పాట్నాలో ట్రైలర్‌ లాంచ్‌

పాట్నాలో ట్రైలర్‌ లాంచ్‌”పుష్ప’ అంటే ఫ్లవర్‌ అనుకుంటివా.. ఫైర్‌… నీయవ్వ తగ్గేదేలే.. ‘పుష్ప ది రైజ్‌’లో అల్లు అర్జున్‌ చెప్పిన ఈ మాసీవ్‌ డైలాగులు ఇంకా మారు మోగుతూనే ఉన్నాయి. డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప ది రైజ్‌’తో అల్లు అర్జున్‌ క్రియేట్‌ చేసిన సెన్సేషన్‌ అంతా ఇంతా కాదు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా గురించి మరోసారి ఈ సినిమా ద్వారా అందరూ మాట్లాడుకోవడం విశేషం.
ఇక త్వరలోనే ‘పుష్ప-2 ది రూల్‌’ ద్వారా అల్లు అర్జున్‌-సుకుమార్‌ల ద్వయం మరో బిగ్గెస్ట్‌ సెన్సేషన్‌ సష్టించబోతున్నారు. డిసెంబరు 5 నుంచి బాక్సాఫీస్‌ కలెక్షన్ల సునామీ రాబోతుంది. సుకుమార్‌ రైటింగ్స్‌ అసోసియేషన్‌తో మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు ఎగ్రెసివ్‌గా స్టార్‌ అయ్యాయి.
త్వరలోనే ఈ చిత్ర ప్రమోషన్స్‌ను పాట్నా, కలకత్తా, చెన్నై, కొచ్చి, బెంగళూరు, ముంబరు, హైదరాబాద్‌లో వినూత్నంగా నిర్వహించ బోతున్నారు. ఇందులో భాగంగానే ఈ చిత్ర ట్రైలర్‌ లాంచ్‌ను ఈ నెల 17న పాట్నాలో అత్యంత గ్రాండ్‌గా చేయబోతున్నారు.
దీనికి సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఒకవైపు చివరి దశలో ఉన్న చిత్రీకరణతో పాటు మరో వైపు నిర్మాణానంతర పనులను ఈ చిత్రం జరుపుకుంటోంది. ఫహాద్‌ ఫాజిల్‌, రావు రమేష్‌, సునీల్‌, అనసూయ భరద్వాజ్‌ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
 నిర్మాతలు నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌ :‘తెలుగు సినిమా చరిత్రలో ‘పుష్ప’ సినిమాకి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమా అటు ప్రేక్షకులు, ఇటు విమర్శకుల ప్రశంసలను సొంతం చేసుకుంది. అలాగే ఇన్నేండ్ల జాతీయ చలన చిత్ర పురస్కారాల చరిత్రలో మన తెలుగు హీరోలకు ఉత్తమ నటుడిగా స్థానం దొరకలేదు. అలాంటిది ఈ సినిమాలోని నటనకు అల్లుఅర్జున్‌ జాతీయ ఉత్తమ నటుడిగా నిలవడం మాకెంతో గర్వంగా ఉంది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర సంచలనం సృష్టించింది. అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబోలో రాబోతున్న ‘పుష్ప2′ సినిమాపై ఇప్పటికే అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు మించి ఉండేలా ఉన్న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 12 వేల థియేటర్లలో డిసెంబర్‌ 5న విడుదల చేస్తున్నాం’.