సృజన్ కుమార్ బొజ్జంతో కలిసి లక్కీ మీడియా అధినేత బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’. హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి హీరో, హీరోయిన్లుగా నటించారు. విక్రమ్ రెడ్డి దర్శకుడు. ఈనెల 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హీరో తేజా సజ్జా మాట్లాడుతూ, ‘ఈ వేదిక మీద ఉన్న నూతన టాలెంట్‌కు ఈ సినిమా ఎన్నో ఏళ్ల కల. ఈ చిత్రంతో నిర్మాత బెక్కెం వేణుగోపాల్ ఎంతో మంది నూతన నటీనటులను పరిచయం చేస్తున్నారు. తప్పకుండా ఈ చిత్రం విజయం సాధించి, అందరికి మంచి బ్రేక్ నివ్వాలి’ అని అన్నారు. ‘నేటి యూత్‌కు కనెక్ట్ అయ్యే విధంగా ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమా అందరిని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది.. బాధపెడుతుంది.. ఆలోచింపజేస్తుంది. కుటుంబంతో చూడదగ్గ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. ఈ సినిమా ఓటీటీ రైట్స్, థియేట్రికల్ రైట్స్.. ఇలా అన్ని హక్కులు విడుదలకు ముందే అమ్మేశారు. సినిమా చూసి నచ్చి, అందరూ హక్కులు కొనుక్కున్నారు. దీంతో మాకు విజయంపై మరింత నమ్మకం పెరిగింది’ అని దర్శకుడు విక్రమ్ రెడ్డి చెప్పారు. నిర్మాతలు మాట్లాడుతూ, ‘ఈ సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉంటాయి. నేటి యూత్‌కు నచ్చే లవ్‌స్టోరీలో ఓ భిన్నమైన కోణాన్ని దర్శకుడు ఆవిష్కరించాడు. ఈ సినిమా చూసిన అందరికి ఎంతో బాగా నచ్చింది’ అని అన్నారు.