బీజేపీ అధికార ప్రతినిధిలా మాట్లాడొద్దు

– రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి తప్పుడు ఆరోపణలు
– కోర్టు పరిధిలో ఉస్మానియా ఆస్పత్రి భవన నిర్మాణం….
– గవర్నర్‌ తమిళిసై ట్వీట్‌పై మంత్రి హరీశ్‌ రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాజ్యంగ పదవిలో ఉన్న రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందర రాజన్‌ బీజేపీ అధికార ప్రతినిధిలా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని కోఠిలో పునరుద్ధరించిన ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ కార్యాలయంతో పాటు తెలంగాణ స్టేట్‌ మెడికల్‌ కౌన్సిల్‌ వెబ్‌సైట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహిం చిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణ అంశం హైకోర్టు పరిధిలో ఉందనీ, ఒకసారి తీర్పు వచ్చాక ఆధునాతనమైన భవనాన్ని నిర్మిస్తామని తెలిపారు. గవర్నర్‌ వ్యాఖ్యలు కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు…తప్పుల కోసం భూతద్దంలో వెతికినట్టున్నాయని విమర్శించారు. ఆ వ్యాఖ్యలు దురదృష్టకరమంటూ విచారం వ్యక్తం చేశారు. ఉస్మానియా ఆస్పత్రిపై మొదట స్పందించింది సీఎం కేసీఆర్‌ అని తెలిపారు. 2015 జూలైలో సీఎం ఆస్పత్రిని సందర్శించి, నూతన భవన నిర్మాణానికి రూ.200 కోట్లు ప్రకటించారని గుర్తుచేశారు. అయితే కొంత మంది అదే ఏడాది ఆగస్టులో కోర్టుకు వెళ్లి స్టే తీసుకొచ్చారనీ, అప్పట్నుంచి ఆ అంశం న్యాయవివాదంలో ఉందని వివరించారు. కోర్టు ఆదేశాల మేరకు ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌, ఐఐటీ హైదరాబాద్‌ నిపుణులతో ప్రభుత్వం వేసిన స్వతంత్ర కమిటీ ప్రస్తుత భవనం ఆస్పత్రి నిర్వహణకు పనికి రాదని నివేదిక ఇచ్చిందని తెలిపారు. ఇదే విషయాన్ని ప్రభుత్వం కోర్టు చెప్పిందని తెలిపారు. కోర్టు నుంచి సానుకూలమైన తీర్పు వస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
కేంద్రం ఒప్పుకున్నా…. గవర్నర్‌ అభినందించదెందుకు?
దేశంలో వంద శాతం ఆస్పత్రి డెలివరీలు జరుగుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేంద్రం చెప్పినా గవర్నర్‌ అభినందించదెందుకు? అని హరీశ్‌ రావు ప్రశ్నించారు. ”ప్రభుత్వాస్పత్రుల్లో డెలివరీలను 30 శాతం నుంచి 70 శాతానికి పెంచి సీన్‌ రివర్స్‌ చేశాం. కంటివెలుగు రెండో దశ కార్యక్రమంలో 1.62 కోట్ల మందికి పరీక్షలు, 45 లక్షల మందికి కండ్లద్దాల పంపిణీ చేశాం. నిమ్స్‌ ఆస్పత్రిలో పడకల సంఖ్యను 900 నుంచి 1,500కు పెంచాం. మరో 2 వేల పడకలతో విస్తరిస్తున్నాం. కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌ వంటి పథకాలతో మాతా, శిశు మరణాలను తగ్గించాం. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు అనే పరిస్థితి నుంచి నేను పోతా బిడ్డ సర్కార్‌ దవాఖానకు అనే స్థాయికి చేర్చాం. గతంలో 20 ఏండ్లకు ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేస్తే, తొమ్మిదేండ్లలో 21 కాలేజీలు ఏర్పాటు చేశాం. లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్‌ సీట్లతో దేశంలో మొదటి స్థానంలో ఉన్నాం. డయాలసిస్‌ సెంటర్లను 3 నుంచి 102కు పెంచాం. నిటిఅయోగ్‌ ర్యాంకుల్లో మూడో స్థానానికి చేరాం. బస్తీ దవాఖానాలను నిటిఅయోగ్‌ ప్రశంసించింది. బోధనాస్పత్రుల్లో ఓపీ తగ్గించి, ఆ ఆస్పత్రులపై ఒత్తిడి తగ్గించాం. గాంధీ, నిమ్స్‌, ఉస్మానియా ప్రభుత్వాస్పత్రుల్లో అవయవమార్పిడి శస్త్రచికిత్సలు చేస్తున్నాం…. ” అని మంత్రి హరీశ్‌ రావు వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి అనేక మంచి కార్యక్రమాలను నిర్వహించినప్పటికీ గవర్నర్‌ స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని గానీ, కనీసం వైద్యారోగ్యశాఖ సిబ్బందిని గానీ అభినందించేందుకు ఆమెకు మనసెందుకు రాలేదో అర్థం కావడం లేదన్నారు. ఈ విషయాలపై గవర్నర్‌ ఎందుకు స్పందించరు? ఒక డాక్టర్‌గా కనీసం గవర్నర్‌ అభినందించాలి కదా?. ప్రశంసిస్తే మేమింకా ఉత్సాహవంతంగా పనిచేస్తాం కదా? అని ఆవేదన వ్యక్తం చేశారు. మంచి కనబడదు, మంచి వినబడదు. మంచి మాట్లాడను అన్నట్టుగా వ్యవహరిస్తే ఎలా? అని ప్రశ్నించారు. చెడును మాత్రమే చూస్తాం. చెడు మాత్రమే వింటాం. చెడు మాత్రమే మాట్లాడతాం.. అన్నట్టుగా వ్యవహరించడం రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న గవర్నర్‌కు తగదని హితవు పలికారు.