Aid from rich countries should increase– కాప్‌ 29లో వర్ధమాన దేశాల విజ్ఞప్తి
– రుణాల రూపంలో సాయంపై ఆందోళనలు
– అపరిష్కృత అంశాలతోనే తాజా ముసాయిదా
– తాజా ప్రతిపాదనలను తిరస్కరించిన జి 77 ప్లస్‌ చైనా
– ప్రయివేటు రంగమూ ముందుకు రావాలన్న ప్రపంచ బ్యాంక్‌, ఐఎంఎఫ్‌
బాకూ : పేద, వర్ధమాన దేశాలకు సంపన్న దేశాల నుండి సమానమైన ఆర్థిక తోడ్పాటు అందాలని వర్ధమాన దేశాలు పిలుపిచ్చాయి. ఇక్కడ జరుగుతున్న వాతావరణ మార్పులపై చర్చల్లో భాగంగా భావసారూప్య వర్ధమాన దేశాల గ్రూపు నుండి భారత్‌ ఈ మేరకు విజ్ఞప్తి చేసింది. అభివృద్ధి చెందిన దేశాలు పేద, వర్ధమాన దేశాలకు అందించే ఈ సాయంలో దాదాపు 69శాతం రుణాల రూపంలోనే వస్తోందని, దీనివల్ల సాయం అందడం బదులు అసలే ఇబ్బందుల్లో వున్న దేశాలపై అదనపు భారం పడుతోందని ఆందోళనలు వ్యక్తమయ్యాయి. లైక్‌ మైండెడ్‌ డెవలపింగ్‌ కంట్రీస్‌ (ఎల్‌ఎండిసి), జి 77 ప్లస్‌ చైనా, బేసిక్‌ (బ్రెజిల్‌, దక్షిణాఫ్రికా, ఇండియా, చైనా) వంటి కీలకమైన గ్రూపుల్లో భారత్‌ ఇతర వర్ధమాన దేశాలతో కలిసి వాతావరణ నిధి, సమానత్వం, సాంకేతికత బదిలీ వంటి అంశాలపై తన వాదనలు వినిపిస్తూ, వాటిని ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తోంది. నూతన కైమేట్‌ ఫైనాన్స్‌ లక్ష్యంపై చర్చలు జరిపేందుకు రూపొందించిన ముసాయిదాను జి 77 ప్లస్‌ చైనా గ్రూపు తిరస్కరించింది. ఐక్యరాజ్య సమితి వాతావరణ చర్చల్లో దాదాపు 130 దేశాలకు ఈ గ్రూపు ప్రాతినిధ్యం వహిస్తోంది. ఈ ఏడాది వాతావరణ సదస్సులో న్యూ కలెక్టివ్‌ క్వాంటిఫైడ్‌ గోల్‌ (ఎన్‌సిక్యుజి) కీలకమైన అంశంగా వుంది. అంతర్జాతీయంగా వెలువడే కాలుష్య ఉద్గారాలను నియంత్రణలోనే వుండేలా చూసేందుకు సమిష్టిగా చర్చించి, కృషి చేయాలన్నది ఉద్దేశ్యంగా వుంది. వాతావరణ మార్పుల విషయంలో సమర్ధవంతమైన కార్యాచరణకు అడ్డు పడుతున్న ఆర్థిక అంతరాలను పరిష్కరించాలని ఎల్‌ఎండిసి గట్టిగా డిమాండ్‌ చేస్తోంది. సంబంధిత పక్షాల మధ్య విశ్వాసం నెలకొనాలంటూ ఆర్థిక నిబద్ధతను పాటించడం అత్యంత కీలకమని పేర్కొంటోంది. కఠినమైన పెట్టుబడుల లక్ష్యాలను విధించే ఈ కొత్త ఫైనాన్సింగ్‌ సూత్రాలపై ఎల్‌ఎండీసీ దేశాలు తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేశాయి. పరిమిత వనరులు కలిగిన చిన్న దేశాలను బాగా ప్రభావితం చేస్తాయని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో అన్ని వర్ధమాన దేశాలకు సమానంగా అవకాశాలు కల్పించేలా సుస్థిరమైన రీతిలో వాతావరణ నిధులు అందచేందుకు కృషి చేయాల్సిన అవసరం వుందని భారత్‌ సహా ఇతర సభ్య దేశాలు స్పష్టం చేశాయి.
అపరిష్కృత అంశాలతోనే తాజా ముసాయిదా
పేద దేశాలకు నిధులను పెంచేందుకు నిర్దిష్ట మార్గాలు, అవకాశాలను తాజా ముసాయిదాలో బుధవారం ప్రతిపాదించారు.
అయితే ఒప్పందం కుదరకుండా దీర్ఘకాలంగా జాప్యం జరుగుతూ రావడానికి కారణమైన అంశాలు పరిష్కారం కాకుండానే మిగిలిపోయాయి. వర్ధమాన దేశాల్లో వాతావరణ మార్పులపై చేపట్టాల్సిన కార్యాచరణకు అవసరమైన నిధులను పెంచడంపై ఒప్పందం కుదుర్చుకోవడం ఈ ఏడాది సదస్సులో ప్రధాన అంశంగా వుంది. దాదాపు 200 దేశాల నుండి వచ్చిన ప్రతినిధులు సుదీర్ఘంగా చర్చలు జరిపినా ఏకాభిప్రాయం మృగ్యమైంది, విభేదాలు అలానే వున్నాయి.
కనీసం లక్షా 30వేల కోట్ల డాలర్ల మేరకు సంపన్న దేశాల నుంచి వార్షిక సాయం వుండాలని వర్ధమాన దేశాలు కోరుతున్నాయి. ప్రస్తుతం అమెరికా, ఈయూ, జపాన్‌లు సహా సంపన్నదేశాలు చెల్లిస్తున్న ఏటా వంద బిలియన్ల డాలర్ల కన్నా ఇది 10రెట్లు ఎక్కువే. అయితే ఈ మొత్తాలను పెంచడానికి కొన్ని దేశాలు సుముఖంగా లేవు.
ప్రయివేటు రంగ ప్రాధాన్యతను నొక్కి చెప్పిన ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంక్‌ నేతలు
అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్‌తో కలిసి పనిచేస్తామని ప్రపంచ బ్యాంక్‌, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థల అధినేతలు పేర్కొన్నారు. వాతావరణ మార్పులపై పోరాడుతున్న వర్ధమాన దేశాలకు సాయం అందించే విషయంలో ప్రయివేటు రంగం ప్రాధాన్యతను వారు నొక్కి చెప్పారు. వాతావరణ నిధిలో ప్రయివేటు పెట్టుబడులు పెరగాలని, ఆ దిశగా ప్రోత్సాహం అందించాలని కోరారు. హరిత సాంకేతిక రంగాల్లో అమెరికా ప్రైవేటు రంగం పెట్టుబడులు పెట్టగలదని ఐఎంఎఫ్‌ చీఫ్‌ క్రిస్టినా జార్జివా ఆశాభావం వ్యక్తం చేశారు.