నవతెలంగాణ హైదరాబాద్: ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి, సంక్షేమ పథకాలపై విస్తృతంగా ప్రచారం చేయడంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కృషి చేయాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయంలో సాంస్కృతిక సారథి ఛైర్‌పర్సన్‌గా ప్రజాగాయకుడు గద్దర్ కుమార్తె వెన్నెల సోమవారం బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వెన్నెల సారథ్యంలో తెలంగాణ సంస్కృతిని చాటే విధంగా కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్ర సాధనలో గద్దర్ కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆట, పాటకు ఆదరణ దక్కలేదన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు పట్నం మహేందర్‌రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, సాంస్కృతిక శాఖ సంచాలకుడు హరికృష్ణ పాల్గొన్నారు.