కీళ్లనొప్పులకు చికిత్స పేరుతో మోసం

– డీసీఏ దాడుల్లో వెల్లడి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కీళ్ల నొప్పులకు చికిత్స పేరుతో ప్రచారం చేసుకుంటున్న రుమరిచ్‌ క్యాప్స్యుల్స్‌ను డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు రంగారెడ్డి జిల్లా, హయత్‌నగర్‌, వనస్థలి పురంలోని ఆయుర్వేదిక్‌ రుమరిచ్‌ క్యాప్స్యుల్స్‌ పేరుతో ఆయుర్వేదిక్‌ మెడిసిన్‌ అమ్ముతున్నట్టు అధికారులు గుర్తించారు. ఇది కీళ్ల నొప్పుల చికిత్సకు పని చేస్తుందని తప్పుడు ప్రకటనలతో మోసం చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌ మెట్‌ మండలం, కొహెడ విలేజ్‌, మోడ్గల్‌ ఆయుర్వేద్‌ ఫార్మసీ దీనిని తయారు చేస్తున్నది.
ఫలానా రోగాన్ని చికిత్స అంటూ తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు ఇవ్వడాన్ని డ్రగ్స్‌ అండ్‌ మ్యాజిక్‌ రెమెడీస్‌ (ఆబ్జెక్షనబుల్‌ అడ్వర్టైజ్‌ మెంట్స్‌), యాక్ట్‌, 1954 కింద నిషేధం విధించారు. దీంతో అధికారులు వనస్థలిపురంలో సదరు క్యాప్య్సుల్‌ దొరికిన మెడికల్‌ షాపులో ఉన్న నిల్వలను సీజ్‌ చేశారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.