– పంటంతా దళారులపాలు
– పత్తి రైతుల పరిస్థితి అధ్వానం
– సీఎంకు ఎక్సైజ్ శాఖ మీద ఉన్న సోయి రైతులపై లేదు
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు
నవతెలంగాణ-మర్రిగూడ
ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన బుధవారం పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లాలో గత సంవత్సరం 4 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగితే, ఈ సంవత్సరం కృష్ణా నదిలో నీరు రావడం, సాగర్ ప్రాజెక్టు నిండటం వల్ల దాదాపు ఐదున్నర లక్షల ఎకరాల్లో వరి సాగైందని తెలిపారు. దాదాపు ఏడున్నర లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు, ప్యాక్స్ కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అంచనా వేశారన్నారు. కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ధాన్యమంతా దళారుల పాలైందని విమర్శించారు. ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామన్న ముఖ్యమంత్రి నేటికీ ఆ ఊసే ఎత్తటం లేదన్నారు. ఎన్నికల హామీలో రైతులకు అన్ని పంటలకు బోనస్, రూ.15 వేల రైతు భరోసా, రెండు లక్షలు రుణమాఫీ చేస్తానన్న కాంగ్రెస్.. అధికారంలోకొచ్చి 11 నెలలు అవుతున్నా అమలు చేయకుండా రైతులను మోసం చేస్తోందన్నారు. సివిల్ సప్లై మంత్రి ఉన్న నల్లగొండ జిల్లా రైతులే దాదాపు నాలుగైదు సార్లు రోడ్డు ఎక్కారని చెప్పారు. ఆరు గ్యారంటీల అడ్రస్సే లేదని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మాత్రమే పెట్టి ప్రభుత్వం చేతులు దులుపుకుందని విమర్శించారు.
సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. కొనుగోళ్లు జరగక, మద్దతు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయని చేతలు మాత్రం గడప దాటడం లేదని, ఆయనకు ఎక్సైజ్ శాఖ మీద ఉన్న సోయి రైతులపై లేదని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతే రాజుగా ఉన్నారని, కరోనా సమయంలో కూడా రైతులకు పెట్టుబడి సహాయం అందిందని, 11 సార్లు రైతుబంధు సహాయం అందిందని గుర్తు చేశారు. ప్రభుత్వం తక్షణమే రైతు భరోసా నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అనంతరం మండల కేంద్రంలో ఇటీవల మృతి చెందిన రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యులు పొనుగోటి అంజన్‌రావు కుటుంబాన్ని హరీశ్‌రావు పరామర్శించారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పాల్వాయి స్రవంతి, మాజీ ఎంపీపీ మెండు మోహన్ రెడ్డి, మాల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ దంటు జగదీశ్వర్, ఎఫ్ఎస్సిఎస్ చైర్మెన్ బాల నరసింహ, ఫ్యాక్స్ చైర్మెన్ పందుల యాదయ్య గౌడ్, బచ్చు రామకృష్ణ, బీఆర్ఎస్ జిల్లా నాయకులు చెరుకు లింగంగౌడ్, మాజీ ఎంపీటీసీ ఊరుపక్క సరిత నగేష్, మాజీ సర్పంచ్ నల్ల యాదయ్య ఉన్నారు