– ఈ నెలలో 6 శాతం తగ్గిన బంగారం
న్యూఢిల్లీ : గడిచిన పండగ సీజన్‌లో సామాన్యుడు కొనలేని స్థాయికి ఎగిసిన బంగారం ధరలు క్రమంగా దిగివస్తోన్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపొందిన తర్వాత డాలర్‌కు డిమాండ్ పెరగడంతో పాటు అంతర్జాతీయంగా యుద్ధాలకు దూరంగా ఉంటామని ట్రంప్ ప్రకటించడంతో అపరంజీ ధర తగ్గుతోంది. మరోవైపు హెచ్చు ధరల నేపథ్యంలో దేశీయంగా పసిడికి డిమాండ్ పడిపోవడం కూడా ధరల తగ్గుదలకు ఓ ప్రధాన కారణం. ఈ క్రమంలోనే దీపావళి తర్వాత బంగారం ధరల్లో దాదాపు 6 శాతం తగ్గుదల చోటు చేసుకుంది. 2024 నవంబర్ 1న 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల పసిడి ధర రికార్డ్ స్థాయిలో రూ.80,710గా పలకగా.. క్రమంగా నవంబర్ 16 నాటికి ఈ ధర రూ.75,800కు దిగివచ్చింది.
బంగారం ధరల్లో తగ్గుదల కొనుగోళ్ల డిమాండ్‌ను పెంచొచ్చని మల్హోత్రా జ్యువెల్స్ మేనేజింగ్ డైరెక్టర్ ధృవ్ మల్హోత్రా అన్నారు. ఈ నెలలో ఇప్పటి వరకు దాదాపు రూ.5000 మేర బంగారం ధర తగ్గింది. ఈ ఏడాది చివరి వరకూ బంగారం ధరల్లో తగ్గుదల కొనసాగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత.. విధాన నిర్ణయాలు ప్రకటించే వరకు పసిడి ధరల్లో క్షీణత ఉండొచ్చని అంంటున్నారు. జనవరిలో ట్రంప్ అధికారం చేపట్టనున్నారు. ఇటీవల ట్రంప్ ఎన్నిక తర్వాత డాలర్‌కు డిమాండ్ పెరుగుతోంది. మరోవైపు పెట్టుబడులన్నీ స్టాక్స్, బాండ్ల మార్కెట్ వైపు వెళ్తున్నాయి. దీంతో బంగారానికి డిమాండ్ తగ్గడంతో ఆ లోహం ధర దిగివస్తోంది.
క్రిప్టో కరెన్సీలకు అమెరికా మద్దతు ఉండబోతోందన్న అంచనాలతో బిట్ కాయిన్, ఇతర క్రిప్టోలకు డిమాండ్ పెరుగుతోంది. బిట్ కాయిన్ ఆల్‌టైం గరిష్టం 90వేల డాలర్లకు చేరింది. అదే విధంగా గ్లోబల్ స్టాక్ మార్కెట్లలో రిస్కు పెరుగుతున్నప్పటికీ ఈక్విటీల్లో పెట్టుబడులకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు. గత కొద్ది రోజులుగా భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి అమెరికా, చైనాలకు తరలిపోవడమే ఇందుకు నిదర్శనం. యూరప్‌తోపాటు పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతాయన్న అంచనాలు కూడా పసిడి ధరల తగ్గుదల ప్రధాన కారణం.