పుస్తక అధ్యయనం మనిషి మస్తిష్కాన్ని అభివృద్ధి చేస్తుందని బలంగా నమ్మే వ్యక్తి. ప్రతి మనిషీ శాస్త్రీయ దృక్పథం అలవర్చుకుంటే సమాజం మరింత పురోగతి సాధిస్తుందని విశ్వసిస్తారు. అందుకే సమాజాన్ని గ్రంథాలయాలకు అనుసంధానం చేయాలని తపిస్తున్నారు. పుస్తకాల ప్రాముఖ్యతను ప్రజలందికీ అర్థమయ్యేలా చెప్పేందుకు కృషి చేస్తున్నారు. దీనికోసం ప్రస్తుతం జరుగుతున్న గ్రంథాలయ వారోత్సవాలను వేదికగా మార్చుకున్నారు. ఆయనే తెలంగాణ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ రియాజ్. గ్రంథాలయ వారోత్సవాలు జరుగుతున్న సందర్భంగా నవతెలంగాణ ‘సోపతి’ ఆయన్ని పలకరించింది…
మీరు చైర్మన్ అయిన తర్వాత లైబ్రరీల అభివృద్ధి కోసం ఎలాంటి ప్రణాళికలు రూపొందించారు?
లైబ్రరీ అనేది వ్యక్తి జీవితంలో ఓ భాగంగా మారాలి. ఎందుకంటే మానవుడు బుద్ది జీవి. తన శారీరక అవసరాలు తీర్చుకోడానికి ఎలా తపిస్తాడో అలాగే మానసిక, వైజ్ఞానికి అవసరాలు కూడా పొందాలనుకుంటాడు. పుస్తకాలు ఆ అవసరాలను తీర్చగలుగుతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో మనిషి జీవితాన్ని గ్రంథాలయాలకు అనుసంధానం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే నాడు నిజాం వ్యతిరేక పోరాటాలకు, ప్రజాస్వామ్య ఉద్యమాలకు కేంద్రాలు గ్రంథాలయాలే. ఒట్టికోట, సురవరం, మగ్దూంతో పాటు మరెందరో గ్రంథాలయాలే కేంద్రంగా ఉద్యమాలు నిర్మించారు. కాబట్టి ఈ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా పుస్తకాలను సమాజంలోకి, చదువరులలోకి ఏ రకంగా తీసుకుపోవాలి, గ్రంథాలయాల సంఖ్యను ఎలా పెంచాలి, వీటిని ప్రజల నిత్య జీవితంలో ఎట్లా భాగం చేయాలి అనే లక్ష్యంతో ప్రణాళికలను రూపొందించుకుంటున్నాం.
శాఖా గ్రంథాలయాల అభివృద్ధికి ఎలాంటి కృషి చేయబోతున్నారు?
మన దేశంలోని అన్ని రాష్ట్రాల్లోకి గ్రంథాలయాలు ఎక్కువగా ఉంది కేరళలో. దేశ వ్యాప్తంగా మొత్తం 30వేల గ్రంథాలయాలు ఉంటే ఒక్క కేరళ రాష్ట్రంలోనే 9వేలు ఉన్నాయి. అక్కడ లైబ్రరీలు కింది స్థాయి వరకు విస్తరించి ఉన్నాయి. కనుకనే వారు అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉన్నారు. అందుకే మా టీం త్వరలోనే కేరళ వెళ్ళి అక్కడి గ్రంథాలయాలను సందర్శించి రావాలని ప్లాన్ చేసుకున్నాం. ఇక మన దగ్గర మొత్తం 600 లైబ్రరీలు ఉన్నాయి. ఈ మూడు నెలల్లో సుమారు 80 లైబ్రరీలను స్వయంగా సందర్శించి వచ్చాను. గ్రామీణ ప్రాంత విద్యార్థులు లైబ్రరీలను విరివిగా ఉపయోగించుకుంటున్నారు. అయితే ఈ సందర్భంగా నాలుగు రకాల సమస్యలు నా దృష్టికి వచ్చాయి. విద్యార్థుల అవసరరాలకు తగ్గట్టు పుస్తకాలు లేవు. చదువరికి అనుకూలమైన పుస్తకాలు లైబ్రరీల్లో అందుబాటులో ఉండాలి. అందుకే లైబ్రరీకి వస్తున్న విద్యార్థుల నుండి ఫీడ్ బ్యాక్ తీసుకొమ్మని ఒక రూల్ పెట్టాను. దాని వల్ల వాళ్ల అవసరాలు ఏంటో, ఇంకా ఎలాంటి పుస్తకాలు తెప్పించాలో అర్థం అవుతుంది. గతంలో ఈ పద్దతి లేదు. ఇప్పుడు మేము మొదలుపెట్టాం. అలాగే గ్రంథాలయాల్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. సాధ్యమైనంత త్వరగా ఈ సమస్య పరిష్కారించే దిశగా ఆలోచిస్తున్నాం. అయితే ఇవన్నీ చేయాలంటే నిధులు అవసరం. సెన్స్ ద్వారా గ్రంథాలయాలకు రావల్సిన నిధులు కోట్లల్లో ఉన్నాయి. పెద్ద పెద్ద మున్సిపాల్టీ నుండి కూడా నిథులు రావడం లేదు. వాటిపై దృష్టి పెట్టబోతున్నాం.
సంచార గ్రంథాలయాలు తీసుకొచ్చే ఆలోచన ఏమైనా ఉందా..?
ఇది చాలా మంచి ఆలోచన. సంచార గ్రంథాలయాలు చాలా అవసరం. ప్రజాశక్తి, విశాలాంధ్ర, నవతెలంగాణ వంటి వారు సంచార గ్రంథాలయాలు నడిపించారు. వీటి వల్ల మంచి ఫలితం కూడా వచ్చినట్టు విన్నాను. ఇటీవల మరణించిన సాధిక్ లాంటి వారు తోపుడుబండి ద్వారా పుస్తకాలు ప్రజల వద్దకు తీసుకెళ్లారు. జిల్లా గ్రంథాలయాలకు వెళ్ళినపుడు కొన్ని చోట్ల పాత రిక్షాలు చూశాను. గతంలో వాటిలో పుస్తకాలు పెట్టుకొని ప్రజల వద్దకు తీసుకెళ్లేవారంటా. ఇది మళ్లీ వస్తే మంచిదే. కానీ ప్రస్తుతం మేము ఉన్న గ్రంథాలయాలను ఎలా మెరుగుపరచాలి అనే దానిపైనే దృష్టి పెట్టాం.
పుస్తకాలు చదివే వారి సంఖ్య తగ్గిపోతుందనే బాధ చాలా మందిలో కనబడుతుంది. దీని గురించి మీ అభిప్రాయం?
దీని గురించి మాట్లాడే ముందు నాకు తెలిసిన ఓ వాస్తవం చెబుతాను. సోవియట్ యూనియన్ పడిపోకముందు వరకు ప్రపంచం మొత్తం జ్ఞానాభివృద్ధివైపు ఆలోచించేది. అనంతమైన విశ్వం, భూగోళం, దాని రహస్యాలు, సైన్సు, టెక్నాలజీ, శాస్త్రీయ అధ్యయనం పై మంచి అవగాహన ఉండేది. నేను అప్పుడు విద్యార్థిగా ఉన్నాను కాబట్టి ఇవన్నీ నేను కూడా అనుభవించాను. సోవియట్ కూలిపోయిన తర్వాత జ్ఞానం పొందాలనే తపన తగ్గిపోయింది. బుద్ధి జీవులకు ఉపయోగపడే ప్రపంచం కాకుండా భౌతిక జీవులకు ఉపయోగపడే ప్రపంచంగా మారిపోయింది. మూఢనమ్మకాలు పెరిగాయి. సైన్స్‌ను అవసరాలకు మాత్రమే వాడుకుంటున్నారు. సైంటిఫిక్ థింకింగ్ బాగా తగ్గిపోయింది. దాంతో పాటే పుస్తకాలు చదివే అలవాటూ తగ్గిపోయింది. జనం ఫోన్లకు అలవాటు పడ్డారు. లండన్ లాంటి అభివృద్ధి చెందిన నగరాల్లో పుస్తకాలు చదువుతున్నారు. ఇది నేను స్వయంగా చూశాను. ఫోన్లు వారి పఠనానికి ఆటంకం కలిగించలేదు. కానీ మన దగ్గర ఫోన్లు పుస్తకాలను దూరం చేశాయి. కాబట్టి ఆ మొబైల్ ప్రపంచంలో నుండి మన వాళ్ళను బయటకు తీసుకురావాలి. లేదా మొబైల్ ప్రపంచంలోకి పుస్తకాలను ఎక్కించాలి. ఈ రెండింటినీ అనుసంధానం చేయాలి. చిన్నప్పటి నుండే పిల్లల్లో శాస్త్రీయ దృక్పథ ప్రాధాన్యం గురించి, అధ్యయనం గురించి తెలియజేయాలి. అప్పుడు మళ్లీ పాత రోజులు వస్తాయి.
కవులు, రచయితల పుస్తకాలు కొనుగోలు చేయడం గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా?
చేయాల్సిన అవసరం ఉంది. గత పదేండ్ల నుండి రచయితలకు, లైబ్రరీలకు సంబంధాలు తెగిపోయాయి. అందుకే స్టేట్, సిటీ సెంటర్ లైబ్రరీల్లో రచయితలు వారి పుస్తకాలను ఆవిష్కరించుకుంటామంటే ఫ్రీగా హాల్ ఇస్తాము. దీని వల్ల పాఠకులు వస్తారు. ఒక మంచి వాతావరణం ఉంటుంది. పుస్తకం విలువ విద్యార్థులకు తెలుస్తుంది. అలాగే రచయిత పుస్తకానికి కూడా గుర్తింపు వస్తుంది. అలాగే మా పబ్లికేషన్ డిపార్ట్‌మెంట్‌లో రచయిత మూడు కాపీలు ఇస్తే వాటిలో మంచి వాటిని ఎంపిక చేసి కొనుగోలు చేసే ఆలోచన ఉంది.
పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి గ్రంథాలయాల నుండి అందిస్తున్న సహకారం?
స్టేట్ లైబ్రరీలో ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. ఎక్కడా దొరకని పుస్తకాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇటీవల గవర్నర్ వచ్చి లైబ్రరీ చూసి ‘ఇన్ని రకాల పుస్తకాలు ఉన్నాయా’ అని ఆశ్చర్యపోయారు. అయితే ఇప్పటికే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారు ఈ లైబ్రరీలను పెద్ద ఎత్తున ఉపయోగించుకుంటున్నారు. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే నేటి పోటీ పరీక్షల తీరు తెన్నులు మారిపోయాయి. వారి అవసరాలకు అనుగుణంగా పుస్తకాలు అందుబాటులో లేవు. అందుకే స్టేట్ లైబ్రరీని యూపీఎస్‌స్సీ హబ్‌గా తీర్చిదిద్దాలని ఆలోచిస్తున్నాము. త్వరలోనే ఆ ప్రయత్నం జరుగుతుంది. సాధారణ పాఠకులకు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారు ఇద్దరినీ దృష్టిలో పెట్టుకొని కొత్త పుస్తకాలు కొనుగోలు చేయాల్సి వుంది.
స్కూల్ స్థాయి నుండి పిల్లలో చదివే అలవాటు పెంచేందుకు ప్రణాళికలేమైనా రూపొందించే ఆలోచన ఉందా?
పిల్లల్లో చదివే అలవాటు పెంచాలంటే మరో గ్రంథాలయ ఉద్యమం జరగాలి. ప్రజా ఉద్యమాల కోసమే గతంలో గ్రంథాలయ ఉద్యమాలు జరిగాయి. ఇప్పుడు జ్ఞాన తెలంగాణాన్ని నిర్మించడం కోసం మరో ఉద్యమం జరగాలి. అయితే గురుకులాలు, డిగ్రీ కాలేజీల్లో ఇప్పటికే లైబ్రరీలు ఉన్నాయి. పాఠశాలల్లో కూడా లైబ్రరీలు పెట్టడం, ఒక అవర్ రీడింగ్ కోసం కేటాయించడం వంటి నిర్ణయాలు తీసుకుంటే మంచిది. విద్యాశాఖ మంత్రి సీఎం కాబట్టి వారితో మాట్లాడి ఆ ప్రయత్నం చేయాలనుకుంటున్నాం.
మరి ఆర్థిక వనులు ఎలా సమకూర్చుకోబోతున్నారు?
ముఖ్యంగా సెస్స్‌పై దృష్టి పెడుతున్నాం. ఇది ఒక పర్మినెంట్ పరిష్కారం. అలాగే సీఎస్‌ఆర్ ఫండ్స్‌ను ఉపయోగించుకోవాలి. దాతలను కుర్చీలు, పుస్తకాలు కూడా అడుగుతున్నాము. అలాగే గ్రంథాలయాల్లో చదువుకుని ఉద్యోగాలు సంపాదించుకుని మంచి స్థాయిలో ఉన్నవారు ఎందరో ఉన్నారు. వారిని గుర్తించి లైబ్రరీ కోసం ఏమైనా చేయాల్సిందిగా అడగాలనుకుంటున్నాం. గ్రంథాలయాల ప్రాధాన్యతను సమాజానికి అర్థమయ్యే విధంగా చెప్పగలిగితే ఫండ్స్ కచ్చితంగా వస్తాయనే నమ్మకం నాకు ఉంది. దీనికోసం సమాజానికి గ్రంథాలయాలను అనుసంధానం చేయాలి. దాంతో ప్రజల్లో హేతుబద్ధ ఆలోచనలు పెరుగుతాయి. జీవితం అంటే జ్ఞాన సముపార్జనే అనే భావన పెరుగుతుంది. దాని కోసం పుస్తకాలు ఉపయోగించుకోవాలి అనే ఆలోచన పెరుగుతుంది.
మీ వ్యక్తిగత నేపథ్యం..?
నేను మహబూబాబాద్‌లో పుట్టి,పెరిగాను. అక్కడే చదువుకున్నాను. అలాగే వరంగల్ కూడా చదువుకున్నాను. మా నాన్న అబ్బాస్ అలీ, అమ్మ అహ్మద్‌బీ. మేము ముగ్గురం పిల్లలం. మా అన్నయ్య మెడికల్ కాలేజీలో డీన్‌గా ఉన్నారు. తమ్ముడు డిగ్రీ కాలేజీ లెక్చరర్. నాన్న టీచర్ కావడంతో ఆయన ఉద్యోగ రీత్యా ఎక్కువగా గ్రామాల్లో పెరిగే అవకాశం వచ్చింది. నాన్న అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తి పుస్తకాలు బాగా చదివేవారు. ఆయన నుండే నాకూ పుస్తకాలు చదివే ఆసక్తి కలిగింది. పైగా నేను చదువుకున్న వరంగల్ ఉద్యమాలకు కేంద్రంగా ఉండేది. ఎనిమిదవ తరగతిలోనే ఏడుతరాలు బుక్ చదివాను. అది నన్ను బాగా ప్రభావితం చేసింది. నాన్న అప్పట్లో ఇంటికి రకరకాల పత్రికలు తెప్పించేవారు. ఆయన ఇంగ్లీష్ టీచర్ కావడంతో ఇంగ్లీష్ పుస్తకాలు కూడా తెప్పించేవారు. నేను బుజ్జాయి, బాలభారతి, చందమామ లాంటి పుస్తకాలు చదివేవాడిని. సండే వస్తే రేడియో వినేవాడిని. విద్యార్థిగా ఉన్నప్పుడు ఆర్‌ఎస్‌యూ, ఎస్‌ఎఫ్‌ఐలో పని చేశాను. తర్వాత సామాజిక న్యాయం కోసం జరిగిన ఉద్యమాల్లోనూ భాగం పంచుకున్నాను. గతంలో అనేక పత్రికల్లో వ్యాసాలు రావేవాడిని. రాజకీయ జీవితంలోకి వచ్చిన తర్వాత బిజీ అయ్యి రాయడం తగ్గిపోయింది. పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్‌గా, బీఎడ్ కాలేజీ ప్రిన్సిపల్‌గా చేశాను. తెలంగాణ ఉద్యమం కోసం ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చాను. కొత్తగా వచ్చిన తెలంగాణ మేము కోరుకున్నట్టు లేదు. అందుకే కాంగ్రెస్‌లోకి వచ్చాను. చాలా కాలం నాకు విద్యార్థులతో మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి నాకు తగినది అనే ఉద్దేశంలో ముఖ్యమంత్రి నాకు లైబ్రరీ పరిషత్ చైర్మన్‌గా బాధ్యలు ఇచ్చారు. రాహుల్‌గాంధీ నా అభిమాన నాయకుడు.
– సలీమ, 94900 99083