(చిన్నా, పెద్దా పెట్టుబడిదారుల సంభాషణ)
ఒకరోజు హఠాత్తుగా ఎటో చూస్తే అటు చంద్రన్న చక చకా వస్తూ కనపడ్డాడు. సూరయ్య చప్పున లేచి, పడుతూ లేస్తూ ఎదురెళ్తాడు!”వచ్చేశావు! హమ్మ! వచ్చేశావు!” చంద్రన్నా! నీకు కమిషన్లు పెంచుతా! అంటూ సూరయ్య ఉత్సాహంగా, చంద్రన్నని పట్టుకున్నాడు. ”వాళ్లు, ఆ కమ్యూనిస్టోల్లు కొట్టుకుంటున్నారు, అంతేగా? కుమ్ములాటలు రోజూ వుంటాయిలే. ఇక, వాళ్ల రాజ్యం ఎగిరిపోయిందిలే. చంద్రన్నా, నేనూ వచ్చేస్తా! మనం ఎప్పట్లాగే చేసుకుందాం. నేనూ వస్తా! అయ్యో, అసలు నువ్వు మళ్లీ ఎందుకొచ్చావు?” అని ఆతృతగా అనేసి ఆగాడు, కూలబడ్డాడు.”అదేనండీ, చెప్పనిచ్చారా? వాళ్లా కొట్టుకునేది? కుమ్ములాటలా? వాళ్లందరూ సమానత్వ సంబంధాల సోదరులండీ! ఆ మాటే మీకు చెప్పి, మిమ్మల్ని కూడా రమ్మనాలని వచ్చాను! అయ్యో! లేవండి! ఆలస్యం ఎందుకు?”
”చాల్లే! నోరుమూసుకో! వాళ్లని పొగిడేదాకా వచ్చావా! ఇక్కడ కూర్చున్నప్పట్నించీ దేవుడి మొహం చూడలేదు నేను. ఒక్కసారి గుడికిపోయి దణ్ణం పెడితేగానీ,….”
”ఏ గుడికి?”
”ఏ గుడికేంటి? అదుగో, అటు తూర్పేపున శివాలయం లేదూ?”
”అయ్యో! అది ఇంకా వుందనుకుంటున్నారా? అది, ఇప్పుడు చిన్నపిల్లల బడిగా అయింది! పిల్లలు ఒకటే పరుగులు అటేపు బడికి!”
”బడా? దేవుడేవయ్యాడు? శపించలేదా? ఊరుకున్నాడా? ఆు, ఆ విగ్రహాలేం చేశారు? వాటిని ముట్టుకుంటే, మూర్ఛలతో చచ్చారా, బతికారా?”
”అయ్యో! అవన్నీ చెప్పాలనిపించే వచ్చాను. ఈపూట నేను డ్యూటీ మానుకుంటానంటే, తోటివాళ్లు ఎంత మంచిగా వెళ్లమన్నారో! ‘ఏం ఫర్వాలేదు, మేం చేసుకుంటాం. తొందరగా వెళ్లిరా’ అన్నారు. పరిగెత్తుకొచ్చాను. ”ఆ విగ్రహాలా? ఆ పక్క పందిరేసి, దానికింద పెట్టారు. అప్పుడే ఇరవై ముప్పరు విగ్రహాలు అక్కడ చేరాయండీ!”
”ఏంటోరు అబద్ధాలు? ఎవడూ చావరా? దేవుణ్ణి అంటుకుంటారా? ఎందరు చచ్చారు? శివుడు అంతేలే. ఉత్తరంవేపు నారాయణమూర్తి వుంటాడుగా? అటు పోదాం కొంచెం ఒక్క దణ్ణం పెట్టుకోవాలి!”
”ఆ గుడిని ఆస్పత్రిగా, చిన్నదే, చేశారండీ! జనాలు తెగ సంతోషిస్తున్నారు! తలనొప్పికి కూడా ఆస్పత్రికే పరుగులు!”
”ఏంటీ? మతులు పోయాయా జనాలకి? దేవుళ్ళ మీద ఎగబడ్డారని, కోర్టుకి ఎవరూ చెప్పలేదా?”
”కోర్టు లెక్కడండీ? మీ ఇంటిని ఏం చేశారో వినండి ముందు! అది, పన్నెండు గదుల ఇల్లు కదా? మీ వాళ్ల కోసం నాలుగు గదులు బాగానే వుంచారు. మిగతా గదుల్లో, మధ్య మధ్య తడికలు పెట్టి, మూడు పేద కుటుంబాలకి ఏర్పాటు చేస్తే, పాపం ఆ పేదవాళ్ళు, ‘మాకు వొద్దులెండి, చెట్లకిందే బతికేస్తాం. ఆ ఇంట్లో పార్టీ ఆఫీసులవీ పెట్టండి!’ అన్నారు.”
”మా ఇంట్లోనా! వాళ్ల పార్టీ ఆఫీసులు!”
”అదేనండీ, ఇప్పుడు మీ ఇంట్లోనే రెండు మూడు పార్టీ ఆఫీసులున్నాయి. మా ఇల్లు కూడా అలాగే. అది, ఆరు గదుల్ది కదా? మూడు మాకు వదిలేసి, పెద్ద గదిలో లైబ్రరీ పెట్టారండీ! ఆ పక్క, ఒక ముసలాయన వున్న పేద కుటుంబానికి ఇచ్చేశారు. అంతా బాగానే చేస్తున్నారు లెండి! వాళ్లు తమ కోసం తినేదీ, తాగేదీ, ఏం లేదండీ! నిజమే!”
”మన ఇళ్లని వాళ్లు ఆక్రమించారా? వాళ్లు తినేదీ, తాగేదీ లేదా? వాళ్ల దగ్గర నీ భాగం ఎంత?”
చంద్రన్న నవ్వాడు. ”అయ్యా! అంతా మర్చిపోండి!
మన ఇళ్లు, నిజానికి మనవా? మనవి కావు లెండి! అందులో ఒక్క ఇటిక ముక్కన్నా, గుప్పెడు మట్టో, ఇసకో, ఒక్క తలుపుచెక్కనో, మనం ఏమన్నా చేశామా చెప్పండి! అదే, అంటున్నారు వాళ్లు. ఏం చెప్పగలం మనం?”
”చెప్పలేమా! మా తాతల కొంప అది! మా నాన్న ఇంకో రెండు గదులేస్తే, నేను నాలుగేశాక పన్నెండు గదులయ్యాయి, తెలుసా? నీకేం తెలుసు?”
”తాతలూ, తండ్రులూ కూడా మనలాగ సంపాదించినవాళ్లే లెండి! వాళ్లేమన్నా వొంగుని పొలాల్లో దున్నారా?”
”ఇదేమిటి? ఇలా తయారయ్యావు? అక్కడికెళ్తే మతిపోయిందా?”
”అది కాదండీ, మన వూళ్లో, రోడ్లు ఎలా మెరుస్తున్నాయో చూస్తే, అక్కడే రోడ్లమీదే పడుకోవాలనిపించింది నాకు. అమ్మో! ఈ మాటలు కాదు, నా డ్యూటీ! వెళ్లాలి!”
”ఏం పని?”
”చిన్నపిల్లల బళ్లో ఒక టీచరు సెలవుపెట్టాడు. ఆయనకి అర్జంటు పనేదో వచ్చింది. అది తెలిసి, ‘నేను వెళ్తాను, చిన్నపిల్లలకి చిన్న చిన్న లెక్కలు చెపుతాను’ అని చెప్పుకుని వెళ్లాను. ఒక తరగతిలో పిల్లలందరూ చిట్టివాళ్లే. ఐదారేళ్లవాళ్లు. వాళ్లకి తమాషాగా, 1,2,3,4 లాంటి అంకెలు తెలుస్తున్నాయి. చిన్న చిన్న మాటలు కూడా! నేను, లెక్కల్లో, కూడికా, తీసివేతా, హెచ్చివేతా, భాగారం – అని 4 రకాలే వుంటాయని చెప్పాను. 2కి, 3ని కలిపితే ఎంత? ఇదే కూడిక! 3 నించీ, 2ని తీసేస్తే? ఇదే తీసివేత! 3ని, 2 సార్లు చూస్తే! 2, 3లు 6. ఇది, హెచ్చివేత! ఇక, 3లో, ఎన్ని 2లు వున్నాయి? ఒక్క 2 కదా? ఇలా నా సరదాకొద్దీ చెప్పానులెండి. పిల్లలు పది, పన్నెండుమందే. క్లాసుల్లో అలాగే తక్కువమందే వుండాలంట! వాళ్లల్లో 7,8 మంది, ఏది అడిగినా, గబ గబా జవాబులు చెప్పారు. అబ్బా! ఎంత సంతోషంగా వుందోనండీ, పిల్లలకి చెప్పడం!… ఈ పనే కాదు, కొత్త ఇళ్లు పేద జనాల కోసం, తయారవుతున్నాయి కదా? వాటికి సున్నాలు వేసే పనులు వుంటే, అదీ చేశాను! నిజంగా పను లంటే ఇంత సంతోషమా – అనిపించింది సూరయ్యగారూ! అయ్యో! నేను వెళ్లాలి. అక్కడ ఏం జరుగుతోందో మీకు చెప్పాలని వచ్చానుగానీ, ఇక్కడ వుండాలని కాదు, ఇక వెళ్తాను” అంటూ లేచాడు చంద్రన్న.
”నీకు లెక్కలెలా వచ్చాయి?”
”సరుకుల్ని అమ్మించి, ఎకౌంట్లు రాశాను కదండీ? వెళ్తాను!”
”ఏంటా కంగారు? బాగా నేర్చావులే. మొన్నటి, నిన్నటి చంద్రన్నలా లేవు నువ్వు!”
”మా బాగా అన్నారు. అంత మారగలిగానా? రోజూ క్లాసుల కెళ్తున్నానండీ. ఒక మేష్టారు భలేగా సెపుతారండీ! రోజూ చాలామంది నేర్చుకుంటున్నారు. నన్ను బాగా మెచ్చుకుంటారు మేష్టారు. ….”
”ఏం నేర్పుతాడు?”
”అదే, అదే చెపుతా, ఎవరో ఒకాయన ‘మార్కుసు’ అంట! ‘పెట్టుబడి’ ఎంత చెడ్డదో చెప్పాలని పెద్ద పుస్తకం ఆ పేరే పెట్టి రాశాడంట! ‘లాభం, లాభం అంటా గదండీ, అది చెడ్డదేనంట! శానా బాగా చెప్పాడు. మీరూ ఇనాలండీ ఒక్కసారి. మీరు….”
”అబ్బబ్బా! వూరుకో, నేర్చావుగానీ. ఇంతదాకా ఎదిగావా? నా మాట విను! రెండు రోజులన్నా ఇక్కడుండు! మనం మాట్టాడుకుందాం. నాలుగు రోజులుంటావు! నేను మాట్టాడితే.”
”ఆ మార్కుసుకి నేను కోటి రూపాయలు పంపిస్తా. నువ్వే పట్టుకెల్లు! అతగాడు మల్లీ మాట్లాడగలడా? కూర్చో ముందు.”
”ఇంకా కూర్చుంటానా? ఇవ్వాళ క్లాసేంది. అది వినకపోతే ప్రేణం పోతుంది.”
”అయ్యో! కాదు, కూర్చో, కూర్చో! నాలుగురోజులుండు!”
”చాలు! నాలుగురోజులు ఏ పనీ లేకుండానా? అసలు, ఒక మాట చెప్పండి!! మీరు వస్తారా, లేదా? మీకు భోజనాలు రాటం లేదే! ఏం తింటున్నారు?”
”అప్పుడప్పుడూ చేప ముక్కలు! కాల్చి, ఉప్పేసి ఇస్తుంది ఒక ముసలవ్వ! రేపు నేనేదో పట్టుచీర కొని ఇస్తానని అనేమో! నాలుగు చేపముక్కలకే పట్టుచీరా?”
”చేపలైతే, ఆ వాగుల్లో దొరుకుతాయిగానీ, ఉప్పు ఎలాగ? దానికి ఎంత ఖర్చో తెలుసాండీ? నేను వెళ్లాలి బాబూ! నా డ్యూటీ ఎవరి మీదా పెట్టకూడదు లెండి! మీరు కూడా వచ్చెయ్యండీ!”
”వచ్చి, ఏం చెయ్యాలి? మూల పడ్డ మిఠాయి పరిశ్రమ అయినా మళ్లీ నడుపుకోవాలని నాకూ వుంది చంద్రన్నా!”
”అయ్యయ్యో! ఇంకానా? ప్రైవేటు కంపెనీలన్నీ మూసేశారు! ఇంకా మూసేస్తారు. అన్నీ కార్మికులే నడుపుతున్నారు. మీ పరిశ్రమల్లో, రెంటిని అక్కర్లేదని, కల్తీ సరుకులే అని, వాటినీ మూసేశారు! అమ్మో, నేను వెళ్లాలి! ఒక బూర్జువా ఎవరో ఇక్కడే అటు పక్క కూడా వున్నాడంట! మీకు కనపడ్డాడా? అతడికి కూడా చెప్పి రావాలి! అటు పోతా! మీరు వస్తారా, లేదా? వొచ్చినా, ఏ పనీ చెయ్యనంటే జైలే మరి!”
”వచ్చానంటేనా? రైళ్లు నడపగలను, తెలుసా? జీతం ఎంత ఉంటుంది? మా బామ్మర్ది ఒకడు రైలు డ్రైవర్‌గా వుంటే, ఒకసారి వాడి పక్కన కూర్చుని చూశాను. అప్పుడు అనిపించింది నాకు అలాగ…”
”ఇంకేం? ముందు ట్రైనింగ్ అవ్వాలి. గూడ్సుబండికి మొదట ఇస్తారేమో! అయ్యో! నేను పోతా!” అంటూ చంద్రన్న చక చకా నడక ప్రారంభించాడు.
”ఆగు! ఆగు! ఎన్నాళ్లు ఇక్కడీ రొండు రోజులన్నా వుండు!”
చంద్రన్న మౌనంగా దూరం అయ్యాడు.
లేచాడు, పెద్ద బూర్జువా! అటే! అడుగులు చక చకా!! ”చంద్రన్నా! ఆ కమ్యూనిష్టోళ్లు పోట్లాడుకోరంటావా?”
జవాబు లేదు! నడుస్తున్నాడు సూరయ్య! కళ్ల నీళ్లు తుడుచుకున్నాడు.
చెట్టు చాటునించి చంద్రన్న బయటకొచ్చాడు. ”అయ్యో! ఇంటికి పోయి, స్నానం చేసి, తిండి తిని, రోజంతా నిద్రపోయి, అప్పుడు రైలు స్టేషన్‌కి వెళ్ళండి! అక్కడేదో మీకు చెపుతారు.”
”నువ్వు కూడా రా, నాతో! మా ఇంటి వాళ్లు వుంటారా? ఇంటికి తాళం వేసి పోయారా?”
”ఇంకా తాళాలా? దొంగలుంటారా? తాళాలెందుకు? వచ్చి చూడండి, కామ్రేడ్! ఊరు ఎలా మారిందో!”
”కామ్రేడా! ఏంటా పిలుపు పని వాళ్లలాగ?”
”నేను పనివాడినే! మీరూ పనిలోకి దిగుతారుగా కామ్రేడ్! మనం వర్కర్లం కాదు!”
”మరి, ఎవరం?”
”సోదరులం! మానవులం!”
సూరయ్య నవ్వాడు ”ఇది వరకంటా, సోదరులం కామా? మానవులం కామా?”
”అప్పుడు దోపిడీ మానవులం! ఇప్పుడు నిజం తెలుసుకున్నాం.”
”కాదులే, మళ్లీ తిరుగుతాలే వెనక్కి! నేను అలాగే వస్తున్నా.”
”అలాగా? సూరయ్యా! నువ్వు ఇవ్వాళే జైలుకి! నేనే పంపిస్తా! నేను కార్మిక పార్టీకి ఒక కార్యదర్శిని! అదే చెప్పాలని వచ్చా!”
”ఆు…! ఆు… ఆు…”
– రంగనాయకమ్మ