– యశస్వి 161, కోహ్లి 100
– పెర్త్ టెస్టులో గెలుపు ముంగిట భారత్
– భారత్ రెండో ఇన్నింగ్స్ 487/6 డిక్లేర్డ్
– ఆసీస్ లక్ష్యం 534, ప్రస్తుతం 12/3
భారత్, ఆసీస్ తొలి టెస్టు మూడో రోజు పెర్త్‌లో భారత బ్యాటర్లు పరుగుల పండుగ చేసుకున్నారు. కింగ్ విరాట్ కోహ్లి (100 నాటౌట్) అజేయ సెంచరీతో మెరువగా.. ప్రిన్స్ యశస్వి జైస్వాల్ (161) మరో భారీ సెంచరీతో అదరగొట్టాడు. జైస్వాల్, విరాట్ శతక మోతతో భారత్ రెండో ఇన్నింగ్స్‌ను 487/6 వద్ద డిక్లరేషన్ ఇచ్చింది. ఆస్ట్రేలియాకు 534 పరుగుల రికార్డు లక్ష్యాన్ని నిర్దేశించింది. పేసర్లు బుమ్రా, సిరాజ్‌లు నిప్పులు చెరగటంతో ఆసీస్ అప్పుడే 3 వికెట్లు కోల్పోయింది. నేడు నాల్గో రోజు ఆటలోనే లాంఛనం ముగించేందుకు బుమ్రాసేన రంగం సిద్ధం చేసుకుంది.
నవతెలంగాణ-పెర్త్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో టీమ్ ఇండియా విజయం ముంగిట నిలిచింది. 534 పరుగుల రికార్డు ఛేదనలో ఆతిథ్య ఆస్ట్రేలియా 4.2 ఓవర్లలో 12/3తో పీకల్లోతు కష్టాల్లో కూరుకుంది. పేసర్లు జశ్‌ప్రీత్ బుమ్రా (2/1), మహ్మద్ సిరాజ్ (1/7) ఆసీస్ బ్యాటర్లను వణికించారు. ఆసీస్ విజయానికి మరో 522 పరుగులు అవసరం కాగా.. భారత్ విజయానికి ఏడు వికెట్ల దూరంలో నిలిచింది. అంతకుముందు.. భారత క్రికెట్ కింగ్, ప్రిన్స్ శతక మోత మోగించారు. యశస్వి జైస్వాల్ (161, 297 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స్‌లు), విరాట్ కోహ్లి (100 నాటౌట్, 143 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీలతో కదం తొక్కారు. కెఎల్ రాహుల్ (77, 176 బంతుల్లో 5 ఫోర్లు) అర్థ సెంచరీతో మెరువగా.. నితీశ్ కుమార్ రెడ్డి (38 నాటౌట్, 27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), వాషింగ్టన్ సుందర్ (29, 94 బంతుల్లో 1 సిక్స్), దేవదత్ పడిక్కల్ (25, 71 బంతుల్లో 2 ఫోర్లు) రాణించారు. 134.3 ఓవర్లలో 487/6 పరుగుల వద్ద భారత్ రెండో ఇన్నింగ్స్‌ను డిక్లరేషన్ ప్రకటించింది. నేడు నాల్గో రోజు ఆటలో టీమ్ ఇండియా గెలుపు లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.
యశస్వి అదరగొట్టాడు
ఓవర్‌నైట్ స్కోరు 172/0తో మూడో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన భారత్.. ఓపెనర్ల మెరుపులతో పెర్త్ టెస్టుపై తిరుగులేని పట్టు సాధించింది. యశస్వి జైస్వాల్ కాస్త దూకుడు పెంచి ఆడగా.. రాహుల్ తనదైన శైలిలోనే పరుగులు పిండుకున్నాడు. 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 205 బంతుల్లో సెంచరీ సాధించాడు. సచిన్ టెండూల్కర్ తర్వాత ఆసీస్ గడ్డపై తొలి టెస్టులోనే శతకం సాధించిన అతి పిన్న వయస్కుడిగా యశస్వి నిలిచాడు. సెంచరీ అనంతరం జోరు పెంచిన జైస్వాల్.. మరో 70 బంతుల్లోనే 150 మార్క్ చేరుకున్నాడు. ద్వి శతకం ఊరిస్తుండగా సహనం కోల్పోయిన జైస్వాల్.. ఆసీస్ పార్ట్‌టైమ్ పేసర్ మార్ష్‌కు వికెట్ కోల్పోయాడు. రాహుల్ 77 పరుగుల వద్ద వికెట్ కోల్పోయాడు. దీంతో 201 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. తొలి సెషన్లో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయిన భారత్.. రెండో సెషన్లో నాలుగు వికెట్లు చేజార్చుకుంది. పడిక్కల్ కాసేపు క్రీజులో నిలిచినా.. నిలకడగా ఆడలేదు. 275/1తో పటిష్టంగా కనిపించిన భారత్.. రిషబ్ పంత్ (1), ధ్రువ్ జురెల్ (1) సహా జైస్వాల్ వికెట్లతో 321/6కి పరిమితమైంది. చివరి నాలుగు వికెట్లను ఆసీస్ పడగొడుతుందనే అనిపించింది.
కింగ్ కోహ్లి కొట్టేశాడు
కొంతకాలంగా అంచనాలను అందుకోలేకపోతున్న విరాట్ కోహ్లి.. అచ్చొచ్చిన ప్రత్యర్థి ఆసీస్‌పై శతకంతో చెలరేగాడు. లంచ్ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన కోహ్లి మరో ఎండ్‌లో వికెట్లు పడుతున్నా సహనంగా ఆడాడు. వాసింగ్టన్ సుందర్ (29) జతగా కోహ్లి కీలక భాగస్వామ్యం నమోదు చేశాడు. వికెట్ల పతనం అడ్డుకున్న ఈ జోడీ 176 బంతుల్లో 89 పరుగులు జోడించింది. లయాన్ ఓవర్లో భారీ షాట్‌కు వెళ్లిన సుందర్ వికెట్ కోల్పోయాడు. క్రీజులోకి కోహ్లికి జతకలిసిన తెలుగు తేజం నితీశ్ కుమర్ రెడ్డి (38 నాటౌట్) ధనాధన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. వచ్చీ రాగానే సిక్సర్ బాదిన నితీశ్ కుమార్..ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చాడు. మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు కొట్టిన నితీశ్ 27 బంతుల్లోనే 38 పరుగులు చేశాడు. లబుషేన్ ఓవర్లో స్వీప్ షాట్‌తో బౌండరీ బాదిన విరాట్ కోహ్లి ‘వంద’ అభివాదం చేశాడు. 8 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టిన విరాట్ కోహ్లి ఆసీస్ బౌలర్లను అలవోకగా ఎదుర్కొన్నాడు. అవుట్‌ఫీల్డ్ మరీ నెమ్మదిగా ఉండటంతో భారత్ విలువైన పరుగులను కోల్పోయింది. నితీశ్, కోహ్లి జోడీ 54 బంతుల్లోనే 77 పరుగులు జోడించారు. దీంతో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 487/6 పరుగులు చేసింది. ఆధిక్యం 533 పరుగులు ఉండటంతో.. కోహ్లి సెంచరీ సాధించగానే బుమ్రా భారత ఇన్నింగ్స్‌ను డిక్లరేషన్ ప్రకటించాడు. ఆసీస్ బౌలర్లలో స్పిన్నర్ నాథన్ లయాన్ (2/96) రెండు వికెట్లు పడగొట్టగా.. స్టార్క్, కమిన్స్, హాజిల్‌వుడ్, మార్ష్‌లు తలా ఓ వికెట్ పడగొట్టారు. హాజిల్‌వుడ్ ఇన్నింగ్స్ అసాంతం మెరుపు బంతులు సంధించినా వికెట్ల వేటలో సఫలం కాలేదు.
బుమ్రా నిప్పులు
మూడో రోజు ఆఖర్లో ఛేదనకు వచ్చిన ఆస్ట్రేలియాకు పేస్ దళపతి జశ్‌ప్రీత్ బుమ్రా పీడకల మిగిల్చాడు. రెండో ఇన్నింగ్స్‌లో 4.2 ఓవర్లలోనే ఆసీస్ మూడు వికెట్లు చేజార్చుకుంది. ఇన్నింగ్స్ నాల్గో బంతికే యువ ఓపెనర్ నాథన్ మెక్‌స్వీనీ (0)ను డకౌట్ చేసిన బుమ్రా.. మార్నస్ లబుషేన్ (3)ను సైతం వికెట్ల ముందు అవుట్ చేశాడు. నైట్ వాచ్‌మెన్ పాట్ కమిన్స్ (2)ను సిరాజ్ స్లిప్స్‌లో క్యాచౌట్‌గా వెనక్కి పంపించాడు. 534 పరుగుల రికార్డు ఛేదనలో కంగారూలు 12 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. ఆసీస్‌కు మరో 522 పరుగులు అవసరం కాగా.. టీమ్ ఇండియా విజయానికి మరో 7 వికెట్ల దూరంలో నిలిచింది.
స్కోరు వివరాలు :
భారత్ తొలి ఇన్నింగ్స్ : 150/10
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ : 104/10
భారత్ రెండో ఇన్నింగ్స్ : జైస్వాల్ (సి) స్మిత్ (బి) మార్ష్ 161, రాహుల్ (సి) కేరీ (బి) స్టార్క్ 77, దేవదత్ పడిక్కల్ (సి) కేరీ (బి) హాజిల్‌వుడ్ 25, విరాట్ కోహ్లి నాటౌట్ 100, రిషబ్ పంత్ (స్టంప్డ్) కేరీ (బి) లయాన్ 1, ధ్రువ్ జురెల్ (ఎల్బీ) కమిన్స్ 1, వాషింగ్టన్ సుందర్ (బి) లయాన్ 29, నితీశ్ కుమార్ రెడ్డి నాటౌట్ 38, ఎక్స్‌ట్రాలు : 55, మొత్తం : (134.3 ఓవర్లలో 6 వికెట్లకు) 487 డిక్లేర్డ్.
వికెట్ల పతనం : 1-201, 2-275, 3-313, 4-320, 5-321, 6-410.
బౌలింగ్ : మిచెల్ స్టార్క్ 26-2-111-1, జోశ్ హాజిల్‌వుడ్ 21-9-28-1, పాట్ కమిన్స్ 25-5-86-1, మిచెల్ మార్ష్ 12-0-65-1, నాథన్ లయాన్ 39-5-96-2, లబుషేన్ 6.3-0-38-0, ట్రావిశ్ హెడ్ 5-0-26-0.
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ : మెక్‌స్వీనీ (ఎల్బీ) బుమ్రా 0, ఉస్మాన్ ఖవాజా నాటౌట్ 3, పాట్ కమిన్స్ (సి) కోహ్లి (బి) సిరాజ్ 2, మార్నస్ లబుషేన్ (ఎల్బీ) బుమ్రా 3, ఎక్స్‌ట్రాలు : 4, మొత్తం : (4.2 ఓవర్లలో 3 వికెట్లకు) 12.
వికెట్ల పతనం : 1-0, 2-9, 3-12.
బౌలింగ్ : జశ్‌ప్రీత్ బుమ్రా 2.2-1-1-2, మహ్మద్ సిరాజ్ 2-0-7-1