ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు నేత మృతి

– 20 ఏండ్లుగా వేటాడుతున్న పోలీసులు
బెంగళూరు: 20 ఏండ్లుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటున్న మావోయిస్టు నేత విక్రమ్‌ గౌడ కర్నాటకలోని ఉడుపి జిల్లా కబ్బినేల్‌ అడవుల్లో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. ఆయన వెంట ఉన్న ఇద్దరు ముగ్గురు మావోయిస్టులు తప్పించుకొని పారిపోయారు. వారి కోసం నక్సల్స్‌ వ్యతిరేక దళం (ఏఎన్‌ఎఫ్‌) గాలింపు చేపట్టింది. అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారం అందుకున్న ఏఎన్‌ఎఫ్‌ కూంబింగ్‌ ఆపరేషన్‌ చేపట్టింది. సరుకులు కొను గోలు చేసేందుకు ఐదుగురు సాయుధ మావోయిస్టులు హెబ్రీ తాలూకా సమీపంలోకి వచ్చారని సమాచారం అందడంతో ఏఎన్‌ఎఫ్‌, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గత 13 సంవత్సరాలలో ఉడుపి జిల్లాలో ఎన్‌కౌంటర్‌ జరగడం ఇదే మొదటిసారి. ఎన్‌కౌంటర్‌లో విక్రమ్‌ గౌడ చనిపోయిన విషయాన్ని హెబ్రీ ఎస్‌ఐ మహేష్‌ ధ్రువీకరించారు. విక్రమ్‌ కోసం పోలీసులు ఎంతో కాలంగా గాలిస్తున్నారని ఆయన చెప్పారు. విక్రమ్‌ గౌడ్‌ నక్సల్స్‌ ఉద్యమంలో కీలక నేత అని రాష్ట్ర హోం మంత్రి జి.పరమేశ్వర్‌ తెలిపారు. దశాబ్దాల తరబడి పోలీసులకు దొరకకుండా తిరుగుతున్నాడని అన్నారు. తనకు తారసపడిన పోలీస్‌ అధికారులపై విక్రమ్‌ కాల్పులు జరిపాడని, వారు కూడా ఎదురు కాల్పులు ప్రారంభించారని, ఈ ఎన్‌కౌంటర్‌లో విక్రమ్‌ చనిపోయాడని చెప్పారు.