– సీఎంకు తెలంగాణ గవర్నమెంట్ ఫార్మాసిస్ట్ అసోసియేషన్ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రభుత్వ ఫార్మసిస్టుల సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డిని తెలంగాణ గవర్నమెంట్ ఫార్మాసిస్ట్ అసోసియేషన్ కోరింది. ఈ మేరకు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బత్తిని సుదర్శన్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ కందకట్ల శరత్ బాబు సీఎంకు వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో ఫార్మసీ యాక్ట్ 1948, సెక్షన్ 42ని కఠినంగా అమలు చేయాలని కోరారు. డాక్టర్లను రెగ్యులర్ చేసినట్టుగానే కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఫార్మాసిస్టులను పరీక్షలు లేకుండా రెగ్యులర్ చేయాలని కోరారు. లేకపోతే 30 శాతం వెయిటేజీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పని ఒత్తిడి తగ్గించేందుకు వీలుగా ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ముగ్గురు ఫార్మాసిస్టులను నియమించాలని పేర్కొన్నారు. ప్రతి ఫార్మాసిస్టు సర్వీస్ కాలంలో కనీసం నాలుగు పదోన్నతులు కల్పించాలని విన్నవించారు. తెలంగాణ ఏర్పడ్డాక గత పదేండ్లలో ఫార్మాసిస్టుల ఒక్క సమస్యా పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయంలో ప్రాసెస్‌లో ఉన్న ఫార్మాసీ ఆఫీసర్ ఫైలు తెప్పించి వెంటనే గెజిట్ ద్వారా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఫార్మసీ డైరెక్టరేట్ ఏర్పాటు చేసి ఫార్మాసిస్టుల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.