– భారత్ ఫుట్‌బాల్‌పై క్రీడా మంత్రి మాండవీయ
న్యూఢిల్లీ: భారత ఫుట్‌బాల్ సమగ్ర అభివృద్ది ప్రణాళిక రూపొందించుకుని, క్షేత్ర స్థాయి నుంచి నిజాయితీగా పనిచేస్తూ రానున్న పదేండ్లలో ఫిఫా ర్యాంకింగ్స్‌లో టాప్-50లో ఉండగలమని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. ఫిపా టీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ జెడ్ రాడీతో కలిసి ఎఐఎఫ్ఎఫ్ అధ్యక్షుడు కళ్యాణ్ చౌబే గురువారం కేంద్ర మంత్రిని ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా భారత్‌లో మరో నాలుగు ఫిఫా-ఏఐఎఫ్ఎఫ్ అకాడమీలను ఏర్పాటుపై నివేదికను మాండవీయకు అందజేశారు. ప్రస్తుతం భువనేశ్వర్‌లో ఫిఫా ఏఐఎఫ్ఎఫ్ అకాడమీ ఉంది. 32 మంది యువ ఆటగాళ్లు ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. ప్రాజెక్టు పురోగతి తెలుసుకునేందుకు జెడ్ రాడీ ఇక్కడికి వచ్చారు. ‘భారత్‌లో ఫుట్‌బాల్ అభివృద్దికి సమగ్ర ప్రణాళిక రూపొందించాలి. రానున్న పదేండ్లలో ఫిఫా ర్యాంకింగ్స్‌లో భారత్ టాప్-50లో ఉండేలా కార్యాచరణ ఉండాలి. తల్లిదండ్రులు సైతం పిల్లలను క్రీడల దిశగా ప్రోత్సహిస్తున్నారు. ప్రభుత్వం ఫుట్‌బాల్ అభివృద్దికి కట్టుబడి ఉంది. కొత్త శిక్షణ కేంద్రాలు, అకాడమీలు, అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యంతో పురోగతి వేగవంతం అవుతుంది. కొత్త అకాడమీల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు ఉంటుందని’ మాండవీయ తెలిపారు. చిన్నారులకు ఫిఫా ఏఐఎఫ్ఎఫ్ అకాడమీల్లో శిక్షణ అందించి అండర్-17 ఫిఫా ప్రపంచకప్‌కు భారత్‌కు సొంతంగా అర్హత సాధిస్తే.. ఈ ప్రాజెక్ట్ విజయవంతం అయినట్టేనని కళ్యాణ్ చౌబే తెలిపారు.