కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి బద్ద వ్యతిరేకం

Congress party is totally against social justice– ఎస్సీ వర్గీకరణను విస్మరిస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పతనం ఖాయం
– ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అద్యక్షులు గోవిందు నరేష్ మాదిగ 
నవతెలంగాణ – కంఠేశ్వర్
దేశంలో అత్యధిక ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ జనాభా ప్రాతిపదికన అన్ని కులాలకు రిజర్వేషన్లు కల్పించడకుండా సామాజిక న్యాయానికి విరుద్ధంగా వ్యవహరించిందని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అద్యక్షులు గోవిందు నరేష్ మాదిగ, ఎం ఎస్ పి రాష్ట్ర కో ఆర్డినేటర్ ఇంజం వెంకటస్వామి మాదిగలు అన్నారు. ఈ మేరకు బుధవారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి అన్ని అనుబంధ సంఘాల సమీక్ష సమావేశం మర్చంట్ అసోసియేషన్ భవన్ లో కనక ప్రమోద్ మాదిగ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గోవిందు నరేష్ మాదిగ, ఇంజం వెంకటస్వామి మాదిగలు మాట్లాడుతూ.. 1965 లోనే ఎస్సీ రిజర్వేషన్లు ఎస్సీలలో ఉన్న అన్ని కులాలకు అందడం లేదని,కనుక ఎస్సీ వర్గీకరణ చేయాలని లోకూర్ కమిటీ కాంగ్రెస్ ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తే దాని చెత్తబుట్టలో పడేసి సామాజిక న్యాయాన్ని అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందని అన్నారు.మాదిగలు ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే పది ఏళ్ళు దేశంలో అధికారంలో ఉండి కూడా పట్టించుకోలేదని అన్నారు. ఇప్పటికి సుప్రీం కోర్టు ఎస్సీ వర్గీకరణను రాష్ట్రాలే చేసుకోవచ్చని తీర్పు ఇస్తే ఆ తీర్పును కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ అమలు చేయలేదని అన్నారు. కాంగ్రెస్ డీఎన్ఏ లోనే సామాజిక న్యాయ వ్యతిరేకత ఉందని అన్నారు.
ఎస్సీ వర్గీకరణ అమలు చేయడంలో దేశంలో ముందుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటిస్తే కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసి ఎస్సీ వర్గీకరణ మీద ముందుకు వెళ్లకుండా రేవంత్ రెడ్డిని నియంత్రించిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి మాలలను నెత్తి మీదకు ఎత్తుకొని మాదిగ జాతిని తన పాదాల కింద అణచివేసిందని అన్నారు.కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం నిజాయితీ ఉన్నా సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ వర్గీకరణను వెంటనే అమలులోకి తీసుకువచ్చి సామాజిక న్యాయం పట్ల తన చిత్తశుద్దిని చాటుకోవాలని అన్నారు. ఎస్సీ వర్గీకరణను అమలు చేయనంత వరకు కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం గురించే చెప్పే ఊకదంపుడు ఉపన్యాసాలను ప్రజలు నమ్మరు అని అన్నారు.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఇచ్చిన మాట ప్రకారం వర్గీకరణను అమలులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగ ప్రజలు మరో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అందుకోసం ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి మండల ,గ్రామ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఎం ఎస్ పి జిల్లా అధ్యక్షులు సరికెళ్ళా పోశెట్టి మాదిగ, ఎం ఎస్ పి జాతీయ నాయకులు మణికొల్ల గంగాధర్ మాదిగ, ఎంఎంఎస్ జాతీయ నాయకురాలు యమున, సత్తెక, లక్ష్మి, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పిప్పేర సంజీవ్, ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఆకారం రమేష్, ఎంఎంఎస్ జిల్లా నాయకురాలు పద్మ, సావిత్రి, సుధ, టౌన్ అధ్యక్షులు మహేష్, బట్టు వెంకట రాములు, బట్టు రమేష్, నాగరాజు, లావణ్య, ఎం ఎస్ పి జిల్లా నాయకులు సూర్య అశోక  తదితరులు పాల్గొన్నారు.