మరోసారి ఆశాలు తమ సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీబాట పట్టారు. కేంద్ర ప్రభుత్వ (మోడీ) ప్రజా, ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాల వలన ఒకవైపు ఆకాశాన్నంటుతున్న అధిక ధరలు, మరోవైపు చాలీచాలని పారితోషికాలు, అధిక పనిభారం ఆశాలను పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్యలు. రిజర్వ్ బ్యాంక్ అంచనాలను మించి పెరుగుతున్న ద్రవ్యోల్బణం వలన ఆశాలు పొట్ట నింపుకోడానికే సరిపోని పారితో షికాలతో నిత్యావసర వస్తువుల అధిక ధరలు, ఇంటి అద్దెలు, పిల్లల చదువులు, అనారోగ్యం ఖర్చుల వంటి కనీస అవసరాలు తీరక పస్తులుండటంతో పాటుగా అప్పుల పాలౌతున్నారు. నిత్యం సమాజానికి ఆరోగ్య సేవలు అందిస్తున్న ఆశాలు ఆరోగ్యం, ఆర్థిక అవసరాలు తీరక దుర్భర బతుకులీడుస్తున్నారు. కనీస వేతనం, సామాజిక భద్రత కోసం పోరుబాట పట్టారు.
భారతదేశ వ్యాప్తంగా సుమారు పది లక్షల మంది, తెలంగాణ రాష్ట్రంలో సుమారు 27 వేల మంది ఆశా వర్కర్లు, ఫెసిలిటేటర్స్ 2005 నుండి నేషనల్ హెల్త్ మిషన్ పథకం కింద పని చేస్తున్నారు. వీరు ముఖ్యంగా మాతా- శిశు మరణాల రేటు తగ్గించడంలో, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయడంలో ఆశాలది కీలకపాత్ర. వీరంతా గత రెండు దశాబ్దాల నుండి నిస్వార్ధంతో, అంకితభావంతో భారత ప్రభుత్వా నికి, ప్రజలకు తమ సేవలందిస్తున్నారు. కరోనా సమయంలో తమ ప్రాణాలను, తమ కుటుంబ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి ప్రజలకు సేవలందించారు. ఇందుకుగాను ప్రపంచ ఆరోగ్య సంస్థ వీరిని, వీరి సేవలను గుర్తించి గ్లోబల్ హెల్త్ లీడర్స్‌గా అభివర్ణించింది. కానీ భారత ప్రభుత్వం కనీసం వీరిని కార్మికులుగా కూడా గుర్తించడం లేదు. వీరు చేస్తున్న సేవలను గుర్తించి కనీసం గౌరవ వేతనం కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఆశాలను స్వచ్ఛంద ఆరోగ్య కార్యకర్తలు అని పేరు పెట్టి వీరి చేత చేపిస్తున్న పనులకు ప్రోత్సాహకంగా పీస్ రేటు నిర్ణయించి పారితోషికం పేరుతో బిచ్చమేసినట్టు విదిలిస్తుంది. సిహెచ్‌సి, పీహెచ్‌సిలలో ఆశాలను పార్ట్ టైం కార్మికులుగా పరిగణిస్తూ కనీసం వీరికి కూర్చోవడానికి కూడా ఏర్పాటు ఉండదు. తాగటానికి మంచినీటి సౌకర్యం ఉండదు. కనీసం వాష్‌రూమ్ సౌకర్యం కూడా ఉండదు. ఆశాలకు నిర్ణీత పనిగంటలు అంటూ ఉండవు. గర్భిణులతో పాటుగా అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడాలేకుండా ప్రసవం కోసం దవాఖానాకు వెళ్లి ప్రసవం జరిగే వరకు గర్భిణితో ఉండాల్సి ఉంటుంది.
నలభై రకాల పనులు..అనేక ఇబ్బందులు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆశా వర్కర్లకు ప్రతిరోజు వారు చేస్తున్న నలభై రకాల పనులకు అదనంగా అనేక కొత్త పనులు, రకరకాల సర్వేలు చేయిస్తున్నారు. ఎన్సీడీ వంటి అన్నిరకాల సర్వేలు ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేయాలి. చాలామంది ఆశాలకు ప్రభుత్వం డిజిటల్ వర్క్‌లో ట్రైయినింగ్ ఇవ్వకుండా ఆన్‌లైన్ పనులు చేయిస్తుంది. భారతదేశంలో అనేక గ్రామాలకు నెట్‌వర్క్ సరిగా అందక ఆశాల ఆన్‌లైన్ పనికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. సర్వర్ డౌన్ ఉండడం వల్ల డేటా ఎంట్రీకి అధిక పని గంటలు వెచ్చించాల్సి వస్తుంది. మొన్న ఈ మధ్య ఫిబ్రవరి నెలలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో డెబ్బయికి పైగా ఆశా వర్కర్లను ఆన్‌లైన్ పనిలో వారికి ఇచ్చిన నిర్ణీత గడువులో డేటా ఎంట్రీ చేయనందున పని నుండి తొలగించారు. ఆశాలు గ్రామీణ స్థాయి గహాలను సందర్శిస్తూ, ఆన్‌లైన్‌లో అఫ్‌లోడ్ చేస్తూ ప్రభుత్వం ఆరోగ్య పథకం కోసం డిజిటల్ ఐడిలను రూపొందించడంలో సహాయం అందిస్తున్నారు. అందుకోసం ప్రీపెయిడ్ నెట్ వర్క్ తో కూడిన మొబైల్స్ ఇవ్వాలని ఆశాలు కోరుతున్నారు.
సమాజంలో మాతా – శిశు ఆరోగ్య సంరక్షణ పని మహిళల పనిగా మాత్రమే పరిగణింపబడుతుంది. అంతేకాకుండా శ్రామిక మహిళల పని పట్ల ప్రభుత్వ తిరోగమన దక్పథం వలన పురుషుల ఆదాయమే ప్రధాన ఆదాయంగా, మహిళల ఆదా యం ద్వితీయ ఆదాయంగా పరిగణిస్తూ మహిళల పనికి సరైన విలువ కట్టడం లేదు. ఇది సరెంది కాదు. ఆశా అలాగే ఇతర స్కీమ్ వర్కర్ల కుటుంబాలలో దాదాపు యాభైశాతం మహిళలే వారి కుటుంబానికి ప్రధాన జీవనాధారం.పెరుగుతున్న పనిభారం వలన ఆశాలలో చాలా మంది మానసిక, శారీరక ఒత్తిడికి గురై అనారోగ్యం పాలౌతున్నారు. మాతా – శిశు మరణాలు తగ్గిం చటం తాత్కాలికమైన పనికాదు. ఇది నిరంతరం శాశ్వతంగా కొనసాగుతున్న ప్రక్రియ. ఇది ఆశాలకు జీవనోపాధి కూడా. కాబట్టి దీనిని శాశ్వత ఆరోగ్య కార్యక్రమంగా క్రమబ ద్ధీకరించి, ఆశాలను కార్మి కులుగా గుర్తించి కనీస వేతనం చెల్లించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బీజేపీ నేతత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కేంద్ర బడ్జెట్‌లో ప్రజల సాధారణ ఆరోగ్య సంరక్షణకు, ఎన్‌హెచ్‌ఎంకు బడ్జెట్ కేటాయింపులు తగ్గించింది. అంతేకాకుండా ప్రజారోగ్యాన్ని ప్రయివేటీ కరిస్తున్నది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి అనేక రాష్ట్రాలలో జిల్లాస్థాయి దవాఖానాలను ప్రయివేటీకరించారు. నిత్యావసర ఔషధాల ధరలపై నియంత్రణ లేక అనారోగ్యం బారిన పడిన వ్యాధిగ్రస్తులు సరైన వైద్యమందక అధిక ధరలు వెచ్చించి మందులు కొనలేక ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అనేక పోరాటాల ఫలితంగా కేంద్ర ప్రభుత్వం నెలకు రూ.వెయ్యిగా ఉన్న ఫిక్స్‌డ్ పారితోషికాన్ని 2018లో రూ.2వేలకు పెంచి చెల్లిస్తుంది. ఇది ఎంతమాత్రం సరిపోదు. వివిధ రాష్ట్రాలలో చెల్లిస్తున్న పారితోషికాలు కూడా గతంలో నిర్ణయించినవే. నేడున్న అధిక ధరలను పరిగణనలోకి తీసుకుంటే ఆ పారితోషికాలు రెండింతలు చేయాలి.
రెండు దశాబ్దాలుగా ఆశాల పోరాటం
ఎన్‌హెచ్‌ఎంను శాశ్వత ఆరోగ్య కార్యక్రమంగా గుర్తించాలి. బడ్జెట్ కేటాయిం చాలి. ఆశాలను కార్మికులుగా క్రమబద్ధీకరించి కనీస వేతనం రూ.26వేలు చెల్లించాలి. ఈఎస్‌ఐ,పీఎఫ్, గ్రాట్యూటీ, పెన్షన్‌తో సహా అన్ని సామాజిక భద్రత ప్రయోజనాలను కలిపి నెలకు రూ.10వేలు పెన్షన్‌గా చెల్లించాలి. యూనివర్సల్ హెల్త్ కేర్ హక్కు కోసం చట్టాన్ని రూపొందించి ఆరోగ్య రంగానికి జీడీపీలో ఆరుశాతం కేటాయించాలి. నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్‌ను, పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్ ప్రయివేటీకరణను ఉపసంహ రించుకోవాలి. నాలుగు లేబర్ కోడ్‌లను ఉపసంహరించు కోవాలి. ఆశా వర్కర్లను కార్మిక చట్ట పరిధిలోకి చేర్చాలి. దేశ వ్యాప్తంగా ఉన్న ఆశాలకు ఒకే విధమైన పని పరిస్థితులు ఉండాలి అనే ప్రధానమైన డిమాండ్ల సాధన కోసం గత రెండు దశాబ్దాల కాలం నుండి ఆశాలు జాతీయ, రాష్ట్ర స్థాయిలో సమరశీల పోరాటాలు చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో 62 రోజులు, బీహార్‌లో 32 రోజులు సమ్మె చేశారు. హర్యానా, జమ్మూ కాశ్మీర్, తెలంగాణాలో నిరవధిక సమ్మెలు, వివిధ ప్రదర్శనలలో వేలాది మంది ఆశాలు కదిలారు.
ఆశా వర్కర్స్ అండ్ ఫెసిలిటేటర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎడబ్ల్యూఎఫ్‌ఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో 2023 అక్టోబర్‌లో కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీలో అన్ని రాష్ట్రాల ఆశాలు పెద్ద పోరాటం చేశారు. కార్మికుల దీర్ఘకాల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం త్వరలో సమస్యలు పరిష్కారిస్తామని హామి ఇచ్చింది. కానీ ఏడాది గడిచినా హామీలపై ఎలాంటి చర్యలు కనిపించకపోవడంతో మళ్లీ ఢిల్లీకి పోరుబాట పట్టవలసి వస్తుంది. 29 నవంబర్ 2024న ఢిల్లీలో పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా ఆశా వర్కర్స్ తమ గళాన్ని వినిపించనున్నారు.
(నవంబర్ 29న ఆశాల ‘చలో ఢిల్లీ’ సందర్భంగా)