నవతెలంగాణ-భద్రాచలం రూరల్
అసోం రాష్ట్ర సరిహద్దుల్లో పహారా కాస్తూ మరణించిన వీర సైనికుడు కొంగ సాయి చందర్రావు సేవలకు సీపీఐ(ఎం) భద్రాచలం పట్టణ కమిటీ ఘన నివాళి అర్పించింది. బుధవారం పట్టణంలో జరిగిన సాయి చందర్రావు సంస్మరణ సభలో పార్టీ పట్టణ కార్యదర్శివర్గ సభ్యులు బండారు శరత్‌బాబు మాట్లాడారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన చందర్రావు సేవలు చిరస్మరణీయమని అన్నారు. కొంగ సాయి చందర్రావు తాత కొంగ సూర్యారావు మార్క్సిస్టు పార్టీ నేతగా ప్రజలందరికీ సుపరిచితులని, నిత్యం ప్రజలకు సేవ చేయాలనే తపన కలిగిన కుటుంబమని చెప్పారు. ఆ కుటుంబం నుంచి సాయి చందర్రావు కూడా సైనికునిగా దేశానికి సేవ చేయాలనే దృక్పథంతో సైన్యంలో చేరి 12 సంవత్సరాలుగా వివిధ ప్రాంతాల్లో సేవలందించారని తెలిపారు. ఇటీవల అసోం సరిహద్దుల్లో ఏనుగుల గుంపు దాడిలో గాయపడి వీరమరణం పొందారని అన్నారు. ఆయన స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, కార్యదర్శి వర్గ సభ్యులు పి.సంతోష్ కుమార్, నాదెళ్ల లీలావతి, పట్టణ కమిటీ సభ్యులు డి.సీతాలక్ష్మి, యు.జ్యోతి, జీవనజ్యోతి, నకిరికంటి నాగరాజు, శాఖ కార్యదర్శులు డి.రామకృష్ణ, జి. నాగలక్ష్మి, జి.రాధ తదితరులు పాల్గొన్నారు.