పది సూత్రాలతో ముందుకు

– మోడీ సర్కార్‌కు సంపూర్ణ మద్దతు
– కేంద్ర, రాష్ట్రాల్లో ఒకే ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి
– సోషల్‌ మీడియా నియంత్రణకు చర్చ జరగాలి : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రగామిగా ఉంచేందుకు పది సూత్రాలతో ముందుకు వెళ్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం నాడిక్కడ వందేళ్ల హిందుస్థాన్‌ టైమ్స్‌ లీడర్‌ షిప్‌ సమ్మిట్‌ (హెచ్టిఎల్‌ఎస్‌) 22వ ఎడిషన్‌లో సీఎం చంద్రబాబు మాట్లాడారు. వైసీపీ హయాంలో తన అరెస్టు, సోషల్‌ మీడియా, ఎన్డీఏ పాలన, రాష్ట్ర అభివృద్ధిపై చంద్రబాబు మాట్లాడారు. ”ఆంధ్రప్రదేశ్‌ అగ్రగామిగా ఉండాలనేది మా లక్ష్యం. అందుకు పది సూత్రాలతో ముందుకు వెళ్తున్నాం. పేదరిక నిర్మూలనకు, దేశాభివృద్ధికి ఈ పది సూత్రాలు ఉపయోగపడతాయి. పీపీపీ విధానాలు, ఉపాధి, ఉద్యోగాలు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌, నదుల అనుసంధానం, అగ్రికల్చర్‌, లాజిస్టిక్స్‌, గ్రీన్‌ ఎనర్జీ, స్వచ్ఛ భారత్‌, డీప్‌ టెక్నాలజీ దేశాభివృద్ధిలో భాగం కావాలి. మన దేశంలో జనాభా తగ్గుదల గురించి మనం మాట్లాడుకోవాల్సిన సమయం వచ్చింది. ఎక్కువ మంది పిల్లలు ఉండాలి. జనాభా నిర్వహణతో మన దేశం ముందుకు వెళ్లాలి. దీనిపై చర్చ జరగాలి. కూటమి ప్రభుత్వానికి ప్రజల అభివృద్ధి మాత్రమే ధ్యేయం” అని అన్నారు.
కేంద్ర, రాష్ట్రాల్లో ఒకే ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి
కేంద్రం, రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం కొనసాగుతూ ఉంటే అభివృద్ధి మరింత వేగంగా చేసే వీలుంటుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అభివృద్ధి, సంక్షేమంతో పాటు ప్రజల భాగస్వామ్యంతో కూటమి పరిపాలన ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 2024లో జరిగిన ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారని తెలిపారు. గత ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో పాటు, ఎన్డీఏ కూటమిపై ప్రజలకు స్పష్టమైన భరోసా కలిగిందన్నారు. ”కుటుంబంలో విభేదాలు సాధారణం. కానీ ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించడం చాలా ముఖ్యం. సంకీర్ణ ప్రభుత్వంలోనూ ఇంతే. విభేదాలను పక్కనపెట్టి ఒక మాటపై నిలబడాలి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత ప్రభుత్వం ఇదే చేస్తోంది” అని అన్నారు.
సోషల్‌ మీడియా నియంత్రణకు చర్చ జరగాలి
దేశంలో సోషల్‌ మీడియాను నియంత్రించేందుకు చర్చ జరగాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ”ప్రజాస్వామ్యంలో సోషల్‌ మీడియా పాత్ర దుర్భలంగా మారింది. మహిళలు, రాజకీయ నేతలను అగౌరవ పరిచేందుకు కొందరు క్రిమినల్స్‌ సామాజిక మాధ్యమాలను వాడుకుంటున్నారు. ఇదే ఇప్పుడు అతిపెద్ద సవాలు. సోషల్‌ మీడియాలో మమ్మల్ని మాత్రమే కాదు, సొంత తల్లిని, చెల్లిని కూడా బూతులు తిట్టిస్తుంటే, వాళ్లని ఏమనాలి? ఇలాంటి వారిపై చర్యలు తీసుకోకూడదా? సోషల్‌ మీడియాలో మహిళలని వేధించే వారిని ఎలా కంట్రోల్‌ చేయాలి? ప్రజాస్వామ్య దేశంలో సోషల్‌ మీడియా పరిస్థితి చాలా దుర్భలంగా మారింది. సోషల్‌ మీడియాని నియంత్రించేందుకు చర్చ జరగాలి” అని అన్నారు.
మోడీ సర్కార్‌కు తమ సంపూర్ణ మద్దతు
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి, ప్రధాని మోడీకి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. భారతదేశం చాలా గొప్పదని, దేశం కోసం అందరం కలిసి పని చేస్తామని తెలిపారు. ప్రధాని మోడీ నాయకత్వంలో దేశ అభివృద్ధి కోసం సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. 1989 నుంచి టీడీపీ దేశ రాజకీయాల్లో ముఖ్య పాత్ర పోషించిందన్నారు. దేశ అభివృద్ధి కోసం టీడీపీ ఎప్పుడూ ముందుంటుందన్నారు. అక్రమ కేసులు పెట్టి 53 రోజులు పాటు వైసీపీ ప్రభుత్వం తనను వేధించిందని అన్నారు. చేయని తప్పునకు శిక్ష అనుభవించానన్నారు. తాను 45 ఏండ్ల పాటు ఎన్నో ప్రజా ప్రయోజన విధానాలు తీసుకొచ్చి, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల కోసమే పని చేశానని అన్నారు. జైళ్లో ఉన్న 53 రోజులు ఎక్కడా తాను నిరుత్సాహ పడలేదని, మరింత పట్టుదల పెరిగిందని అన్నారు. ఆ పట్టుదల ప్రజలకు సేవ చేయటానికి ఉపయోగిస్తున్నానని పేర్కొన్నారు.