ప్రముఖ సినీ గీత రచయిత కులశేఖర్ (53) ఇకలేరు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుది శ్వాస విడిచారు. జర్నలిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన పాటల మీద ఉన్న మక్కువతో సినీ రంగ ప్రవేశం చేశారు. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి దగ్గర శిష్యరికం చేశారు. ‘చిత్రం’, ‘జయం’, ‘ఔనన్న కాదన్నా’, ‘ఘర్షణ’, ‘వసంతం’ వంటి తదితర చిత్రాలకు కులశేఖర్ రాసిన పాటలు విశేష శ్రోతకాదరణ పొందాయి. ముఖ్యంగా ఆయన రాసిన ‘గాజువాక పిల్లా’, ‘రాను రాను అంటూనే చిన్నదో..’, ‘అందమైన మనసులో ఇంత అలజడి ఎందుకో’ వంటి పాటలు సూపర్‌హిట్‌గా నిలిచాయి. చిరంజీవి ‘మృగరాజు’, ఎన్టీఆర్ ‘సుబ్బు’ చిత్రాలకు కూడా పాటలు రాశారు. ఆయన ఎక్కువగా తేజ, ఆర్పీ పట్నాయక్ కాంబోలో వచ్చిన సినిమాలతో మంచి ఆదరణ పొందారు. అలాగే దర్శకుడిగా మారి ‘ప్రేమలేఖ రాశా’ చిత్రాన్ని తెరకెక్కించారు. అతి తక్కువ సినిమాలతో గీత రచయితగా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న కులశేఖర్ మృతిపట్ల పలువురు సంగీత దర్శకులు, గాయనీగాయకులు సోషల్ మీడియా వేదికగా సంతాపాన్ని వ్యక్తం చేశారు.