అమెరికా అధ్యక్ష ఎన్నికల పోటీ భీకరంగా జరగబోతుందన్న ఎన్నికల జోస్యాలను వమ్ము చేస్తూ డోనాల్డ్ ట్రంప్ నిర్ణయాత్మక విజయం సాధించారు. ఆయనకు 538 ఎలక్టోరల్ ఓట్లలో 312 రాగా ప్రజల ఓట్లలోనూ 51 శాతం తెచ్చుకుని కమలాహారిస్‌ను చిత్తు చేశారు. ఉదారవాద మీడియా కమలాహారిస్‌కు అనుకూలంగా ఎన్ని కథనాలు ఇచ్చినా స్వతంత్ర పరిశీలకులకు మాత్రం ట్రంప్ గట్టిగా ముందుకు పోతున్నారని మొదలే స్పష్టమైంది. గత నెల రోజుల్లోనూ ఆయన వలసలు, పెరిగిపోతున్న నేరాలు, ‘కులీనుల’నే వారికి వ్యతిరేకంగా జనరంజన భాషలో పిలుపులివ్వడం, వివిధ తరగతుల ఓటర్లలో మంచి స్పందన తీసుకువచ్చాయి. జీవన వ్యయం పెరుగుదల, ధరల పెరుగుదల కారణంగా బైడెన్ ప్రభుత్వంపై పెరిగిన అసంతృప్తి కూడా ట్రంప్‌కు తోడ్పడింది.
డెమోక్రాట్ల వైఫల్యం
మరోవైపున కమలాహారిస్ ఎన్నికల ప్రసంగాలు వట్టి ఊక దంపుడుగా ఎలాంటి ప్రత్యామ్నాయ విధానాలు లేదా దార్శనికత ఇవ్వలేకపోయాయి. ట్రంప్ మరోసారి అధ్యక్షుడైతే ప్రజాస్వామ్యానికి ప్రమాదమన్న ఒక్క రాగం మాత్రమే వినిపిం చారామె. కార్మికవర్గం హక్కుల పరిరక్షణ కోసం, కార్పొరేట్ల దోపిడీ, అధిక రేట్లతో లాభాలను పిండుకునే వాల్‌స్ట్రీట్ ప్రభువులకు వ్యతిరేకంగా ఇంకా శక్తివంతంగా ప్రచారం చేసి వుంటే డెమోక్రాట్లకు మరింత మద్దతు లభించి వుండేది. అయితే డెమొక్రటిక్ పార్టీ వ్యవస్థ అంతర్గత ముఠాకు వాల్‌స్ట్రీట్ ఫైనాన్షియర్లతో, టెక్ కోటీశ్వరులతో సంబంధాలున్నాయి. ఈ కారణంగానే కమలాహారిస్ ప్రచారం ప్రజాస్వామ్యం ప్రమాదంలో వుందనే పల్లవికీ, ఏవో కొన్ని తలాతోకా లేని విధాన చొరవలకు పరిమితమైంది. మహిళల సంతానోత్పత్తి హక్కులు, గర్భస్రావ హక్కు అనే అంశం మాత్రమే వివరంగా వచ్చింది కానీ అదొక్కటే విస్తారమైన మద్దుతు సాధించే ందుకు సరిపోలేదు.
జెండర్ కోణం
జెండర్ సమస్య కూడా ప్రముఖ పాత్ర వహించిందని ఈ ఫలితం స్పష్టం చేసింది. గతంలో ట్రంప్‌కు కేవలం శ్వేత జాతి పురుషులు మాత్రమే మద్దతుగా నిలిస్తే ఈసారి నల్లజాతి లాటినో పురుషులు కూడా కమలా హారిస్‌ను బలపర్చేందుకు ముందుకు రాలేదు. ఆ సమాజంలో పురుషాధిక్యత ఎంతగా పాతుకొని పోయిందో నగంగా బయటపడింది. డెమొక్రటిక్ పార్టీ వృత్తి నిపుణులు, అధిక జీతాలు పొందే కాలేజీ గ్రాడ్యుయేట్లు కార్పొరేట్లకే ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు భావించబడింది. ఈ భావన కారణంగానే సంప్రదాయికంగా డెమొక్రాట్ల మద్దతు దారులను కూడా దూరం చేసింది. ముఖ్యంగా మిషిగాన్ పెన్సిల్వేనియా, విస్కాన్సిన్, ఓహియో వంటి చోట్ల ఇది జరిగింది. చాలా విడ్డూరమైన రీతిలో కార్మికవర్గం శతకోటీశ్వర అభ్యర్థులను బలపర్చింది. వారు పచ్చిగా వ్యాపార అనుకూల కార్పొరేట్ అనుకూల విధానాలే అమలు చేస్తారు. సంపన్నుల పన్నులు కూడా కుదిస్తారు. ట్రంప్ పర్యావరణ చట్టాలను పూర్తిగా తలకిందులు చేస్తారు. రాతి పొరలను తొలచి చమురు తీసే ఫ్రాకింగ్ పరిశ్రమను ప్రోత్సహిస్తారు. మిషిగన్ వంటి స్వింగ్ రాష్ట్రాలలో హారిస్ ఓడిపోవడానికి అరబ్ అమెరికన్ ఓట్లను పోగొట్టుకోవడమే కారణం కావడం ఒక విపరీతమైన విషయం. గాజా మారణకాండ పట్ల బైడెన్, హారిస్ ప్రభుత్వం బేఖాతరుగా వ్యవహరించిన తీరుతో వారు ఆగ్రహోదగ్రులైనారు. చాలా మంది యువత కూడా ఈ కారణంగానే కమలా హారిస్ అభ్యర్థిత్వం నుంచి దూరంగా వుండిపోయారు.
మితవాద పార్టీల ప్రాబల్యం
యూరప్‌లోనూ ఇంకా ఇతర దేశాలలోనూ పచ్చి మితవాద పార్టీలు ముందుకొస్తున్న నేపథ్యంలోనే ట్రంప్ విజయాన్ని చూడవలసి వుంటుంది. వలసల సమస్య, బయిటి దేశాల వారు వచ్చేస్తారనే భయం ఈ ధోరణిలో ప్రధానాంశం. రిపబ్లికన్లు సెనేట్‌లో మెజార్టీ పొందడంతో ఇప్పుడు ట్రంప్ మొత్తం మితవాద అభివృద్ధి నిరోధక విధానాలను మొత్తంగా ముందుకు నెట్టేందుకు మార్గమేర్పడుతుంది. బయటి ప్రపంచానికి సంబంధించినంత వరకూ డెమొక్రాట్లకు, రిపబ్లికన్లకు మధ్యన ఎంచుకోవలసిన తేడా ఏమీ వుండదు. ఉభయ పార్టీలూ సామ్రాజ్యవాద యుద్ధోన్మాద పార్టీలే. క్లింటన్, బుష్ ఎవరు వున్నా అమెరికా యుద్ధ వ్యాపార యంత్రానికి ఇరాక్, పశ్చిమాసియాల ప్రజలే టార్గెట్‌గా వుంటారు. ట్రంప్ లాగే బైడెన్ కూడా గుడ్డిగా ఇజ్రాయిల్‌ను సమర్థించే విధానాన్ని కొనసాగించారు. గాజాలో జాతిహనన యుద్ధానికి బైడెన్ ప్రభుత్వం నిధులు, సామగ్రి సమకూర్చింది. సైనిక జోక్యాలతోనో లేదా ఆంక్షలతోనో ఆమెరికా ఆధిపత్యాన్ని చెలాయించే విషయంలోనూ డెమోక్రాట్లకు, రిపబ్లికన్లకు మధ్య తేడా ఏమీ వుండదు.
మోడీకి సంతోషమే
ట్రంప్ ప్రభుత్వం మళ్లీ రావడం పాలస్తీని యన్లకు వ్యతిరేకమైన పరిణామమే. ఎందుకంటే ఆయన ఇజ్రాయిల్‌ను ఎంతో గట్టిగా సమర్థించే వ్యక్తి. నెతన్యాహుకు బాగా మద్దతుగా నిలబడతారు. వాణిజ్య సంబంధాలకు వస్తే సుంకాలు, ఆంక్షలు పెంచుతారు గనక చైనాతో సంబంధాలు ఇంకా ఇబ్బందికరంగా మారొచ్చు. అమెరికా ప్రథమం అనే ట్రంప్ విజన్ (ముందు చూపు) రీత్యా యూరప్‌లోని వారి మిత్ర దేశాలూ, నాటో పరిస్థితి అనిశ్చిత దశలోకి ప్రవేశించొచ్చు. రష్యాతో, ఉక్రెయిన్‌తో యుద్ధానికి బేషరతుగా మద్దతునిచ్చే విధానానికే ట్రంప్ అంటుకుని వుంటాడా అనేది చూడవలసి వుంటుంది. మొత్తం మీద చెప్పాలంటే రాబోయే కాలంలో అంతర్జాతీయ సంబంధాలలో ఇదమిద్దంగా చెప్పలేని ఒక అనిశ్చిత ఘట్టం ప్రవేశిస్తుంది. నరేంద్ర మోడీకి ట్రంప్ సైద్ధాంతిక సాన్నిహిత్యం గల స్నేహితుడు గనక తన గెలుపు పట్ల ఆయన సంతోషిస్తారు. అధిక సుంకాలు, హెచ్1 బి వీసాల సంఖ్య కుదింపు వంటివి చికాకు పెట్టే అంశాలైనా భారత అమెరికా వ్యూహాత్మక బంధాలు మరింత ఊపందుకుంటాయని భావించవచ్చు.
(నవంబరు 6 ‘పీపుల్స్ డెమోక్రసీ’ సంపాదకీయం)