పోటీలో పాల్గొనడమంటే…

Participating in the competition means…ఫలానా స్కూలు విద్యార్థులు రాష్ట్ర లేదా జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్నారు అంటూ దాదాపు నిత్యం వింటూ వుంటాం. పత్రికల్లో వార్తలు గమనిస్తుంటాం. ఏదో ఒక స్కూల్లో 8, 9, 10వ తరగతి విద్యార్థులే ఎక్కువగా పలు రకాల పోటీల్లో పాల్గొనడం జరుగుతూ వుంటుంది. అంటే మిగతా పిల్లల్లో ఆ సామర్థ్యం లేదని కాదు. స్ఫూర్తిలేదని అర్ధం. కారణం భయం, కొంత ఆత్మస్థైర్యం లోపం కావచ్చు.
పిల్లలు విద్యాపర పోటీలతో పాటు, ఆటపాటల పోటీల్లోనూ పాల్గొనాలి. అలా వారిని తల్లిదండ్రులు, టీచర్లూ ఉత్సాహపరచాలి. పిల్లల్లోని ప్రత్యేకతలు, స్కూల్లో టీచర్లు, ఇంటివద్ద తల్లిదండ్రులే గుర్తించగలరు. కొంతమందికి ఆ ప్రత్యేకత సహజంగా ఉంటుంది. కొందరు అలవాటుగా ప్రావీణ్యం పొందుతారు. అందులో వారికి ఎంతో ఆనందం ఉంటుంది. అది పెద్దవారూ గ్రహించాలి.
చదువుకి సంబంధించి పోటీల్లో పాల్గొనడానికి ఎక్కువగా టీచర్లు బాధ్యత తీసుకోవాలి. ఉదాహరణకి క్విజ్‌ పోటీలు, వ్యాసరచన, వక్తత్వపోటీల వంటివి టీచర్లకి బాగా తెలుస్తాయి. అంతేగాక స్కూలు స్థాయిలో ఇలాంటివి తరచూ జరుగుతుంటాయి. తరగతి గదిలో పాఠ్యాంశాలపట్ల ఎక్కువ గ్రహణశక్తి ఉన్న విద్యార్థులు, తమ అభిప్రాయాలు, లేదా ఒక పాఠ్యాంశం మీద బాగా మాట్లాడేవారు ఈ పోటీలకి ఎంపికవుతుంటారు. కొంత సాధనతో వాటిలో మెళకువలు తెలుసుకుని విజేతలుగా అవార్డులు అందుకుంటూ వుంటారు. అయితే మిగతా పిల్లల్లోనూ పోటీల్లో పాల్గొనే ఆసక్తి ఉండవచ్చు. అది తోటివారితోపాటు టీచర్లు గుర్తించాలి. అలాగే అలాంటి ఆసక్తి ఉన్న పిల్లలు స్వయంగా ప్రయత్నాలు చేయాలి. అంటే భయం పోవడానికి ఒకరిద్దరు స్నేహితులతో తోచిన అంశం గురించి మాట్లాడాలి. అలా చేస్తుంటే క్రమంగా ఆసక్తి పెరుగుతుంది. తరగతిస్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొనాలి. గెలవడం కంటే ముందు పాల్గొనడమే కీలకం. అపుడే బాగా రాణించాలన్న పట్టుదల వస్తుంది. చదవడం, రాయడం పైనా దష్టి పెడతారు. రాయగలనన్న నమ్మకం ఉంటే వ్యాస రచన పోటీల్లో పాల్గొనాలి. ఏదైనా సరే చివరిగా మీ నిర్ణయమే అమలు చేయండి. అంతేతప్ప, మీ స్నేహితుడు పాల్గొంటున్నాడని, మీ తల్లిదండ్రులు పట్టుపడుతున్నారనీ పోటీల్లో పాల్గొనవద్దు. అలాగని ఓటమి భయంతో పోటీలకు దూరం కావద్దు. మీ ప్రయత్నాలు మీరు చేయాలి. గెలుపు, ఓటములను పట్టించుకోవద్దు. పోటీల్లో పాల్గొంటూ వుండటమే ప్రధానం.
ఇలా చెయ్యండి..
దేనిలో ఆసక్తి వున్నదీ గ్రహించుకోండి.
– బాగా ప్రాక్టీస్‌ చేయండి.
– స్నేహితుల సహకారం తీసుకోండి.
– పోటీకి సిద్ధపడే ముందు సంబంధిత సమాచారం సంపాదించండి.
– ఆయా అంశాల విలువైన సమాచారాన్ని సేకరించండి.
చదువుతోపాటు పలురకాల పోటీల్లో పాల్గొనడం ఎంతో అవసరం. పోటీతత్వం పెరుగుతుంది. అంశాల ప్రాధాన్యత గ్రహిస్తారు. ఎంతో జ్ఞానం, సమాచారం గ్రహిస్తారు. అందరి స్నేహం, మన్ననలూ అవార్డులు అందుకుంటారు. ఆలోచించండి. ఈసారి పోటీకి సిద్ధపడండి.
డా|| హిప్నో పద్మా కమలాకర్‌,
9390044031
కౌన్సెలింగ్‌, సైకో థెరపిస్ట్‌,
హిప్నో థెరపిస్ట్‌