సుకినీతండా కుర్రోడు సూపర్‌

Sukinithanda boy is super– జాతీయ స్థాయిలో గిరిజన కీర్తి పతాక.. కార్తీక్‌
– మినిస్ట్రీ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండిస్టీ ఎగ్జామ్‌లో ర్యాంక్‌
– పేటెంట్స్‌ అండ్‌ డిజైన్స్‌ ఎగ్జామినర్‌గా ఎంపిక
– ఆన్‌లైన్‌ కోచింగ్‌తోనే సక్సెస్‌
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
‘పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది’ అన్నట్టు గిరిజన ఆణిముత్యం మాలోత్‌ కార్తీక్‌ చిన్ననాటి నుంచి చదువులో రాణిస్తున్నారు. తాను జన్మించింది.. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మారుమూల గిరిజన తండాలోనైనా అతని చదువులో రాణిస్తున్న తీరుతో స్వగ్రామం సుకినీతండాకు పేరు ప్రఖ్యాతలు దక్కుతున్నాయి. మూడేండ్ల్ల క్రితం ఇంజనీరింగ్‌ సర్వీస్‌ ఎగ్జామ్‌లో జాతీయస్థాయి 27వ ర్యాంక్‌ సాధించిన కార్తీక్‌ లిగ్నైట్‌ ఇండియా లిమిటెడ్‌లో డీఈగా ఉద్యోగం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఐఈఎస్‌లో ఎలక్ట్రానిక్స్‌, టెలి కమ్యూనికేషన్స్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో ఆరుగురిని ఎంపిక చేయగా కార్తీక్‌ నాలుగో స్థానం పొందటం గమనార్హం. ఇప్పుడు అదే పట్టుదలతో ఆన్‌లైన్‌లో విద్యనభ్యసిస్తూ మినిస్ట్రీ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండిస్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘పేటెంట్స్‌ అండ్‌ డిజైన్స్‌ ఎగ్జామినర్‌’గా ఎంపికయ్యారు. ఈ పరీక్షలో మాలోత్‌ కార్తీక్‌ జాతీయ స్థాయిలో 515వ ర్యాంక్‌ సాధించారు. గతేడాది డిసెంబర్‌లో ప్రాథమిక పరీక్ష, ఈ ఏడాది జనవరి 25న నిర్వహించిన మెయిన్స్‌ పేపర్‌-1, ఫిబ్రవరి 5న మెయిన్స్‌ పేపర్‌-2, ఏప్రిల్‌ 1 నుంచి 26 మధ్య నిర్వహించిన ఆఫ్‌లైన్‌ ఇంటర్వ్యూలకు కార్తీక్‌ హాజరయ్యారు. ఇందులో ఆయన ప్రతిభ చాటి జాతీయ స్థాయిలో 515వ ర్యాంక్‌ పొందారు. గ్రూప్‌-ఏ గెజిటెడ్‌ స్థాయి ఉద్యోగం సాధించి ఆదర్శంగా నిలవడంతో కార్తీక్‌ తల్లిదండ్రులు పార్వతి, బాషా హర్షం వెలిబుచ్చారు.
మాలోత్‌ కార్తీక్‌ చిన్ననాటి నుంచి చదువులో మేటి. కార్తీక్‌ ఖమ్మంలో పదో తరగతి, హైదరాబాద్‌లో ఇంటర్‌, గౌహతి ఐఐటీ కళాశాలలో ఎలక్ట్రానిక్స్‌, టెలికమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ను 2019లో పూర్తి చేశారు. చిన్ననాటి నుంచి నేటి వరకు ప్రతి పరీక్షల్లోనూ టాపర్‌గానే నిలుస్తున్నారు. సివిల్స్‌లో ర్యాంకు సాధించి ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఇంజినీరింగ్‌ సర్వీసులకు ఎంపిక కావడమే తన లక్ష్యమని మాలోత్‌ కార్తీక్‌ తెలిపారు. కష్టపడి చదవడంతో పాటు అన్ని సబ్జెక్ట్‌లపై పట్టు సాధిస్తే ఏ పరీక్ష అయినా సక్సెస్‌ కావొచ్చని, జాతీయ స్థాయిలో ఇప్పటికీ రెండు, మూడు పర్యాయాలు ర్యాంకులు సాధించడం ఆనందంగా ఉందని అన్నారు. కాగా, జాతీయ స్థాయి పరీక్షలో ర్యాంకు సాధించిన కార్తీక్‌ను వైరా ఎమ్మెల్యే మాలోత్‌ రాందాస్‌నాయక్‌, అక్కడే రెసిడెన్షియల్‌ పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న అతని తల్లి పార్వతి, వైరాలోనే ఎక్సైజ్‌ ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న అతని తండ్రి బాషా, అక్క మౌనిక, వైరా మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మెన్‌ నర్సింహారావు, తెలంగాణ గిరిజన సంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శి భూక్యా వీరభద్రం తదితరులు అభినందించారు. కుటుంబసభ్యులతో పాటు వీరంతా ఫోన్‌లో శుభాకాంక్షలు తెలిపారు.