సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే డేటా ఎలాంటి తప్పులు దొర్లకుండా పకడ్బందీగా ఆన్లైన్ చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ విజయలక్ష్మి పంచాయతీ కార్యదర్శులకు, కంప్యూటర్ ఆపరేటర్లకు సూచించారు. కాటారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన డాటా ఎంట్రీ సెంటర్ ను అదనపు కలెక్టర్ తనిఖీ చేశారు. సర్వేలో నమోదు చేసిన ప్రతీ అంశాన్ని ఆన్లైన్లో పొందుపర్చాలన్నారు. ఆన్లైన్ డాటా ఎంట్రీ వేగంగా కొన సాగించి సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. డాటా ఎంట్రీని అత్యంత గోప్యంగా ఉంచాలని, ఇతరులను డాటా ఎంట్రీ కేంద్రంలోకి రానివ్వొద్దని అధికారులకు సూచించారు. అదనపు కలెక్టర్ వెంట ఎంపీడీఓ బాబు, ఎంపీఓ వీరస్వామి, ఏపీఓ వెంకన్న, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. అలాగే మల్హర్ మండలంలోని డాటా ఎంట్రీ కేంద్రాన్ని పరిశీలించారు. ఆపరేటర్లు ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు. అనం తరం తాడిచర్ల జిల్లా పరిషత్ పాఠశాలలోని మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్యామసుందర్, సూపరింటెండెం ట్ మూర్తి, ఎంపీడీ, తహసీల్దార్ కార్యాలయ సిబ్బం ది పాల్గొన్నారు.