‘కల అంటే నిద్రలో వచ్చేది కాదు.. మిమ్మల్ని నిద్రపోనీకుండా చేసేది’ అన్న కలామ్ సూక్తిని అక్షరాల ఒంటబట్టించుకున్నాడు ఉత్తరప్రదేశ్ ముజఫర్‌నగర్‌కి చెందిన అతుల్. ఐఐటి ధనాబాద్‌లో ఇంజినీర్ చదవాలన్నది అతని కోరిక. అయితే ఆర్థిక ఇబ్బందులతో డబ్బులు సమకూరేసరికి జరిగిన జాప్యం వల్ల క్షణాల వ్యవధిలో ఆ కల చెదిరిపోయింది. ఫీజు గడువు ముగిసి, సీటు కోల్పోయాడు. అయితే ఈ కుర్రాడు తన కల ఎలాగైనా సాధించాలన్న పట్టుదల కలవాడు. అందుకే ఏడుస్తూ కూర్చోలేదు. మూడు నెలల పాటు పోరాటం చేశాడు. సుప్రీం వరకు వెళ్లాడు. న్యాయం జరిగేవరకు కంటి మీద కునుకులేకుండా గడిపాడు. ఖర్చుల కోసం డబ్బులు ఆదా చేసేందుకు ఒక్క పూట తిన్నాడు. ఎట్టకేలకు అతడి కోరిక నెరవేరింది. కాలేజీలో సీటు సాధించాడు. అతడి పోరాట స్ఫూర్తికి, చదువుకోవాలనుకున్న తపనకి న్యాయం ముగ్ధురాలైంది. పేదింటి కుర్రాడు సాధించిన అపూర్వ విజయమిది.
అతుల్ తండ్రి రాజేంద్ర కుమార్ మీరట్ ఫ్యాక్టరీలో రోజుకు రూ.450 వేతనానికి పని చేస్తాడు. 6గురు ఉన్న ఆ కుటుంబంలో అతని సంపాదన తినడానికే సరిపోదు. అయినా బిడ్డలను చదివించడంలో రాజేంద్ర ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. తన నలుగురు బిడ్డలని ఉన్నత చదువులు చదివిస్తున్నాడు. అతుల్ అందరిలో చిన్నవాడు.
ఐఐటి నా కల..
తిన్నా తినకపోయినా పిల్లలను చదివించాలన్న తండ్రి లక్ష్యాన్ని పిల్లలందరూ ఒంటబట్టించుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎంతలా వేధించినా చదువొక్కటే తమ బతుకులు బాగుచేస్తుందని బలంగా నమ్మారు. ఒకరిని చూసి మరొకరు స్ఫూర్తిని పొందే ఆ కుటుంబంలో అతుల్‌కి తన అన్నయ్యలే ప్రేరణ. ‘ఐఐటి ఖరగ్‌పూర్, ఎన్‌ఐటి హమీర్‌పూర్‌లో ఇద్దరు అన్నయ్యలు చదువుతున్నారు. మూడో అన్నయ్య ఖటౌలిలోని శ్రీకుంద్ జైన్ డిగ్రీ కాలేజీలో బిఎ హిందీ ఆనర్స్ చేస్తున్నాడు. అన్నయ్యల స్ఫూర్తితో 9వ తరగతి నుండే ఇంజినీర్ కావాలని కల ఉండేది’ అంటున్న అతుల్ పాఠశాల విద్య పూర్తిచేసి, జెఇఇలో మంచి ర్యాంకు సాధించాడు.
అప్పు తెచ్చేసరికి ఆలస్యమైంది
ధనాబాద్ ఐఐటిలో ఇంజినీర్ సీటు ప్రవేశ ఫీజు రూ.17,500. ఈ మొత్తం కూడా భరించే శక్తి లేని కుటుంబం వాళ్లది. ‘నాన్న దగ్గర ఉన్న రూ.3,500లకు తోడు అప్పుల కోసం ఎంతో ప్రయత్నించాం. బంధువులు, ఇరుగుపొరుగు సాయం కోరాం. ఎట్టకేలకు డబ్బు సమకూరింది. అయితే గడువు తేదీ ముగియడంతో కొన్ని సెకన్ల ముందే ఫీజు చెల్లించే పోర్టల్ ఆగిపోయింది’ అని అతుల్ ఆ రోజుని గుర్తు చేసుకున్నాడు.
ఫీజు సొమ్ము చాలా తక్కువే. అయినా అతుల్ లాంటి కుటుంబాలు వాటిని భరించడం ఎంతో కష్టం. ఇలాంటి కుటుంబాలు మన చుట్టూ ఎన్నో ఉంటాయి. పిల్లల చదువుల కోసం ఆరాటపడే తల్లిదండ్రులూ మనముందు ఎందరో ఉన్నారు. సకాలంలో డబ్బులు సర్దుబాటు కాక, ఆర్థిక ఇబ్బందుల వల్ల అర్ధంతరంగా చదువులు ఆపేసిన పిల్లలు కూడా బోలెడుమంది. అయితే అతుల్ అందరిలా అలా ఉండిపోవాలను కోలేదు. తన కల కోసం ఎంతదూరమైనా వెళ్లాలనుకున్నాడు.
సోషల్ మీడియా సాయంతో సుప్రీం తలుపు తట్టాడు..
సోషల్ మీడియా వేదిక ద్వారా అతుల్ తన కల సాకారం చేసుకున్నాడు. ‘సీటు పోయిందన్న షాక్ మా కుటుంబాన్ని ఎంతో బాధించింది. అప్పుడే సోషల్ మీడియాలో ఓ వీడియో చూశాను. ఫీజు చెల్లించలేక సీటు కోల్పోయిన విద్యార్థుల కోసం డిజైన్ చేసిన ఆ వీడియో నాలో ధైర్యాన్ని నింపింది. అన్నయ్యలు, కోచింగ్ మాస్టర్ సాయంతో ధనాబాద్ వెళ్లాను. వాళ్లు జార్ఖండ్ లీగల్ సర్వీస్ అథారిటీని సంప్రదించమన్నారు. ఆ తరువాత మద్రాస్ హైకోర్టు, చివరికి సుప్రీం కోర్టు.. ఇలా నాన్నా, నేనూ చెప్పినచోటికల్లా తిరిగాం.
ఒక్క భోజనం ఇద్దరం తినేవాళ్లం..
కోర్టుల చుట్టూ తిరగడానికి, ప్రయాణాలకి మా దగ్గర డబ్బు లేదు. అందుకే డబ్బు ఆదా చేసేందుకు నాన్న, నేను ఒక్క భోజనాన్నే తినేవాళ్లం. రైల్వే స్టేషన్లలో పడుకునేవాళ్లం’ అని అతుల్ చెబుతున్నప్పుడు అతని తల్లి ఇంటి దగ్గర పరిస్థితిని ఇలా చెప్పారు. ‘కోర్టుల చుట్టూ తిరిగినన్నాళ్లు, మా ఇంట్లో నవ్వులు లేవు. టైంకి వండుకుని తిన్న రోజులు కూడా లేవు. చాలా దిగాలుపడిపోయాం. బిడ్డ భవిష్యత్తు ఏమౌతుందో అని భయం వేసింది’ అని ఆ కష్టకాలాన్ని గుర్తుచేసుకుంది.
ప్రిన్స్ జాబీర్ కథ హెల్ప్ అయ్యింది
తన ప్రయాణానికి స్ఫూర్తినిచ్చిన వ్యక్తుల గురించి అతుల్ ఇలా చెబుతున్నాడు. ‘ఇంటర్‌నెట్‌లో ఈ విషయమై సెర్చ్ చేస్తున్నప్పుడు ప్రిన్స్ జాబీర్ కేసు కనపడింది. 2021లో సాంకేతిక కారణాల వల్ల ఫీజు చెల్లించలేక సీటు కోల్పోయిన అతడు సుప్రీంని ఆశ్రయించి విజయం సాధించాడు. అప్పటి విచారణ బందంలో ప్రస్తుత సుప్రీం చీఫ్ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ఉన్నారు. ఇప్పుడు నా కేసు విచారణలో ఇది బాగా కలిసివచ్చిన అంశం’ అని చుట్టూ ఎన్ని ప్రతి కూలతలు ఉన్నా సానుకూలంగా ఆలోచించిన అతుల్ ఎంతోమందికి గొప్ప రోల్ మోడల్‌లా కనిపిస్తున్నాడు కదూ.
తీర్పులో ఏం చెప్పారంటే..
2024 సెప్టెంబరు 30న అతుల్ కేసు విచారణలో తుది తీర్పు వెలువడింది. ఆర్టికల్ 142 ప్రకారం ఈ తీర్పు ఇచ్చారు. తక్షణం అతుల్‌కి అడ్మిషన్ ఇవ్వమని కోర్టు కాలేజీని ఆదేశించింది. అంతేకాదు అతను కోరుకున్న ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ బిటెక్ ప్రోగ్రామ్‌లోనే సీటు కేటాయించమని సూచించింది. అయితే ఇప్పటికే కౌన్సిలింగ్ సెషన్లు ముగిశాయని కోర్టుకు అతుల్ న్యాయవాదులు వెల్లడించారు. దీంతో ‘ఏ కారణం చేతనైనా అతుల్‌కి సీటు ఇవ్వడంలో నిర్లక్ష్యం చేయొద్ద’ని జస్టిస్ మరోసారి నొక్కివక్కాణించారు. ఈ విజయంతో ఇప్పుడు అతుల్ వార్తల్లో వ్యక్తి అయ్యాడు. అతని ఇల్లంతా స్వీట్లతో నిండిపోయింది. రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సంస్థలు అతుల్ చదువుకు అయ్యే ఖర్చు భరిస్తామని ముందుకు వచ్చారు. గడిచిపోయిన మూడు నెలల సిలబస్‌ని ఎలాగైనా పూర్తిచేయాలన్న దఢసంకల్పంతో అతుల్ ధనాబాద్ బయల్దేరాడు. ఒక సాధారణ పేదింటి కుర్రాడు సాధించిన గొప్ప విజయమిది. ప్రిన్స్, అతుల్ ఎంతోమంది యువతకి ఆదర్శం.
– అనంతోజు మోహన్‌కృష్ణ, 8897765417