పుదిచ్చుకున్న పుట్టింటి గడప

The cradle of birthపరాయింటికి వోయినా..
ఆడపిల్లెప్పటికీ
పుట్టింటికి పునాదిరాయే
అమ్మ అయ్యబోయినంక
అన్నమీద సాగుబాటంటే
వొదినబోసే వొడిబియ్యమే
అత్త ఆడబిడ్డతో కలిపి
మూడు వొళ్ళ బియ్యానికే
లగ్గం కాయమయితే
పేదింటి కలికుండ పెండ్లిపిల్లై మురుస్తది
తంగెడు పూల పాదాలు
మోదుగు పూలపారాణి అద్దుకున్నాక
ఏటి సూతకాలు ఎన్ని అడ్డమొచ్చినా
ఏండ్లుబడిపోకుంట
వొడిబియ్యం పోసుకొని
పుట్టింటి గడప పుదిచ్చుకుంటది
గొడ్డుగోదకు పోస దొరకని
గడ్డు కార్తెలెదురైనా
వంతన పడిపోవద్ధనే కాదు
ప్రేమలు వాడిపోవద్దని
అమ్మింటి ఆరివారాన్ని
ఒడినిండా నింపుకుంటుంటే
ఇల్లు ఇల్లంతా పూలతీగలల్లుకుంటాయి
ఐదు కుడుకలు మూడు మడుపులు
నల్ల పోకలు తమలపాకులే కాదు
ఒడి బియ్యమంటే.. అమ్మింటి అండ
బతుకు నిండా ఉంటుందన్న భరోసా..
పుట్టింటి ధైర్నాన్ని నెత్తికెత్తుకుపోయి
అత్తింట్లో చూపించే ఆడపిల్ల పెగ్గె
దేవునర్రల బియ్యం ఇడిసి
తాంబాలంలో ఒంపిన
ఐదు పిడికిల్ల దీవనార్తికి
అన్నదమ్ముల కళ్ళు ఉప్పునీటి బుగ్గలైతయి
సముర్త సారె, శ్రావణ పట్టె, బారసాల, తమ్ముడి పెళ్లి, పుట్టింటి కార్యం ఏదైనా
ఆడపిల్ల అధికారానికి
అమ్మింటి గౌరవమే ఒడి బియ్యం
దేవుడికి దండంబెట్టి
దర్వాజకు బొట్లు పెట్టి
పెనిమిటెంట కదులుతుంటే
అమ్మ నాన్నలకెప్పుడూ అప్పగింతలే
ఆడపిల్ల రెండు గుండెల్ని
ఒడిబియ్యంతో ముడివేసి కట్టిన
తాత ముత్తాతల సేతులకు
దండం పెట్టి తీరాలి..
– తుల శ్రీనివాస్‌, 9948525853