లలైసింగ్‌ బౌద్ధ-నిబద్దత ఎలాంటిది?

What is Lalaisingh's Buddhist-commitment?‘వర్ణ్‌ అవుర్‌ జాత్‌, పురోహిత్‌ కి బాత్‌-కబీ నహీ.. మాన్‌నా’ :- అని పిలుపునిచ్చిన లలైసింగ్‌ గురించి దక్షిణ భారతీయులకు తక్కువగా తెలుసు. పెరియార్‌ ఇ.వి. రామసామి అనుచరుడిగా మారి, ఆయన రచనను ‘సచ్ఛీ రామాయణ్‌’ పేరుతో అనువదించి, ఉత్తర భారత పెరియార్‌గా ప్రసిద్ధుడైన వాడు లలైసింగ్‌ యాదవ్‌. ఉద్యోగ రీత్యా ఆర్మ్‌డ్‌ ఫోర్స్‌ కానిస్టేబుల్‌గా చేరి, గ్వాలియార్‌ నేషనల్‌ అకాడమీ నుండి హైకమాండర్‌గా పదవీ విరమణ చేసిన వాడు. కుటుంబంలో తల్లీ, తండ్రీ, భార్య, కూతురు ఒక్కొక్కరుగా అందరికీ అందరూ చనిపోయినా ఒంటరిగా జీవిస్తూ- తన వ్యక్తిగత జీవితాన్ని చూసుకోకుండా అహరహం బహుజనుల ఉద్దరణ కోసం తపిస్తూ శ్రమించిన త్యాగశీలి. బ్రిటీషు ప్రభుత్వంలో ఉద్యోగిగా ఉండి, ఆ ప్రభుత్వానికే వ్యతిరేకంగా పనిచేసి, స్వాతంత్య్ర యోధుడై జైలు పాలయినవాడు. ఈయన బోధనలు, రచనలు తమకు వ్యతిరేకంగా సాగుతున్నాయని గ్రహించిన మనువాదులు ఆయన్ను చంపాలని అనేకసార్లు ప్రయత్నించారు. ఒకరోజు రాత్రి ఆయన మీద దాడి జరిగే అవకాశముందని ఒక మిత్రుడు ఆయన్ను హెచ్చరించాడు. ఆయన తన గదిలోనే ఉండి ఒక మిత్రుడితో బయటకు తాళం వేయించు కున్నాడు.దుండగులు వెతుక్కుంటూ వచ్చారు తాళం చూసి ఇంట్లో లేడని వెళ్లిపోయారు. అయితే తాళం వేసి పోయిన మిత్రుడు తాళం చెవి పోగొట్టాడు అందువల్ల లలైసింగ్‌ ఆ గదిలోనే రెండు మూడు రోజులు బందీగా ఉండి పోవాల్సి వచ్చింది. మరోసారి బౌద్ధసభలో మాట్లాడుతుండగా మనువాదులు కాల్పులు జరపగా గురితప్పి బతికిపోయాడు.
ఉత్తరప్రదేశ్‌లో బహుజనులు అధికారంలోకి వచ్చారు. కానీ, వారు బహుజనుల ప్రయోజనాలు చూడలేక పోయారని లలైసింగ్‌ విచారం వ్యక్తం చేశాడు. రాజకీయ చేతనతో పాటు సామాజిక చేతన కూడా చాలా అవసరమని ఆ సందర్భంగా ఆయన సామాన్య జనానికి ఒక సందేశం ఇచ్చాడు. ఆయన చెప్పింది నిజమే! యాదవులు అధికారం లోకి వచ్చినా, బహుజన నాయకుడైన లలైసింగ్‌ను మరణానంతరమైనా గౌరవించుకుందామన్న స్పృహ ఆ రాష్ట్ర నాయకులకు రాలేదు. ఆయన స్మృతి చిహ్నంగా విగ్రహం పెట్టడమో, ఏదైనా పార్క్‌కు ఆయన పేరు పెట్టడమో, కనీసం ఆయన పుస్తకాలు పునర్ముద్రించి జనంలోకి తీసుకెళ్లడమో – ఏదీ చెయ్యలేకపోయారు. బ్రాహ్మణ వాదానికి భజనలు చేస్తూ పరశురాముడి విగ్రహం ప్రతిష్టాపించారు. వారి సమాజ్‌వాది పుస్తకాలరు-లోనైనా లలైసింగ్‌ పుస్తకాలు పదిలపరచి, ఆయన రచనలపై, సామాజిక కృషిపై పరిశోధన చేయడానికి యువతీ యువకులను ప్రోత్స హించవచ్చు కదా? అదీ చేయలేదు తమ రాజకీయాలలో తాము మునిగిపోయారు. పండిత పురోహితులమని చెప్పుకుని తిరిగేవారికి ఎవరికీ దాన, మాన, మత్‌దాన్‌ – ఇవ్వకూడదని లలైసింగ్‌ పిలుపునిచ్చాడు. ఉత్త పుణ్యానికే బ్రాహ్మణార్యులకు దానాలు ఇవ్వగూడదనీ, పుణ్యమనేది ఏదీలేదని చెప్పాడు. మానాన్ని అంటే ఆత్మగౌరవాన్ని వదులుకుని బ్రాహ్మణుడికి సాష్టాంగ పడకూడదు. అలాగే వారు ఎన్నికల్లో నిలబడితే మత్‌దాన్‌- ఓటెయ్యగూడదు- పిల్లలు పుట్టించే సామర్థ్యమున్న వారు పుట్టిన పసికూనకు పేరు పెట్టుకోలేరా? దానికోసం బ్రాహ్మణుడి కాళ్లమీద పడటం అవసరమా? నచ్చిన అమ్మాయి అబ్బాయి పెండ్లి చేసుకునే ప్రక్రియలో బ్రాహ్మణుడి తంతు ఎందుకూ? అతను లేకుండా భార్యా భర్తలు కాలేరా? అని లలైసింగ్‌ తీవ్రంగా ప్రశ్నించేవాడు-ఇలాంటివన్నీ ఆ వర్గం వారు వారి పూట గడుపుకోవడం కోసం ఏర్పరచుకున్న ఆచారాలు, సంప్రదాయాలు! వాటి నుండి ఎంతదూరంగా బయటికి వెళ్తే అంత మంచిది. తర్కబద్ధంగా ఆలోచిస్తూ, మనుషులంతా ఒక్కటే అనే ఆలోచనతో ముందుకు వెళితేనే సమాజం బాగుపడుతుంది-అని నిరంతరం లలైసింగ్‌ జనానికి చెపుతుండేవాడు.
వ్యక్తిగత జీవితం ఆయన, అతిసాధారణంగా గడిపేవాడు. పూర్తి శాఖాహారి. ఉదయం రెండు, సాయంత్రం రెండు రొట్టెలు మాత్రం తినేవాడు. కూరగాయల జ్యూస్‌ తాగేవాడు. ఎంత దూరమైనా నడిచే వెళ్లేవాడు, డంబుల్స్‌ లాగా ఒక్కోచేతిలో మూడు-నాలుగు ఇటుకులు పెట్టుకుని వ్యాయామం చేసేవాడు. బక్కపల్చగా ఉండేవాడు. కానీ, గొంతుమాత్రం ఖంగుమని మోగేది. సభల్లో మాట్లాడడానికి మైకు అంతగా అవసరమయ్యేది కాదు. చెప్పే విష యాలలో నాన్చుడు ధోరణి లేకుండా స్పష్టంగా తను చెప్పదల్చుకున్నది చెప్పి తీరేవాడు. జనం అధిక సంఖ్యలో ఆకర్షితులయ్యేవారు. కానీ, ఆ వైఖరివల్ల మనువాద శత్రువులు ఆధికమయ్యేవారు. అయినా ఆయన ఖాతరు చేసే వాడు కాదు. అలాంటి వ్యతిరేకత వస్తుందని ఆయనకు తెలుసు. తెలిసినా, లెక్క చేసేవాడు కాదు. తను నమ్మింది ఆచరించే వాడు. తను ఆచరించేదే ఇతరులకు చెప్పేవాడు.
బాలబాలికల గురించి లలైసింగ్‌ చాలా ఆలోచించేవాడు. పాఠశాల విద్యార్థులకు సమాజంలో గల అగ్ర- నిమ్న వర్గాల గురించిన అవగాహన కల్పించాలనేవాడు. పైగా, బహుజన సమాజంతో సంబంధం లేని వారి జీవిత చరిత్రలు బలవంతంగా పాఠ్యగ్రంథాల్లో చేర్చారని ఆవేదన చెందేవాడు. బుద్ధుడు, కబీర్‌, రవిదాస్‌, పూలే దంపతులు, అంబేద్కర్‌, పెరియార్‌ ఇ.వి. రామసామి వంటి వారి గురించి ఎందుకు పిల్లలకు బోధించరూ? బహుజనుల ప్రయోజనాల కోసం పాటు పడినవారు, మానవ జాతి అంతా ఒక్కటేనని నినదించిన వారి గురించి ఎందుకు పాఠ్యగ్రంథాల్లో చేర్చరూ? మనువాద సంస్కృతికి వంత పాడే వారి గూర్చే భావి భారత పౌరులు తెలుసుకోవాలా? అని ఆయన ఆక్రోశించేవాడు. జాతి నిర్మూలన అంశం పాఠ్యగ్రంధాల్లో ఉంటేనే వారు సరైన పౌరులుగా ఎదుగుతారని ఆయన అభిప్రాయపడేవారు. అలా అయితేనే వారు పెరిగిన తర్వాత కులాంతర వివాహాలు చేసుకోగలుగుతారని, సమాజ స్వరూపాన్ని మార్చగలుగుతారనీ ఆయన విశ్వసించేవాడు. కులాంతర వివాహమనగానే ఒక ఆగ్రవర్ణం వారు మరో అగ్రవర్ణం వారిని పెండ్లి చేసుకోవడం కాదు. వివాహాలు స్పృశ్యులు-అస్పృశ్యుల మధ్య జరగాలని ప్రజలకు ఉద్భోదించేవాడు. బ్రాహ్మణవాదం ఒక కనపడని వల. దానిలోంచి బహుజనులు ఎంత వేగంగా బయటికొస్తే అంత మంచిదని చెప్పేవాడు. ఎందుకంటే బ్రిటీషు వారి గులామీ పోయింది కానీ, కులీన్‌ సత్తాకి గులామీ పోలేదనేవాడు. చూస్తున్నాం కదా? ఇప్పుడు ఆ మనువాద హిందుత్వమే మోసపూరితంగా అధికారంలోకి వచ్చి, దేశ ప్రజల జీవితాలతో ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటోంది.
అణగారిన వర్గాల మీద బ్రాహ్మణ వాదులు జరిపిన ధార్మిక-నైతిక దాడుల గురించి, దోపిడీల గురించి పుస్తకాలు రాసి ప్రకటించిన లలైసింగ్‌ పరంపర – పునర్జన్మ – సంప్రదాయం – కర్మకాండ – దేవుడు – భకి ్త- అర్చన – ఆత్మ సమర్పణ – మోక్షం వంటి మోసపూరితమైన పదాలు బహుజనులెవ్వరూ నిత్య జీవితంలో వాడ కూడదని పిలుపునిచ్చాడు. ఆదివాసీలు, ఈ దేశ మూలవాసులంతా తమ మూలాలు తెలుసుకోవాలని, పరాయీకరణ చెందడం మాని, ఉన్నతమైన మానవీయ విలువల్ని నిలుపుకోవాలని అభిలషించేవాడు. తర్కబద్దత లేని పిట్టకథల్ని నమ్ముతూ, ఆధునిక వైజ్ఞానిక అవగాహనను దూరం పెట్టగూడదనీ చెపుతూ ఉండేవాడు. లలైసింగ్‌, పెరియార్‌ని ఎంత అభిమానించేవాడో అంబేద్కర్‌నూ అంతగానే అభిమానించేవాడు. అంబేద్కర్‌ బౌద్ధదీక్ష తీసుకున్న రోజు ఆయనతో పాటే ఈయన కూడా తీసుకోవాలనుకున్నాడు. అప్పటికే ఆయన టి.బి. ప్రబలి, కాన్పూర్‌ నుండి నాగ్‌పూర్‌ ప్రయాణం చేయలేనంతగా అనారోగ్యానికి గురయ్యాడు. అయితే కోలుకున్నాక, అంబేద్కర్‌కు దీక్ష ఇప్పించిన అదే చంద్రమణి మహాథేరోతో లలైసింగ్‌ దీక్ష తీసుకున్నాడు.
”ఆంగ్లేయులు ఈ దేశంలో అడుగుపెట్టేంతవరకు లిబర్టీ (స్వేచ్ఛ), ఈక్వాలిటీ(సమానత్వం), ఫ్రాటర్నిటీ (సౌభ్రాతృత్వం), జస్టిస్‌ (న్యాయం) అనే సామాజిక విలువలు హిందూ సమాజానికి పరిచయం లేని భావాలు. అంత వరకు బలవంతులు చేసిందే ఇక్కడ న్యాయం. విద్వాంసులు చెప్పిందే న్యాయం. బలవంతులు, విద్వాంసులూ అనుమ తించిందే స్వేచ్ఛ. సమానత్వం అనే ఊహే ఇక్కడ లేదు. ప్రాథమిక దశలో మేధావులు. యోధులు, వ్యాపారులు, సామాన్యులుగా సమాజం విభజింపబడింది. వారినే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులుగా గుర్తించడం జరిగింది. అందరిలోకి బ్రాహ్మణులు, సర్వోత్తములు అనే భావాన్ని వారే బాగా ప్రచారం చేసుకున్నారు”. అని అన్నారు -డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌.
సమాజం పట్ల లలైసింగ్‌కు ఉన్న నిబద్ధత ఎంత గాఢమైందో చెప్పుకోవాలంటే ఒక సంఘటన గుర్తు చేసుకోవాలి! బౌద్ధం స్వీకరించిన లలైసింగ్‌ (1 సెప్టెంబర్‌ 1911-7ఫిబ్రవరి 1993) మరణించడానికి కొన్ని వారాల ముందు 1993 జనవరిలో బీహార్‌ ఏరియాలో సమ్రాట్‌ ఆశోక్‌ స్థూప ఆవిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానం అందితే వెళ్లాడు. ఆ కార్యక్రమం బోధ్‌ శరణ్‌ హంస్‌ (ఎస్‌డిఎం) ఆధ్వర్యంలో జరిగింది. ఈయనకు లలైసింగ్‌ బౌద్ధపై అమి తమైన గౌరవం ఉండేది. లలైసింగ్‌ బౌద్ధను ‘లెజెండ్‌ బౌద్ధిస్ట్‌’ అని అందరికీ పరిచయం చేసేవాడు. ఆ కార్యక్రమం గొప్పగా సాగింది. చివరలో లలైసింగ్‌ బౌద్ధ మాట్లాడుతున్నప్పుడు మనువాదులు ఎక్కడినుండో ఆయన మీద కాల్పులు జరిపారు. కారణం ఏమిటంటే ఇతను బతికి ఉంటే జనాన్ని అధిక సంఖ్యలో బౌద్ధంలోకి తీసుకుపోతాడని వారికి భయం పట్టుకుని ఉంటుంది. లేదా తమకు వ్యతిరేకమైన భావజాలాన్ని ప్రచారం చేస్తున్నాడన్న కక్ష కూడా కావచ్చు. అయితే దుండగుల గురితప్పింది.ఆ బుల్లెట్లకు లలైసింగ్‌ బలికాలేదు. ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. నిర్వా హకులు ఊపిరి పీల్చుకున్నారు. అందరూ భయకంపితులయ్యారు. వాతావరణం వెడెక్కింది. లలైసింగ్‌ బౌద్ధను నిర్వాహకులు జాగ్రత్తగా హోటల్‌ గదికి చేర్చారు.
రాత్రి నిద్రపోయే సమయానికి బోధ్‌ శరణ్‌ హంస్‌(ఎస్‌డిఎం) మరో అనుచరుణ్ణి తీసుకుని లలైసింగ్‌ హోటల్‌ గదికి వచ్చాడు. తాము కూడా ఆయనతో పాటు అక్కడే పడుకుంటామన్నారు. లలైసింగ్‌ ఒప్పుకోలేదు. ఇలాంటి ప్రమాదాలు తనకు అలవాటేనని, ఏమీ కంగారు పడవద్దని సమాధాన పరిచాడు. కానీ, బోధ్‌ శరణ్‌ హంస్‌ వినలేదు ‘మిమ్మల్ని జాగ్రత్తగా వెనక్కి పంపించేదాకా మీ బాధ్యత మాదే’ – అని బలవంతంగా వారు కూడా అక్కడే పరుపులు తెప్పించుకుని ఆ గదిలోనే పడుకున్నారు.అర్ధరాత్రి దాటాక ఏడుపు వినిపించి బోధ్‌ శరణ్‌ హంస్‌ లేచి చూస్తే ఏముందీ? లలైసింగ్‌ బౌద్ధ గుక్కపట్టి ఏడుస్తున్నాడు. తనూ, తన అనుచరుడూ లేచి లలైసింగ్‌ చుట్టూ చేరి ‘ఏమిటి ఏమైంది’ ఎందుకు ఏడుస్తున్నారు? అని అడిగారు. లలైసింగ్‌ బౌద్ధ ఏడవడమే గాని సమాధానం చెప్పడం లేదు. ”మా వల్ల ఏదైనా పొరపాటు జరిగిందా?” అని మళ్లీ మళ్లీ అడిగారు. అప్పుడు లలైసింగ్‌ ఏడుపు ఆపుకుని చెప్పాడు. ”లేదు బోధ్‌ శరణ్‌ గారూ! మీవల్ల ఏ పొరపాటు జరగలేదు. నాకు ఏలోటూ జరగలేదు. కానీ, అంతా అయిపోతూ ఉంది. నావ మునిగిపోతూ ఉంది. మన సమాజం మునిగిపోతూ ఉంది. భవిష్యత్తు అంతా అంధకారంగా కనిపిస్తోంది. జరుగుతున్న మోసాన్ని ఈ సమాజం గ్రహించడం లేదు. ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే నాకు దు:ఖం ఆగడం లేదు-” అని లలైసింగ్‌ బౌద్ధ తన దు:ఖానికి కారణం చెప్పాడు. ఆయన అలా చెప్పగానే బోధ్‌ శరణ్‌ హంస్‌ కు, అతని అనుచరుడికి కూడా దు:ఖం ఆగలేదు. ఇది జరిగిన కొన్ని వారాల వ్యవధిలోనే 82 ఏండ్ల వయసులో లలైసింగ్‌ బౌద్ధ బ్రెయిన్‌ స్ట్రోక్‌తో కన్నుమూశాడు. సమాజం పట్ల ఆయన ఎంత ఆవేదన పడేవాడో మనకు ఈ సంఘటనతో తెలుస్తుంది.ఇలాంటి వారి గూర్చి ప్రభుత్వాలు పట్టించుకోవు. మీడియా ప్రచారం చేయదు. అయితే ఇలాంటి నిస్వార్థ సమాజ సేవకుల గురించి వచ్చే తరాలకు తప్పక తెలియాలి!
– సుప్రసిద్ధ సాహితీ వేత్త,
జీవశాస్త్ర వేత్త (మెల్బోర్న్‌ నుంచి)
– డాక్టర్‌ దేవరాజు మహారాజు