నవంబర్ 14 బాలల దినోత్సవం ప్రతియేటా మొక్కుబడిగానే జరుపుకుంటున్నాం. కనీసం 20వ తేదీ ప్రపంచ బాలల హక్కుల పరిరక్షణ దినం ఒకటి ఉందన్న స్పృహ కూడా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల్లో లేదు. వారి హక్కులు, వారి చదువు, వారి భవిష్యత్తు పట్ల తల్లిదండ్రులతో పాటు సమాజానికి ఒక మంచి ప్రేరణనివ్వాల్సిన దినోత్సవాన్ని గుర్తిం చడం లోనే మన పాలకులు విఫలమ య్యారు. ఇది నిజంగా చిన్నారుల భవిష్యత్తు పట్ల నిర్లక్ష్యాన్ని తెలియజేస్తున్నది. ఎందుకంటే పిల్లలు పుష్పాల్లా వికసించాలే గాని వారిని మొగ్గల్లోనే చిదిమేస్తే ఈ దేశ భవిష్యత్తు ఏం కావాలి? ఇప్పటికే చాలా నష్టం జరిగింది, జరిగిపోతూ వుంది. స్వాతంత్య్రం వచ్చాక పదేండ్ల లోనే సంపూర్ణ అక్షరాస్యత సాధించాలని నిర్దేశించుకున్నాం. ఐదు దశాబ్దాలు దాటినా లక్ష్య సాధనకు దూరంగానే ఉన్నాం. ఇప్పటికీ సుమారు ఎనిమిది కోట్ల మంది పిల్లలు బడికి దూరంగా ఉన్నారంటే మనమెక్కడు న్నాం అనేది విశ్లేషించుకోవాలి? కానీ, అది జరుగుతుందా? ఆధునిక ప్రజాస్వామిక సమాజాలు స్వేచ్ఛను, హక్కులను గుర్తిస్తూ రాజ్యాంగ పరమైన రక్షణలు కల్పించాయి. వ్యక్తి పరిపూర్ణ అభివృద్ధికి, స్వేచ్ఛ, స్వాతంత్య్రా లకు ప్రాథ మిక హక్కులు పెట్టని కోట. భారత ప్రజాస్వామ్యానికి ఇవి పునాది రాళ్లు. జీవి పుట్టుకతో వచ్చిన హక్కులు అత్యంత సహజ సిద్ధమైనవి. బాలల హక్కులు కూడా మానవ హక్కులేననే స్పృహ పెరుగుతూ వచ్చిన క్రమంలో 19 59లో ఐక్య రాజ్య సమితి బాలల హక్కుల ప్రకటన చేసింది. ఈ ప్రకటన బాలల హక్కులకు ‘మాగ్నాకార్టా’గా చెప్పవచ్చు. దీని సారాంశం ‘బాలలు, జాతి, లింగ, రంగు, భాష, మతం, జాతి, తేడా లేకుండా అన్ని హక్కు లకు అర్హులు. స్వేచ్ఛగా, గౌరవంగా, ఆరోగ్యంగా, శారీరకంగా, మానసికంగా, నైతికంగా ఎదగాలి. అందుకు సంపూర్ణ అవకాశాలు కల్పించబడాలి. సరైన పోషక ఆహారం, గృహవసతి, వైద్య సేవలు పొందేహక్కు వుంది. పిన్న వయస్సులో ఎంతో అవసరమైతే తప్ప తల్లినుండి వేరు చేయరాదు. పేద పిల్లలకు ప్రభుత్వం చేయూత నివ్వాలి, వారు ఉచిత, నిర్భంధ, విద్య పొందటానికి అర్హులు. జ్ఞానం, సమాజానికి ఉపయోగపడే పౌరులు అవ టానికి ఆస్కారమిచ్చే విద్యను ప్రభుత్వమందించాలి. ఆటలు, వినోదం పొందటానికి పూర్తి అవకాశాలు పిల్లలు పొందాలి. ఈ హక్కును పొందటానికి సమాజం, ప్రభుత్వం చొరవ చూపాలి. అన్ని రకాల నిర్లక్ష్యం క్రూరత్వం, దోపిడీలనుండి బాలలకు రక్షణ లభించాలి. ఏ రకమైన అక్రమ రవాణాకు వారు గురికాకూడదు.’ అని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది.
అయినా అనేక దేశాల్లో ఈ ప్రకటనలోని అనేక అంశాలు అమలుకు నోచుకోలేదు. 20వ శతా బ్దంలో మానవ హక్కుల చట్ట బద్ధత ప్రస్థావనలో బాలల హక్కులకు ప్రత్యేక స్థానం కల్పించుటకు ‘ఎగ్ లెంటిన్ బెగ్” అనే ఉపాధ్యాయురాలి చొరవతో ఐక్యరాజ్యసమితిలో ప్రత్యేక చర్చ జరిగింది. 1989 నవంబర్ 20న ఐక్య రాజ్యసమితి బాలల హక్కుల ఒడంబడికలో 180 దేశాలు సంతకాలు చేశాయి. ఈ అనేక ప్రయత్నాల మూలంగా ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభ బాలల హక్కుల ఒప్పందాన్ని 20 నవంబర్ 1989న ఆమోదిం చినది. ఆనాటి నుండి నవంబర్ 20వ తేదీని ‘బాలల హక్కుల పరిరక్షణ దినం’గా గుర్తించారు. భారత ప్రభు త్వం 1992 డిసెంబర్ 11న సంతకం చేసి బాలల హక్కుల ప్రకటన జారీ చేసింది. భారత రాజ్యాంగం బాలల హక్కులకు హామీ ఇచ్చింది. కానీ ఆచరణలో అవి అమలుకు నోచుకోలేదు. 1992లో మోహిని జైన్ ఉన్నికృష్ణన్ కేసులో విద్యను ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు గుర్తించింది. అప్పుడు కేంద్రం విద్యను ప్రాథమిక హక్కుగా చేస్తూ 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ‘విద్యాహక్కు బిల్లు 2005’ను ఆమోదించింది. అయితే 6-14 సం||ల వయస్సు గల పిల్లలకు మాత్రమే విద్యాహక్కు పరిమితం చేస్తే సరిపోదు. రాజ్యాంగంలో 4వ భాగంలో 45వ అధికరణ ప్రకారం పూర్వ ప్రాథమిక విద్యను కూడా, హక్కుగా చేయాలి. ఈ బిల్లు రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలలోని ‘ఉచిత నిర్భంద ప్రాథమిక విద్య’ను ప్రాథమిక హక్కుగా మార్చింది. అందుకోసం రాజ్యాం గంలోని 21వ అధికరణ అయిన జీవించేహక్కును 21-ఏను చేర్చి ‘జ్ఞానంతో జీవించాలి’ అనే అర్థాన్ని ఇచ్చింది.
ఈ చట్టం 2010 ఏప్రిల్ 1న అమల్లోకి వచ్చింది. ఇందులో పాఠశాల విద్యకు దూరంగా ఉన్న ఏడు కోట్ల మంది పిల్లలను బడిబాట పట్టించాలని, వారికి మంచి ప్రమాణాలతో కూడిన ఉచిత నిర్భంద విద్యను అందించాలని పేర్కొంది. పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని, ప్రయివేటు విద్యాసంస్థలలో 25శాతం సీట్లను పేద విద్యార్థులకు కేటాయించాలని సూచించింది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి 55:45 నిష్పత్తిలో వచ్చే ఐదేండ్లలో ఈ లక్ష్య సాధనకు రూ.1,71,000 కోట్లు వెచ్చించాల్సి వుందని లెక్క చెప్పింది. కానీ, వసతులు లేని పాఠశాలలు, అందుబాటులో లేని పాఠ్యపుస్తకాలు, ఉపాధ్యాయులు లేని తరగతి గదులు ఎప్పటిలాగే షరామామూలే. పాఠశాలల్లో కనీస వసతులైన మంచినీరు, మరుగుదొడ్లు కానరావు. క్రీడాస్థలాలు లేనేలేవు. అసలు పాఠాలు చెప్పటానికి తగినంతగా ఉపాధ్యాయులే లేరు. పైగా ఉపాధ్యా యులపై, పాఠశాల నిధులపై అజమాయి షీని పాఠశాల మేనేజ్‌మెంట్ కమిటీలకు అప్పజెప్పింది.
25శాతం సీట్లు పేద వర్గాల పిల్లల కేటాయింపు ను వ్యతిరేకిస్తూ ప్రయివేటు పాఠశాలల యాజ మాన్యాలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఈ కేటాయింపును సమర్థిస్తూ ధర్మాసనం 2012 ఏప్రిల్‌లో తీర్పు చెప్పింది. అసలు 25శాతం సీట్ల కేటాయింపు ప్రతిపాదన అనవసరమైనది. ఇది కేవలం ప్రయివేటు స్కూళ్ల యాజమాన్యాలను ధనవంతులను చేయటానికే. ఆ పిల్లల ఫీజులను ప్రభుత్వం ఎందుకు ప్రయివేటు పాఠశాల యాజమాన్యాలకు చెల్లించాలి? ఈ రకమైన లోపాలతో ఈ చట్టం అమల్లోకిి వచ్చి ఏండ్లు గడుస్తున్నా పాఠశాల విద్యాహక్కులో పొందుపరచిన వివిధ అంశాలు ఆచరణకు నోచుకోలేదు. పైగా ప్రయివేటు రంగంలోని విద్యాసంస్థలు, విద్యార్థులను, వారి తల్లిదండ్రులను దోచుకుంటున్నాయి. ప్రయివేటు పాఠశాలలు ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా పెద్ద మొత్తంలో ఫీజులతో పాటు, స్కూల్ వద్దే యూనిఫాంలను, పుస్తకాలు, డైరీ, బెల్ట్ కొనుగోలు చేయాలని ఒత్తిడి తీసుకువచ్చి తల్లిదండ్రుల వద్ద నుండి పెద్ద మొత్తంలో డబ్బులను గుంజు తున్నాయి. విద్యార్థులను ఉదయం నుంచి సాయంత్రం వరకు పది గంటలకు పైగా తరగతి గదులలో బంధించి ‘ఎద్దు మొద్దు’ అనే బట్టి విధానాలతో బలవంతంగా బోధించటం వలన పిల్లల సృజనాత్మక, జ్ఞానం, చైతన్యం, సమాజం పట్ల బాధ్యత పూర్తిగా లోపించి యాంత్రికంగా తయా రవుతున్నారు. కొన్ని సందర్భాలలో, పిల్లలను భౌతికంగా కొట్టడం, హింసించటం, అమానవీయ పద్ధతుల్లో వారిని అవమానించడం వంటి ఘటనలు నిత్యం ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నాయి.
శాస్త్రీయ విద్యావిధానం కాకుండా బట్టీవిధానాన్ని ప్రయి వేటు పాఠశాలల యాజమాన్యాలు ప్రోత్సహిస్తు న్నాయి. ఈ అసంబద్ధ విధానాలు బాలల హక్కులను పూర్తిగా కాలరాస్తూ భావిభారత పౌరులను నిర్వీర్యం చేస్తున్నాయి. ఫలితంగా శారీరక వికాసం లేక చిన్న వయస్సులోనే అధిక బరువు, గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం, బి.పి.లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధలు పడుతూ తక్కువ వయస్సులోనే, జీవితాన్ని చాలించే దశకు చేరుకుంటున్నారు. ఈ పరిణామాలన్ని బాలల హక్కుల ఉల్లంఘన కిందే పరిగణించాల్సి ఉంటుంది. ఈ ఒత్తిడి నుండి, ఈ హక్కుల ఉల్లంఘన నుంచి బాలలను కాపాడే బాధ్యత మేధావి వర్గం, పౌర సమాజానిదే. మొత్తం విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలి. బాలల హక్కులు పరిరక్షించాలన్న, వారు స్వయం సంపూర్ణంగా ఎదగాలన్న ప్రక్షాళన తప్పదు. సృజనాత్మకత, నైపుణ్యం, విజ్ఞానం, పరిజ్ఞానం, పరిశోధన ప్రజా అవసరాలకు అనుగుణంగా ఉండే విద్య విధానం ఉండాలి. భారమైన విద్యాబోధన కాకుండా విద్యార్థి స్వేచ్ఛగా జ్ఞానం సము పార్జించుకునే శాస్త్రీయ విద్యావిధానం ప్రవేశపెట్టాలి. అది కూడా వారి వారి మాతృభాషలలో జరగాలి. అందుకు మొత్తం సమస్త, జ్ఞాన సంపదను దేశీయ, ప్రాంతీయ భాషలలో తర్జుమా చేయాలి. ప్రజలందరికి పేద, ధనిక తేడా లేకుండా ఒకే రకమైన విద్యావ్యవస్థను, సూచించిన డా||డి.ఎస్ కొఠారి (కొఠారి కమిషన్ 1964 -66 సిఫార్సులు) కామన్ స్కూల్ ‘విధానాన్ని ప్రవేశ పెట్టాలి. ఈ విధానంలోని పాఠశాలల్లో దేశప్రధాని మొదలు ముఖ్యమంత్రి, టీచర్లు, రిక్షాపుల్లర్ల వరకు తమ పిల్లలందరిని ఆవాస ప్రాంతాల్లోని పాఠశాలల్లో చదివించాలి. అప్పుడే నిజమైన దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్మించబడుతుంది.
– షేక్ కరిముల్లా, 9705650705