జూలై 6 నుంచి గ్రామపంచాయతీ కార్మికుల సమ్మె

సీఐటీయూ రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్‌
నవతెలంగాణ-మొయినాబాద్‌
జూలై 6 నుంచి గ్రామపంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచి, ఉద్యోగ భద్రత కల్పించాలని సమ్మె చేపడుతున్నట్టు సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్‌ అన్నారు. బుధవారం మొయినాబాద్‌ కేంద్రంలోని మండలం ఎంపీడీవో కార్యాలయంలో సీనియర్‌ అసి స్టెంట్‌కు సీఐటీయూ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మి కులు సమ్మె నోటీసులు అందజేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 12, 769 గ్రామ పంచాయతీల్లో దాదాపు 50 వేల మంది గ్రామ పంచాయతీ సిబ్బంది పని చేస్తున్నారని తెలిపారు. వీరిలో పారిశుధ్య కార్మికులు, స్వీపర్లు, పంపు ఆపరేటర్లు, ఎలక్ట్రీషియను,్ల డ్రైవర్లు, కారోబార్లో బిల్‌ కలెక్టర్‌ తదితర కేటగిరీలో విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. వీరంతా కొన్నేండ్లుగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ పనికి గుర్తింపు, ఉద్యోగ భద్రత, ఈఎస్‌ఐపీఎఫ్‌ సౌకర్యం, ప్రమాద బీమా లాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు కావడం లేదన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం పీఆర్సీ అన్ని శాఖల ఉద్యోగులకు ప్రకటించి, గ్రామపంచాయతీ కార్మికులను మరిచిపోయిందన్నారు. ఇప్పటికైనా పారిశుధ్య కార్మికులకు పనికి తగిన వేతనాలు, ఉద్యోగ భద్రత, బీమా వంటి సౌకర్యాలు కల్పించాలని సమ్మె చేపట్టినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల నాయకులు ప్రభుదాస్‌, సాయిబాబా, గ్రామ పంచాయతీ యూనియన్‌ మండల నాయకులు ఆంజనేయులు గౌడ్‌, రాములు నర్సింలు వెంక టేష్‌ చంద్రశేఖర్‌ మాణిక్యం, రాజు, కైరాత్‌, శ్రీను గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.