ఆసీస్‌దే టీ20 సిరీస్‌

– రెండో టీ20లోనూ పాక్‌ చిత్తు
సిడ్నీ : పాకిస్థాన్‌కు స్వదేశంలో వన్డే సిరీస్‌ కోల్పోయిన ఆస్ట్రేలియా.. పొట్టి ఫార్మాట్‌లో మాత్రం మెప్పించింది. వరుసగా రెండు మ్యాచుల్లో విజయాలు సాధించి మరో మ్యాచ్‌ ఉండగానే 2-0తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. పేసర్‌ స్పెన్సర్‌ జాన్సన్‌ (5/26) ఐదు వికెట్ల ప్రదర్శనతో 148 పరుగుల ఊరించే ఛేదనలో పాకిస్థాన్‌ చతికిల పడింది. 19.4 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలింది. ఉస్మాన్‌ ఖాన్‌ (52), ఇర్ఫాన్‌ ఖాన్‌ (37 నాటౌట్‌) రాణించినా.. ఇతర బ్యాటర్లు విఫలమయ్యారు. బాబర్‌ (3), ఫర్హాన్‌ (5), రిజ్వాన్‌ (16), సల్మాన్‌ (0), అబ్బాస్‌ (4), అఫ్రిది (0), నసీం (0), సుఫియన్‌ (0), రవూఫ్‌ (2) తేలిపోయారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 147/9 పరుగులు చేసింది. మాథ్యూ (32), అరోన్‌ (28), మాక్స్‌వెల్‌ (21), మెక్‌గుర్క్‌ (20), డెవిడ్‌ (18) సమిష్టిగా రాణించారు. పాక్‌ బౌలర్లలో రవూఫ్‌ (4/22), అఫ్రిది (3/17), సుఫియన్‌ (2/21) రాణించారు. షహీన్‌, నసీంలకు వికెట్లు దక్కలేదు. ఆసీస్‌, పాక్‌ మూడో టీ20 సోమవారం జరుగనుంది.