తెలంగాణలోని విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పార్ట్‌టైమ్ అధ్యాపకులుగా పనిచేస్తున్న వారి జీవితాల్ని గత సర్కార్ తీసుకొచ్చిన సర్క్యులర్ అతలాకుతలం చేశాయి. అధిక పని గంటలు, జీతాల్లో వ్యత్యాసాలు, సెలవు దినాల్లో వేతనాల కోతల్లాంటి సమస్యల్ని సృష్టిం చాయి. ఇరుగు, పొరుగు రాష్ట్రాల్లో కాలాను గుణంగా జీతాలిస్తూ పనిభారాన్ని కూడా తగ్గిస్తున్నాయి. మన రాష్ట్రంలో మాత్రం పార్ట్‌టైం అధ్యాపకులను ఫుల్‌టైం పనిచేయిస్తున్న పరిస్థితి ఉంది. వారి శ్రమకు తగిన గుర్తింపు కూడా లేదు.రెగ్యులర్ ఫ్యాకల్టీతో సమానంగా అర్హతలు ఉన్నప్పటికీ, వారికి ఇస్తున్నట్టుగా వేతనాలు ఇవ్వకపోగా అధిక పనిభారం మోపడం వారికి వారికి నిత్య సమస్యగా మారింది. పార్ట్‌టైమ్ లెక్చరర్ల ఎంపిక ప్రక్రియ అసిస్టెంట్ ప్రొఫెసర్ల (కాంట్రాక్టు అండ్ రెగ్యులర్) రెండూ ఒకే మాదిరిగా ఉంటుంది, ఇందులో రాత పరీక్షలు, ఇంటర్వ్యూలు, డెమో ప్రదర్శనలు కూడా ఉంటాయి. అయితే, పార్ట్‌టైమ్ లెక్చరర్లకు కేటాయించిన పని రెగ్యులర్ వారితో పోలిస్తే సమానంగా ఉంటోంది. పార్ట్‌టైం వాళ్లకు గరిష్టంగా వారానికి పదిహేను తరగతులు ఉండగా, కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు వారానికి పదహారు తరగతులు ఉంటాయి. కాంట్రాక్ట్, రెగ్యులర్ వారిలాగే పార్ట్‌టైం లెక్చరర్లు పనిచేస్తుననప్పటికీ వారికి ఇస్తున్న వేతనం, కల్పిస్తున్న ఇతర ప్రయో జనాల్లో భారీ వ్యత్యాసం ఉంటోంది. ఇది యూని వర్శిటీల్లో పనిచేస్తున్న పార్ట్‌టైమ్ ఫ్యాకల్టీల శ్రమను దోచుకోవడమే కదా.
2014 జూన్ 2న రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇతర కాంట్రాక్టు ఉద్యోగాల నియామకాలను రద్దు చేయడంతో పార్ట్‌టైం లెక్చరర్లపై ఎక్కువ ఆధారపడాల్సి వచ్చింది. ఈ విధాన మార్పు తెలంగాణలోని యూనివర్సిటీల పనితీరుపై తీవ్ర ప్రభావం చూపింది. ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ పోస్టుల బ్యాక్‌లాగ్‌ను సృష్టించడంతో పాటు పార్ట్‌టైమ్ లెక్చరర్లపై పనిభారాన్ని పెంచింది. అదనంగా, ఇది పార్ట్‌టైమ్ లెక్చరర్లకు కెరీర్ పురోగతికి పరిమిత అవకాశాలను కల్పించింది. ఎందుకంటే వారు ఇదివరకటిలా రెగ్యులర్ అండ్ కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ స్థానాలకు మారడానికి అవకాశం లేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ముందు, రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలలో పార్ట్‌టైమ్ లెక్చరర్లు అవ సరమైన పని ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే, అసిస్టెంట్ ప్రొఫెసర్(కాంట్రాక్టు) పోస్టుల కు ఆటోమేటిక్ అఫ్గ్రేడ్లకు అర్హులు. అయితే, రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఈ విధానాన్ని అప్పటి గవర్నమెంట్ హఠాత్తుగా మార్చేసింది. అధ్యాప కుల నియామకాలపై నియంత్రణ చేపట్టింది.కొత్త అధ్యాపకులను నియమించుకునే విశ్వవిద్యా లయాల అధికారాల్ని కూడా హరించింది. ఈ నిర్ణయాలన్నీ కూడా పార్ట్‌టైం లెక్చరర్లను, ఉన్నత విద్యారంగాన్ని ప్రమాదంలోకి నెట్టేశాయి.
రెగ్యులర్ అసిస్టెంట్ ప్రొఫెసర్లతో సమానంగా పార్ట్‌టైం లెక్చరర్లకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ, అధికారిక నోటిఫికేషన్ల కొరత వీరిని ఉద్యోగ అభద్రతలో పడేసింది. ఇటు నోటిఫికేషన్లు లేక, మరోవైపు ఖాళీలను భర్తీచేయకపోవడం వల్ల వీరు రోజంతా పనిచేయడం, కాస్త విరామం దొరక్కపోవడం మానసిక సమస్యల బారిన పడేస్తోంది. ఎంతో అంకితభావం, నిబద్ధతతో పనిచేస్తున్న పార్ట్‌టైం లెక్చరర్లను అఫ్‌గ్రేడ్ చేయడం పోవడం కూడా వీరి పట్ల సర్కార్ల నిర్లక్ష్యాన్ని తెలియజేస్తున్నది. ఉస్మానియా యూనివర్సిటీనే తీసుకుంటే దాదాపు 200మంది పార్ట్‌టైమ్ లెక్చరర్లు పనిచేస్తుండగా, 250కి పైగా అధ్యాపక పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీల్లో పార్ట్ టైమ్ లెక్చరర్లను తీసుకోవడం వల్ల రెగ్యులర్ అండ్ కాంట్రాక్టు వారిలాగే వీరు కూడా పుల్టైం పనిచేస్తున్న పరిస్థితి ఉంది.
ఈ సమస్యకు నిపుణులు,విద్యావేత్తలు ఒక ఆచరణాత్మక పరిష్కారాన్ని ప్రభుత్వానికి సూచిం చారు. వారానికి 15 తరగతుల పనిభారం ఉన్న పార్ట్‌టైమ్ లెక్చరర్లను ఇదివరకు లాగే కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అఫ్‌గ్రేడ్ చేయవచ్చు. అయితే వారానికి పది తరగతుల కంటే తక్కువ పనిభారం ఉన్నవారికి ఏకీకృత మొత్తం చెల్లించవచ్చు. ఈ విధానం పార్ట్‌టైం లెక్చరర్లకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు మెరుగైన వేతనం అందించబడుతుంది. అలాగే విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల కొరతను కూడా పరిష్కరించే అవకాశముంది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం పార్ట్‌టైం లెక్చరర్లు పడుతున్న ఇబ్బందులు, జీతాల్లో వ్యత్యాసాలు, అధిక పనిగంటల భారం తగ్గించడం లాంటి అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. గత ప్రభుత్వంలో జరిగిన లోపాల్ని సరిచేసి పార్ట్్టైం లెక్చరర్లకు ఉద్యోగ భద్రత కల్పించే బాధ్యత రేవంత్ సర్కార్‌దే. నిర్ణయాత్మక చర్యలు తీసుకుని నిరాశలో ఉన్న అధ్యాపకులను ఆదుకోవాల్సింది కూడా ప్రస్తుత ప్రభుత్వానిదే.
– మానస 9342455451