అదానీ అవినీతి

Sampadakiyamమోడీకి అత్యంత ప్రియతముడు, అచిర కాలంలోనే అపర కుబేరుడైన గౌతమ్‌ అదానీ వ్యాపార సామ్రజ్యాన్ని ఒక భారీ సంక్షోభం చుట్టుముట్టింది. అమెరికా జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌, సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌ (సెక్‌)లు సివిల్‌ సెక్యూరిటీల మోసంపై మోపబడిన అభియోగాలపై చేసిన విచారణలో సోలార్‌ కాంట్రాక్ట్‌ల కోసం ప్రభుత్వ అధికారులకు రూ.2,200 కోట్లకు పైగా చెల్లించినట్టు తేలింది. ఇరవైయేండ్లలో రూ.15వేల కోట్ల పన్ను అనంతర లాభాలను ఆర్జిస్తుందని అంచనా వేయబడిన రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టులను పొందేందుకు ఈ పథకం ఉద్దేశించబడిందని ప్రాసిక్యూటర్లు ఆరోపించారు.
ఈ నేరారోపణలో భారత ప్రభుత్వ అధికారులకు రూ.2,200 కోట్లకు పైగా లంచాలు చెల్లించడం, పెట్టుబడిదారులకు, బ్యాంకులకు అబద్ధాలు చెప్పి అనేక బిలియన్ల డాలర్లను సమీకరించడం, న్యాయాన్ని అడ్డుకోవడం వంటి ఆరోపణలు న్నాయని డిప్యూటీ అసిస్టెంట్‌ అటార్నీ జనరల్‌ లిసా మిల్లర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ లంచం కేసును క్లుప్తంగా ఇలా వివరించవచ్చు… అదానీ గ్రూప్‌కు చెందిన గ్రీన్‌ ఎనర్జీ కంపెనీ అమెరికన్‌ స్టాక్‌ మార్కెట్లలో లిస్టు అయిన మారిషస్‌కు చెందిన అజూర్‌ పవర్‌ అనే కంపెనీతో భాగస్వామిగా ఉంది. భారతదేశంలో సోలార్‌ ఎనర్జీ ప్రాజెక్టులను నిర్మించాలనే ప్రణాళికతో అమెరికన్‌ పెట్టుబడిదారులను పెద్ద ఎత్తున ఆకర్షించి, వారి నుండి రూ.25వేల కోట్లు సేకరించింది. అయితే, సోలార్‌ విద్యుత్తు ఖరీదైనది కావటంతో ఏ ప్రభుత్వమూ దానిని కొనుగోలు చేయడానికి ఇష్టపడలేదు. దానితో భారతదేశంలో సౌరశక్తి ఒప్పందాలను పొందడంలో సమస్యలు తలెత్తాయి. ఆ సమస్యను పరిష్కరించడానికి భారతదేశంలో రాజకీయ నాయకులకు, బ్యూరోక్రాట్లకు రూ.2,200 కోట్లు లంచంగా ఇచ్చారు. ఈ నగదు అమెరికన్‌ పెట్టుబడిదారుల నుండి సేకరించిన నిధుల నుండి వచ్చింది. ఇక్కడే అసలు కథ మొదలైంది. కార్పొరేట్‌ రంగంలో కుంభకోణాలను అరికట్టేందుకు 1977లో ఫారిన్‌ కరప్ట్‌ ప్రాక్టిసెస్‌ యాక్ట్‌ (ఎఫ్‌సిపిఏ) పేరిట అమెరికా ప్రభుత్వం ఒక చట్టం చేసింది. ఈ చట్టం ప్రకారం అమెరికా పెట్టుబడిదారుల ప్రమేయం వున్న, అమెరికా స్టాక్‌ ఎక్సేంజీలలో నమోదైన విదేశీ కంపెనీలు లంచం ఇవ్వటం, ఇస్తామని ఆశ చూపటం, ప్రభుత్వాధినేతలకు, అధికారులకు లంచం ఇవ్వటం నేరం.
సోలార్‌ విద్యుత్తు కోసం నిధులను సేకరించిన అదానీ గ్రీన్‌ ఎనర్జీ, న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌లో నమోదైన అజూర్‌ పవర్‌ సహజంగానే ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. ఈ కేసును అమెరికా ప్రభుత్వ నేరపరిశోధక సంస్థ ఎఫ్‌బిఐ, మార్కెట్‌ రెగ్యులేటర్‌ సెక్‌ దర్యాప్తు చేసినప్పుడు భారతదేశంలో లంచాలు ఇచ్చినట్టు, అమెరికన్‌ పెట్టుబడిదారులను మోసం చేసినట్టు తేలింది. దానితో అమెరికన్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ జస్టిస్‌ కి చెందిన గ్రాండ్‌ జ్యూరీ గౌతమ్‌ అదానీకి, మరో ఏడుగురికి వ్యతిరేకంగా అభియోగాలను దాఖలు చేసి, వారెంట్‌ను జారీ చేసింది. రెండేండ్లుగా కొనసాగుతున్న ఈ దర్యాప్తులో అదానీ భారతదేశ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీని తప్పుదారి పట్టించారని కూడా వెల్లడైంది. ఈ కుంభకోణంలో భాగం ఇచ్చిన లంచంలో సింహ భాగం ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రికి చేరినట్టు అమెరికన్‌ ప్రభుత్వ సంస్థల విచారణలో వెల్లడైంది. గౌతమ్‌ అదానీ జగన్‌ను స్వయంగా రెండు, మూడు సార్లు కలవడం జరిగిందని, అలా కలిసిన తర్వాత రూ.1750 కోట్లు లంచంగా ఇవ్వటానికి అంగీకారం కుదిరాకే ఒప్పందాలు ఖరారయ్యాయని అదానీ గ్రూపు కంపెనీల అంతర్గత సందేశాలలో వివరణలు ఉన్నట్టు విచారణలో తేలింది. 2023 ప్రారంభంలో వెలువడిన హిండెన్‌బర్గ్‌ పరిశోధన నివేదిక కంటే తాజా సంక్షోభం ప్రభావం తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అదానీ గ్రూప్‌ ఫ్లాగ్‌షిప్‌ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ గురువారం అత్యంత ముఖ్యమైన నష్టాన్ని చవిచూసింది. మార్కెట్‌ ప్రారంభమైన కొద్దిసేపటికే రూ.61వేల కోట్లు లేదా దాని విలువలో 20 శాతం నష్టపోయింది. గ్రూప్‌ మొత్తం నష్టాలు రూ.2.60 లక్షల కోట్లకు చేరుకున్నాయి. కెన్యా దేశం అదానీతో చేసుకున్న వ్యాపార ఒప్పందాలన్నీ రద్దు చేసుకుంది.
పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున, అదానీ గ్రూపుపై మోపబడిన నేరారోపణలకు మోడీ ప్రభుత్వం సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. అదానీ గ్రూపు యాజ మాన్యంలో ఓడరేవులు, విమానాశ్రయాలు, విద్యుత్‌, సిమెంట్‌ తో సహా అనేక రంగాలు ఉన్నాయి. ఈ పరిశ్రమలకు సంబం ధించిన నియంత్రణాధికారులందరూ ఇప్పుడు లేవనెత్తిన ఆరోపణలను పారదర్శకంగా, ఒక నిర్ణీత సమయంలో పరిశోధించాల్సిన అవసరం ఉంది. భారతీయ మార్కెట్లను అణగదొక్కడానికి ఇది ఒక ”అంతర్జాతీయ కుట్ర”లో భాగమని బీజేపీ ప్రతినిధి చేసిన వాదన ఎవ్వరినీ ఒప్పించజాలదు. ఇటువంటి వాదన భారత ప్రజల సాధారణ జ్ఞానాన్ని అవమా నించడానికే పనికివస్తుంది. అత్యంత ప్రియతమ స్నేహితుడి లంచావ తరంపై మోడీ తప్పించుకోవడం ఇప్పుడు సాధ్యం కాదు. ఆదానీని వెంటనే అరెస్టు చేయకపోతే, ఆ అవినీతిలో ప్రభుత్వమూ భాగస్వామి అయినట్లే.