అరుదైన వర్క్‌ షాప్‌..

Rare workshop..ప్రపంచ ప్రఖ్యాత యానిమేషన్‌, విఎఫ్‌ఎక్స్‌, గేమింగ్‌ రంగాలకు సంబంధించిన సాంకేతిక నిపుణులను ఒక చోటికి చేర్చి, సందర్శకులకు పరిచయం చేసే ఇండియా జారు, సినిమాటికా ఎక్స్‌ పో మరోసారి అలరించడానికి సిద్దమైంది. గతేడాది నిర్వహించిన అంతర్జాతీయ ప్రదర్శనకు తెలుగు చలనచిత్ర పరిశ్రమ సహా పలువురు ప్రముఖుల నుంచి అనూహ్య స్పందన లభించడంతో ఈ ఏడాది సినిమాటికా ఎక్స్‌పో 2వ ఎడిషన్‌ను ఈనెల 16, 17 తేదీలలో హెచ్‌.ఐ.సి.సి నోవోటెల్‌ ప్రాంగణంలో నిర్వహిస్తున్నారు.
సినిమా, టెక్నాలజీ, సజనాత్మకత వంటి అంశాలపై అవగాహన కల్పించడంతో పాటు ప్రపంచ ప్రఖ్యాత విజువల్‌ ఎఫెక్ట్స్‌ టెక్నీషియన్లను, ఫిలింమేకర్లను, సోనీ-యారీ-రెడ్‌ తదితర టెక్నాలజీ కంపెనీలకు చెందిన ప్రతినిధులను ఒకే చోట కలుసుకోవడానికి తెలంగాణ ఐటి శాఖ సహకారంతో ఈ ఎక్స్‌పో వేదిక కానుంది. సినీరంగానికి చెందిన యువ దర్శక, నిర్మాతలు, విద్యార్థులు, వీఎఫ్‌ఎక్స్‌, గేమింగ్‌ ఇండిస్టీకి చెందిన వారికి ఎన్నో నూతన విషయాలపై అవగాహన కలుగుతుంది. ఈ ఎక్స్‌పోకు దాదాపు 30వేల మంది హాజరవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు.
అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు క్రియేటర్‌లు, ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ఇండిస్టీ ఎదుగుదలకు కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో వారిని మరింత ప్రోత్సహించడానికి ‘క్రియేటర్స్‌ అండ్‌ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ అవార్డ్స్‌ 2024’ ని కూడా ఇదే వేదిక నుంచి ప్రదానం చేయనున్నారు. శనివారం ఘనంగా ప్రారంభమైన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శకులు రాంగోపాల్‌ వర్మ, సందీప్‌ రెడ్డి వంగ, సినిమాటోగ్రాఫర్‌ సెంథిల్‌ కుమార్‌ విచ్చేశారు.
ఈ సందర్భంగా డైరెక్టర్‌ ఆర్జీవి మాట్లాడుతూ, ‘నేను మొదలు పెట్టినప్పుడు సినిమా వేరు, ప్రస్తుతం సినిమా వేరు. సినిమాకి సంబంధించిన విజువల్స్‌, టెక్నాలజీ కూడా మారుతూ వచ్చాయి. ప్రస్తుతం సందీప్‌ రెడ్డి వంగ లాంటి దర్శకులు కొత్తదనంతో ఇండిస్టీని ఏలుతున్నారు. ఈ సినిమాటికా ఎక్స్పో సినిమా మీద ప్యాషన్‌తో వచ్చే ఎంతోమందికి ఒక మంచి వర్క్‌ షాప్‌ లాంటిది’ అని తెలిపారు.
‘నేను ఈ ఈవెంట్‌కి కేవలం ఆర్జీవి కోసమే వచ్చాను. కానీ ఈవెంట్‌ ఇంత గ్రాండ్‌గా ఉంటుంది అనుకోలేదు. ఈ సినిమాటికా ఎక్స్పో 2వ ఎడిషన్‌ గ్రాండ్‌ సక్సెస్‌ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’ అని దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగ చెప్పారు. సినిమాటోగ్రాఫర్‌ సెంథిల్‌ కుమార్‌ మాట్లాడుతూ, ‘ఈ సినిమాటికా ఎక్స్పో ఎంతోమందికి ఇన్నోవేటివ్‌గా ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఫ్యూచర్లో సినిమాని ఇంకా గ్రాండ్‌గా తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుంది’ అని చెప్పారు.