స్త్రీలేకపోతే జననం లేదు… స్త్రీ లేకపోతే గమనం లేదు. స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు. స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదు. అవును.. నిజమే కదా ఈ సృష్టికి మూలం స్త్రీ. నవమాసాలు మోసి బిడ్డకు జన్మనివ్వడం దగ్గర నుండి ఆ బిడ్డను పెంచి పెద్ద చేసి సమాజంలో ఓ మంచి పౌరునిగా తీర్చిదిద్దడంలో స్త్రీ పాత్ర కీలకం. మరి అలాంటి స్త్రీలపై దాడులు ఎందుకు జరుగుతున్నాయి? ముక్కుపచ్చలారని బాలికలపై, యువతులపై, వృద్ధ మహిళలపై ఎలాంటి దారుణానికి పాల్పడుతున్నారో రోజూ వార్తల్లో చూస్తూనే ఉన్నాం.
ఏండ్లు గడుస్తున్నా స్త్రీలను ద్వితియ శ్రేణి పౌరులుగా చూడడమే దీనికి కారణం. ఆకాశంలో సగం.. అవకాశాల్లో సగం.. అన్నింటా సగం.. అంటూ ప్రతి ఏడాది ప్రపంచ మహిళా దినోత్సవం రోజు అంగరంగ వైభంగా సంబరాలు జరుపుకుంటున్నాం. ఆ ఒక్క రోజుతోనే ఆ వేడుకలు ముగిసిపోతున్నాయి. కానీ నిత్య జీవితంలో మాత్రం వారి హక్కులను గుర్తించడం లేదు. అందుకే ప్రతి ఏడాది నవంబర్ 25ను మహిళా హక్కుల పరిరక్షణా దినంగా, స్త్రీలపై జరుగుతున్న హింసా వ్యతిరేక దినంగా జరుపుకుంటున్నాం.
అడ్డంకులను ఎదిరించి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తూ.. ఎందరో నారీమణులు చరిత్రలో తమకంటూ ఓ స్థానాన్ని సాధించుకున్నారు. ‘మహిళల స్థితిగతులు బాగుపడనిదే సమాజం అభివృద్ధి చెందదు. ఏ పక్షి అయినా ఒక రెక్కతో ఎగరలేదు’ అన్న స్వామి వివేకానంద మాటలు ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవల్సిన తరుణం ఇది. అయితే సమాజంలో అన్నీ మారుతున్నాయి. మహిళల పట్ల మన ఆలోచనా ధోరణి తప్ప. ‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత’ అంటూ గొప్పగా చెప్పుకుంటున్నాం. దీనికి అర్థం ఎక్కడ స్త్రీలు పూజలందుకుంటారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని. కాని దేవతగా కాదు కదా కనీసం ఆమెను మనిషిగానైనా చూడకపోవడమే మన దౌర్భాగ్యం. స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాల పరంపర ఆందోళన కలిగిస్తోంది.
సమాజ నిర్మాణంలో సగభాగమైన స్త్రీ సమానత్వమే మన ప్రగతికి మూలం. ఈ విషయాన్ని గుర్తించకపోతే మనిషి మనుగడే కష్టమవుతుంది. సమాజంలో మహిళలు ఆత్మగౌరవంతో, స్వశక్తితో తమ ఆర్థిక అవసరాలను తామే తీర్చుకోగలిగే ఉన్నత స్థితికి చేరుకున్నారు. విద్య, వైద్యం, వ్యాపారాలు, రాజకీయాలు, క్రీడలు, బ్యాంకింగ్, అంతరిక్షం, టెక్నాలజీ వంటి పలు రంగాల్లో రాణిస్తూ సాధికారత సాధన దిశగా అడుగులు వేస్తున్నారు. మానవ వనరుల సంపూర్ణ వినియోగంలో వీరి పాత్ర కూడా కీలకం. రంగం ఏదైనా ఉన్నత శిఖరాలను చేరుకుని పురుష శక్తికి తామేమీ తీసిపోమని చాటిచెబుతున్నారు. తాము ఇంటికే పరిమితం కాదంటూ పురుషులకు ధీటుగా విజయాలు సాధిస్తున్నారు.
ఎన్ని విజయాలు సాధించినా స్త్రీ శక్తి వంచనకు గురి అవుతూనే ఉంది. సభ్య సమాజ చైతన్యాన్ని, సామాజిక బాధ్యతలను సవాలు చేస్తూ సాగిపోతున్న స్త్రీలపై దారుణ అఘాయిత్యాలకు, హింసకు అంతులేకుండా పోతోంది. వీటిని నియంత్రించేందుకు ఎంతటి కఠిన చట్టాలను తీసుకువచ్చినా నిర్వీర్యమైపోతున్నాయి. పోరాడి సాధించుకున్న హక్కులన్నీ కాలరాయబడుతున్నాయి. ఇంటా బయట మహిళలు ఎదుర్కొంటున్న హింసకు అంతం లేకుండా పోయింది. ఇందుకు కారణాలేమిటో ప్రతి ఒక్కరూ గుర్తించాలి. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ, అవరోధాలను అధిగమిస్తూ అడుగు ముందుకేయాలి. మహిళల గౌరవం, గుర్తింపు, హక్కుల పరిరక్షణ గురించి ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలి. లింగ సమాన ప్రపంచాన్ని సృష్టించాలి.