పదేండ్ల గులాబీ పాలనలో జర్నలిస్టుల ఇంటి స్థలాల పరిస్థితి ‘వస్తా కూసుండు’ అన్నట్టు ఉండేది. ఇండ్ల స్థలాల కోసం ఎదురు చూసిచూసి కండ్లు కాయలు కాశాయి. కొన్ని ప్రాణాలు కూడా పోయాయి. కొంతమంది ఆశ వదిలేసుకున్నారు. మరికొంతమంది ఈ సర్కారు ఇవ్వదని ఛీకొట్టారు. అయినా కొంతమంది ఉత్సాహవంతులు ‘మూడోసారి కూడా బీఆర్ఎస్ వస్తుంది…ఇండ్లస్థలాలు ఇస్తుంది’ అని నమ్మించే ప్రయత్నం చేసి బొక్కబొర్లా పడ్డారు. ఆ పార్టీ ఓడిపోయింది. ఇంకేముంది, అంతా అయిపాయే.. ఆ చర్చ ఇప్పుడెందుకంటారా? కొన్ని సందర్భాల్లో గతాన్ని గుర్తుచేస్తే తప్ప అసలు ముచ్చట బయటకురాదు. అందుకే ఒక్కసారి జర్నలిస్టులకు గుర్తుచేస్తున్నా.. ఇటీవల రవీంద్ర భారతిలో జేఎన్జే సభ్యులకు భూమి హక్కులు పత్రాలిచ్చే సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పిన మాటలు పదేండ్లుగా జర్నలిస్టులు పడుతున్న బాధలు, ఆవేదనలు ఒక్కసారిగా మనస్సును తేలికచేశాయి. ‘ప్యూచర్సిటీలో జర్నలిస్టులకు ఇండ్లస్థలాలిస్తాం….ఆ బాధ్యతను ఇద్దరు శీనన్నలకు అప్పగించాం.’ అనడంతో మనసులు పడిలేచిన కెరటాల్లా ఎగిసిపడ్డాయి. ఇగ అప్పటినుంచి జర్నలిస్టులకు మంచిరోజులు వచ్చాయనుకుని అందరూ భావించారు. కానీ, అస్సలు కత ఇప్పుడే మొదలైంది. ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ కార్యాలయంలో సీఎం మాట్లాడుతూ రెండోసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే జర్నలిస్టులకు ఇండ్లస్థలాలిస్తామని పెద్దబాంబు పేల్చారు. ఆయన మాటలు అక్కడున్న వారినే కాదు, రాష్ట్రంలోని జర్నలిస్టులందరి మనసులను అతలాకుతలం చేశాయి. కొత్త ముఖ్యమంత్రి ఇండ్ల స్థలాల విషయంలో జర్నలిస్టులకు ‘నమ్మకాన్ని పెంచారు… వెంటనే బాధ పెట్టారు’ ఎందుకబ్బా? అని చర్చించుకుంటున్నారు. ఇదే విషయాన్ని ఢిల్లీ జర్నలిస్టులు సీఎం దృష్టికి తీసుకెళ్లగా… ‘గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు మాత్రమే ఇండ్ల స్థలాలి చ్చాయి. ఇప్పుడు కూడా మా ప్రభుత్వమే ఇస్తుంది. ఆ బాధ్యతను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, ప్రెస్ అకాడమీ చైర్మెన్ కె.శ్రీనివాసరెడ్డికి అప్పగించాం. వారి ఆ పనిలో నిమగమ య్యారు. కచ్చితంగా ఇచ్చినమాట ప్రకారం ప్యూచర్ సిటీలో ఇండ్ల స్థలాలిస్తాం’ అని సీఎం మరోసారి ఆయన వాక్చాతుర్యాన్ని ప్రదర్శించారు. ఆయన మాటల్ని నమ్మాలో..నమ్మకూడదో అని అసహనంగా చర్చించుకోవడం జర్నలిస్టుల వంతైంది.
– గుడిగ రఘు