– కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు జె. వెంకటేష్
– రెండో రోజూ భూపాలపల్లి జిల్లా సీపీఐ(ఎం) మహాసభలు
నవతెలంగాణ-భూపాలపల్లి
కేంద్ర ప్రభుత్వ విధానాలను రాష్ట్ర ప్రభుత్వం ఎండగడుతూనే, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, పేదలకు ఇండ్ల స్థలాల పట్టాలు అందించడంతోపాటు ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ నాయకులు జె. వెంకటేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం భూపాలపల్లి కేంద్రంలోని కృష్ణ కాలనీ సింగరేణి కమిటీ హాల్లో 2వరోజు జరిగిన సీపీఐ(ఎం) జిల్లా 3వ మహాసభల అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనేక విధ్వంసాలకు పాల్పడుతుందన్నారు. ప్రజలకు ఉపయోగపడే పలు కంపెనీలను ప్రయివేటుపరం చేస్తుందని తెలిపారు. సింగరేణి బొగ్గు బ్లాకులను కేంద్ర ప్రభుత్వం వేలం వేసే పద్ధతిని నిలిపివేయాలని, సింగరేణి ప్రాంతంలో ఉన్న బొగ్గు బ్లాక్‌లను సింగరేణికే అప్పగించాలని డిమాండ్ చేశారు.
జిల్లాకు రైల్వే మార్గాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని, సింగరేణి జెన్కో ఆధారిత పరిశ్రమలైన బొగ్గు శుద్ధి కర్మాగారం, ఎరువుల కర్మాగారం, సిమెంటు కర్మాగారం ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా సంబరాలు జరుపుతున్నారని, కానీ ప్రజా సంక్షేమానికి ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని చెప్పారు. జిల్లాలో ప్రజల పక్షాన సమరశీల పోరాటాలు చేస్తూ, ప్రజల పక్షాన సీపీఐ(ఎం) ఎప్పటికీ అండగా ఉంటుందని స్పష్టంచేశారు. పోడు భూములకు పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ప్రయివేటు రంగంలోనూ రిజర్వేషన్లు అమలుచేయాలని కోరారు. సింగరేణి, జెన్ కో, మేడిగడ్డ-అన్నారం ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం ఇచ్చి, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అందజేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని కారల్ మార్క్స్ కాలనీ, జవహర్ నగర్, రాజీవ్‌నగర్, బాంబులగడ్డ సీిఆర్నగర్, శాంతినగర్ కాలనీవాసుల ఇండ్లకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి బందు సాయిలు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కంపేటి రాజయ్య, చెన్నూరు రమేష్, పోలం రాజేందర్, వి. రాజయ్య, గుర్రం దేవేందర్, సంఘం ప్రీతి ఆతుకూరి శ్రీకాంత్, ప్రతినిధులు పాల్గొన్నారు.