అంతకు మించి..

Beyond that..ఇటీవల కాలంలో ప్రపంచ ప్రేక్షకుల మనసు దోచుకున్న ‘కాంతారా’ సిరీస్‌ నుంచి ఇప్పుడు ‘కాంతారా చాప్టర్‌- 1’ రాబోతోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది అక్టోబర్‌ 2న విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ అధికారికంగా ప్రకటించింది. పాన్‌ ఇండియా సినిమాగా మరోసారి అందర్నీ ఆకర్షించేందుకు ఈ మూవీ సిద్ధంగా ఉంది. ఈ  ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కి నాయకత్వం వహిస్తున్న నటుడు-దర్శకుడు రిషబ్‌ శెట్టి తన పాత్ర కోసం ఎంతో శ్రమిస్తున్నారు. తన పాత్రలో రియాలిటీ ఉట్టిపడేలా కష్టపడుతున్నారు. కేరళ  నుండి ఉద్భవించిన పురాతన యుద్ధ కళలలో ఒకటైన కలరిపయట్టులో రిషబ్‌ కఠినమైన శిక్షణ పొందారు. కళలో ప్రావీణ్యం సంపాదించడానికి అంకిత భావంతో పని చేసి తన  పాత్ర, సంప్రదాయానికి మచ్చుతునకలా నిలిచేలా చేశారు. సినిమాలో ఈ రోల్‌ హైలైట్‌ అవుతుందని మేకర్స్‌ నమ్మకం వ్యక్తం చేశారు. ‘కాంతారా చాప్టర్‌- 1’ కొంకణ్‌ జానపద  గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేయనుంది. గ్రిప్పింగ్‌ కథనం, ఉత్కంఠభరితమైన విజువల్స్‌తో ఈ చిత్రం భారతదేశ సరిహద్దులను దాటి ప్రేక్షకులకు కనెక్ట్‌ చేస్తుంది.  ఇప్పటికే వచ్చిన ‘కాంతారా’ మూవీ స్థానిక సంప్రదా యాల ప్రామాణికమైన వర్ణన, స్టోరీ టెల్లింగ్‌తో స్లీపర్‌ హిట్‌గా మారింది. ఈ ఫ్రాంచైజీకి ప్రపంచ స్థాయి ఫ్యాన్స్‌ని సొంతం  చేసింది. ఈ చిత్రం సినీ చరిత్రలో మరో మైలురాయి అవుతుందని మేకర్స్‌ అన్నారు.