అబద్దాలతో బంధం నిలబడుతుందా?

Can a relationship last with liars?గతంలో వంద అబద్దాలు చెప్పి అయినా ఓ పెండ్లి చేయాలి అనేవారు. అప్పటి పరిస్థితులు వేరు. పెండ్లి తర్వాత ఎలాంటి సమస్యలు వచ్చినా కలిసి బతికేవారు. ప్రస్తుత పరిస్థితుల్లో అబద్దాలు చెప్పి పెండ్లి చేస్తే ఆ బంధం నిలబడుతుందా? వాస్తవానికి అబద్దాలతో ఏ బంధం బలంగా ఉండదు. నిజం అనే పునాదిపైనే బంధాలు నిలబడతాయి. అబద్దాలు చెప్పడం వల్ల బంధంలో ఎలాంటి ఇబ్బందులు వస్తాయో తెలియజేసే కథనమే ఈ వారం ఐద్వా అదాలత్‌…
కరిష్మకు సుమారు 22 ఏండ్లు ఉంటాయి. తల్లిదండ్రులను తీసుకొని మా దగ్గరకు వచ్చింది. ఆమెకు యాసిన్‌తో వివాహం జరిగి ఏడాది అవుతుంది. అయితే అతనితో కలిసి ఉండడం ఆమెకు ఇష్టం లేదు. కరిష్మ, యాసిన్‌ ఇద్దరూ పెండ్లి తర్వాత కలిసి జీవించింది వారం రోజులు మాత్రమే. ఆ తర్వాత రోజు నుండి ఆమె యాసిన్‌తో ఉండటానికి ఇష్టపడటం లేదు. అలా అని ఆమెకు ఇష్టం లేకుండా ఈ పెండ్లేమీ చేయలేదు. ఇద్దరి అంగీకారంతోనే పెద్దలు పెండ్లి చేశారు. ఎంగేజ్‌మెంట్‌కు, పెండ్లికి మధ్య ఆరు నెలల సమయం కూడా తీసుకున్నారు. ఈ మధ్య కాలంలో ఇద్దరూ ఫోన్‌లలో మాట్లాడుకోవడంతో పాటు రెండు మూడు సార్లు కలిసి బయటకు కూడా వెళ్లారు. కాబోయే భార్యాభర్తలే కదా అని ఇంట్లో వాళ్లు కూడా అభ్యంతరం చెప్పలేదు. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి బాగుంటుందని అంగీకరించారు.
ఇద్దరూ సంతోషంగానే పెండ్లి చేసుకున్నారు. కానీ ఏం లాభం పెండ్లి అయిన వారం నుండే కరిష్మ భర్తతో ఉండడం లేదు. పైగా విడాకులు కావాలని అడుగుతుంది. ‘ఇద్దరూ కలిసి కొన్ని రోజులు ఉంటే కదా ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకునేది. అలాంటిది ఏమీ లేకుండా నేరుగా వచ్చి విడాకులు అంటే ఎలా’ అని మేము అడిగితే ‘ఆ కుటుంబం మొత్తం నాకు అబద్దాలు చెప్పారు. నన్ను మోసం చేశారు’ అంటూ ఏడవడం మొదలు పెట్టింది.
‘ఏం జరిగింది, ఎందుకు ఏడుస్తున్నావు అసలు సమస్య ఏంటో చెప్పకుండా ఏడిస్తే ఎలా’ అని అడిగితే… యాసిన్‌కి షుగర్‌ ఉంది. ఆరోగ్యం బాగోదు. ఈ విషయం దాచి పెట్టి పెండ్లి చేశారు. షుగర్‌ పేషంట్‌తో నేను ఎలా ఉండాలి. అందుకే విడాకులు తీసుకోవాలనుకుంటాను’ అంది. దానికి మేము ‘షుగర్‌ ఉన్నంత మాత్రానా విడాకులు ఇవ్వడం ఏమిటి. దానికి సంబంధించిన మందులు వాడితే సరిపోతుంది కదా!’ అన్నాము.
‘షుగర్‌ వ్యాధి వల్ల అతను నన్ను దగ్గరికి తీసుకోవడం లేదు. మేము సంతోషంగా ఉండలేకపోతున్నాము. అలాంటి వ్యక్తితో జీవితాంత ఎలా కలిసి బతకాలి. అతనితో ఎలాంటి ఉపయోగం లేదని మా పుట్టింటికి వచ్చేశాను. అందుకే అతను నాకు వద్దు. నాకు న్యాయం కావాలి’ అంది.
మేము యాసిన్‌ని, అతని కుటుంబ సభ్యులను పిలిచి మాట్లాడితే ‘ఆమె పెండ్లి తర్వాత నాతో వారం రోజులు మాత్రమే ఉంది. ఆమెకు నా గురించి ఏం తెలుస్తుంది. నేను, మా అమ్మానాన్న వెళ్లి రమ్మని అడిగినా రాలేదు. ఆమెకు ఇష్టం లేకపోతే ఎందుకు పెండ్లి చేసుకుంది. నన్ను మోసం చేశారు అని అంటుంది. నాకు షుగర్‌ ఉన్న విషయం ఆమెకు నేను ముందే చెప్పాను. దానికి ఆమె ఒప్పుకుంది. ఇక్కడికి వచ్చి ఇలా చెబుతుంది. షుగర్‌ కోసం నేను రెగ్యులర్‌గా మందులు వాడుతున్నాను. ఆమెకు విడాకులు కావాలంటే ఇస్తాను. కానీ ఎందుకు విడాకులు తీసుకుంటుందో తెలియాలి కదా? నా తప్పు లేకుండా నన్ను అందరి ముందు దోషిగా నిలబెడుతుంది. పెండ్లికి ముందు మేము ఆరు నెలలు ఫోన్లో మాట్లాడుకోవడం, రెండు మూడు సార్లు బయటకు వెళ్లడం కూడా జరిగింది. అయితే పెండ్లి తర్వాత నాతో కలిసి వుండకుండానే ఏడాది వరకు వాళ్ల పుట్టింట్లోనే ఉంది. ఇప్పుడు వచ్చి విడాకులు కావాలంటుంది. నా షుగర్‌ గురించి మా అమ్మానాన్న చెప్పలేదు. కానీ నేను చెప్పాను కదా! ఇది మోసం ఎలా అవుతుంది’ అని అడిగాడు.
మీరిద్దరూ సంసార జీవితం ప్రారంభించలేదని ఆమె చెబుతుంది మరి దాని గురించి ఏమిటీ అని అడిగితే ‘ఆమె నాతో ఉండనే లేదు, అలాంటప్పుడు ఇద్దరి మధ్య సంబంధం ఎలా ఏర్పడుతుంది’ అన్నాడు. కరిష్మా మాత్రం ‘వారం రోజులు ఉన్నాను, అప్పుడు నన్ను దగ్గరికి తీసుకోలేదు. అంతకు మించి ఇంకేం చెప్పాలి’ అంది. దానికి మేము ముందు మీరిద్దరూ పదిహేను రోజులు కలిసి ఉండండి. ఏదైనా ఇబ్బంది ఉంటే డాక్టర్‌ దగ్గరకు వెళ్లి టెస్టులు చేయించుకోండి. ఆ రిపోర్ట్స్‌ తీసుకొని రండి’ అని చెప్పి పంపించాము.
రెండు వారాల తర్వాత యాసిన్‌ టెస్టులు చేయించుకొని కరిష్మను తీసుకొని వచ్చాడు. ఆ రిపోర్టులో యాసిన్‌కు లైంగిక పటుత్వం కొంచెం తక్కువగా ఉందని వచ్చింది. అయితే మందులు వాడితే తగ్గే అవకాశం ఉందని డాక్టర్‌ చెప్పారు. అయితే కరిష్మ మాత్రం ‘ఇలాంటి వ్యక్తితో నేను కలిసి ఎలా బతకాలి. నా వల్ల కాదు. ఇంట్లో ఎలాం టి సమస్య ఉన్నా సర్దుకుపోవచ్చు. భర్త సంసార జీవితానికి పనికి రాకపోతే ఎలా కలిసుండాలి, నేను ఉండలేను’ అంది.
దానికి యాసిన్‌ ‘సరే, తనకు ఇష్టం లేనప్పుడు బలవంతంగా కలిసి ఉండడం జరిగే పని కాదు. ఆమెను ఇబ్బంది పెట్టడం సరైనది కాదు. ఆమె కోరినట్టే విడాకులు ఇస్తాను’ అని చెప్పాడు. అయితే ఆమెకు నష్టపరిహారంగా రెండు లక్షల రూపాయలు, పెండ్లి ఖర్చులు కూడా యాసిన్‌ నుండి ఇప్పించాము.
పెండ్లి అనే బంధం ఇలాంటి అబద్దాలతో కాకుండా నిజంతో, నమ్మకంతో ప్రారంభించాలి. లేకపోతే ఒక జీవితంతో పాటు రెండు కుటుంబాలు బలి కావల్సి వస్తుంది. కాబట్టి అబద్దాలతో కాకుండా నిజాలతో బంధాలను ముందుకు తీసుకెళ్లాలి.
– వై వరలక్ష్మి,
9948794051