అడవి ఎదపై ‘యురేనియం’ పిడుగు

'Uranium' thunderbolts over the jungle”వ్యవసాయం, తోటలు, నదులు, అడవులు, చెట్లు, సముద్రాలు, భూగర్భజలాలు, ఖనిజాలు అన్ని కొల్ల గొట్టడానికి పాలకులు వాడుతున్న పదం అభివృద్ధి. పాలకులు అభివృద్ధి అన్నారంటే అది విధ్వంసం అని ప్రజలు గ్రహించాలి”. – మేధా పాట్కర్‌
తెలంగాణలోని నాగర్‌కర్నూల్‌ జిల్లా మన్ననూర్‌ ఐటిడిఏ పరిధిలోని అమ్రాబాద్‌ అటవీ ప్రాంతం, ఏపీలోని కర్నూలు జిల్లా దేవరకొండ మండలం కప్పట్రాళ్ల ఫారెస్టు భూమిలో అణుకుంపటి రాజుకుంటోంది. ఇక్కడ యురేని యం తవ్వొద్దంటూ ప్రభావిత గ్రామాల ప్రజలు కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో కొవ్వాడ, రాయల సీమలో కడప జిల్లా తుమ్మలపల్లి, ఇలా వివిధ ప్రాంతాల్లోని యురేనియం నిక్షేపాలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు శాపంగా మారుతున్నాయి. కప్పట్రాళ్ల రిజర్వ్‌ ఫారెస్టు పరిధిలో యురేనియం కోసం అరవైఎనిమిది బోర్ల తవ్వకాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. అలాగే తెలంగాణలో బీఆర్‌ఎస్‌ హయాంలో నల్లమల అడవిలో కేంద్ర బృందం జట్‌ విమానంతో సర్వే చేపట్టింది.యురేనియం పరీక్షలు నిర్వహించింది. చెంచులు, ఆదివాసులు నివసిస్తున్న గూడేలను ఖాళీ చేయించే ప్రయత్నం చేసింది. దీంతో ఫారెస్టు అధికార యంత్రాంగం దూకుడుగా వ్యవహరించింది. ప్రజలు ముంచుకొస్తున్న ముప్పును గ్రహించి ఉద్యమించడంతో కాస్తా వెనక్కితగ్గింది.
ప్రజల ప్రయోజనాలకు అణువంత కూడా ఉపయోగపడని యురేనియానికి దేశ పాలకులు ఎందుకు అను మతులిస్తున్నట్టు? పచ్చని అడవుల్లో ఎందుకీ విధ్వంసం? అంటే ఏలికల దగ్గర ఎలాంటి సమాధానం లేకపోవచ్చు. కానీ, మనకు తెలియాల్సింది ఏమిటంటే ఇది కార్పొరేట్లకు దోచిపెట్టే పన్నాగం! రాయలసీమలో యురేనియం నిక్షేపాలను దశాబ్దాల కిందటే గుర్తించారు. 2007 ప్రాంతంలో తవ్వకాలకు సన్నాహాలు జరిగాయి.అక్కడి ప్రజలు మైనింగును వ్యతిరేకిస్తూ ఉద్యమించారు. కడప బేసిన్‌ కప్పట్రాళ్లలో 2017లో డ్రిల్లింగ్‌ చేసి యురేనియం నిక్షేపాలను గుర్తిం చారు. తాజాగా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఈ ప్రాంతంలో పన్నెండు వందల ఎకరాల అటవీ భూమిలో తవ్వ కాలకు కార్పోరేట్లకు అనుమతులిచ్చింది. యురేనియం వెలికితీత మొదలైతే అడవి నాశ నమై పోతుంది. చుట్టు పక్కల పచ్చని పొలాలు బీళ్లుగా మారతాయి. తోటలు, పర్యావరణం దెబ్బతింటాయి. ప్రభావిత గ్రామాల ప్రజలు క్యాన్సర్‌ వంటి భయానక రోగాల బారిన పడతారు. పీల్చుకోవడానికి స్వచ్ఛమైన గాలి కూడా లభించదు. హంద్రీ- నీవా, కృష్ణా, తుంగభద్ర సహా అన్ని నీటి వనరులు కాలుష్యమయమవుతాయి.తాగే నీటిలో యురేనియం పాళ్లు అధికమై క్యాన్సర్‌, కిడ్నీ, చర్మ, ఊపిరితిత్తుల వ్యాధులు ప్రబలుతాయి.
ఇప్పటికే భారత్‌ తీవ్రమైన, జీవ వైవిధ్య సమస్యను ఎదుర్కొంటోంది. ప్రపంచ ప్రకృతి పరిరక్షణ సూచీల భారత్‌ 180 దేశాలలో 176వ స్థానంలో అట్టడుగున ఉంది. భూమి నిర్వహణ, జీవ వైవిధ్యం, పర్యావరణం వంటి అంశాలు సూచికగా తీసుకుంటే మనం చివరెక్కడో ఉన్నాం. దేశంలో 2001 నుంచి 2019 మధ్య కొనసాగుతున్న అటవీ నిర్మూలన కారణంగా 23,300 చదరపు కిలోమీటర్ల అడవిని ఇప్పటికే కోల్పోయాం. ఈ స్థితిలో యురేనియం తవ్వకాలు ‘గోరుచుట్టుపై రోకటి పోటు’ అన్న చందంగా మారాయి. ప్రకృతికి పెట్టుబడి, సామ్రాజ్యవాదం ప్రధాన శత్రువులై హాని తలపెడుతుంటే పర్యావరణ సమతుల్యం దెబ్బతిని ప్రకృతి ప్రకోపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా మానవ తప్పిదాల వలన అనేక ప్రకృతి విపత్తులతో ఎంతో ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లుతోంది. మనదగ్గర ఉత్తరాఖండ్‌లో కొండ చరియలు విరగడం, అనేక రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టించడం ఈకోవకు చెందినవే. గత చరిత్ర నుంచి గుణ పాఠాలు, నేర్వని ప్రభుత్వాలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. అభివృద్ధి పేరుతో పర్యావరణ హననానికి పాటుపడుతున్నాయి. 2011లో జపాన్‌లోని ‘పుకుషిమా’ అణు రియాక్టర్‌ సునామి దెబ్బకి ధ్వంసం కాగా లక్షలాది మంది పౌరులు అసువులు బాశారు. ఎంతోమంది క్షతగాత్రులయ్యారు. ఈ అనుభవాల నుంచి జపాన్‌, రష్యా, ఫ్రాన్స్‌ వంటి దేశాలు అణు రియాక్టర్లను పూర్తిగా మూసివేశాయి. ఈ సామ్రాజ్యవాద దేశాలు మన పాలకుల మెతక వైఖరి కారణంగా భారత్‌ వంటి దేశాలకు అణు ప్రాజెక్టులకు తరలిస్తున్నాయి.
ఎన్డీయే సర్కార్‌కు ప్రజల ఆరోగ్యం, ప్రాణాలతో ఎలాగూ పనిలేదు. కార్పోరేట్ల లాభాలే లక్ష్యంగా పని చేస్తోంది. యురేనియం అణుధార్మికత చాలా ప్రమాదమని, అధికఖర్చని తెలిసినా అమెరికా ఒత్తిడితో కేంద్రం అను మతులివ్వడం ప్రజల ఆరోగ్యం పట్ల ఉన్న నిరక్ష్యాన్ని తెలియజేస్తోంది. యురేనియం శుద్ధి వల్ల విషవాయువులు వెలు వడుతాయి. అది భూమిలో నుండి బయటికి రాగానే గాలిలోని ఆక్సిజన్‌తో చర్య జరుపుతుంది. అణుధార్మికతతో విషం కక్కుతుంది.గాలిలో ప్రవేశించిన తరువాత మనుషుల, జంతువుల శరీరాలల్లోకి ప్రవేశించి ఎముకల్లో స్థిరపడు తుంది. దీంతో చాలా సులభంగా క్యాన్సర్‌ వివిధ రకాల చర్మవ్యాధులు వ్యాపిస్తాయి. కొన్ని వందల ఏండ్ల పాటు అవ యవాల లోపంతో వికృత సంతానం కలుగుతుంది. దీర్ఘకాలం సంతానలేమి కూడా ఉండవచ్చు. పురుషుల్లో శుక్రకణాల ఉత్పత్తి వేగం తగ్గుతుంది. స్త్రీలల్లో అండాల విడుదల క్రమం దెబ్బతింటుంది. గర్భాశయ క్యాన్సర్లు వస్తాయి. గాలి, నీరు కలుషితమై మనుషులు చనిపోతారు. జంతువులు, పక్షులు కూడా మృత్యువాతపడతాయి. పంట పొలాల్లో విత్తనాలు వేసినా మొలకెత్తవు. మొలకెత్తినా ఎదుగుదల ఉండదు. మొత్తం ఆ ప్రాంతం భూమి విషతుల్యమై, నిస్సారమైపోతుంది.ఇది యురేనియం తవ్వకాలతో ఏర్పడబోయే ముప్పును ముందే గ్రహించి తేల్చారు శాస్త్రవేత్తలు.
యురేనియం నిక్షేపాలున్న చోట టైగర్‌జోన్‌ పేరుతో తరతరాలుగా అడవిని నమ్ముకుని జీవిస్తున్న ఆదివాసీ, గిరిజనులను అడవి నుంచి పంపే ప్రయత్నాలు చేస్తోంది కేంద్రం.కప్పట్రాళ్లలో పన్నెండు గ్రామాలు, నల్లమలలో ఎనిమిది గ్రామాలు యురేనియం ప్రభావానికి గురవుతన్నాయి. మైదాన ప్రాంతాల్లో జీవించలేని ఆది వాసులకు ఇదో జీవన్మరణ సమస్య. ఈ నేపథ్యంలో వారి మనుగడే ఓ ప్రశ్నార్థకంగా మారింది. ప్రజల ఆరోగ్యాల్ని ఫణంగా పెట్టి, వారికి హాని తలపెడుతున్న దేశ రాజకీయ వ్యవస్థను సమూలంగా మార్చకుంటే తప్ప మనకు భవి ష్యత్తు లేదన్న అంశాన్ని పౌర సమాజం గుర్తెరగాలి. ప్రత్యామ్నాయ వామపక్ష సోషలిస్టు రాజకీయాల ద్వారా వ్యక్తిగత ఆస్తికి తావులేని సమ సమాజాన్ని నిర్మించుకోవాలి.ఈ ప్రకృతి అనగా ఈ నేల, ఈ గాలి, ఈ అటవీ సంపద, మొత్తంగా పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి. ఇంతటి వినాశకారకమైన యురేనియం వెలికితీత తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశంలో ఎక్కడ చేపట్టినా ప్రజలు వ్యతిరేకించాలి, ఉద్యమించాలి, తిరుగుబాటు ద్వారా వెనక్కి తిప్పికొట్టాలి. లేదంటే మనం, మన భావితరం తగిన మూల్యం చెల్లించక తప్పదు.
– అరుణ, 9705450705