ఇంజినీరింగ్‌ రంగంలో కొత్త ఆవిష్కరణలు రావాలి

– సుస్థిర అభివృద్ధిలో యువ ఇంజినీర్ల పాత్ర కీలకం : ఇస్కీ అంతర్జాతీయ సదస్సులో వక్తలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఇంజినీరింగ్‌ రంగంలో మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా కొత్త ఆవిష్కరణలు రావాలని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. గురువారం హైదరాబాద్‌లోని ఇజినీరింగ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఇస్కీ) ఆధ్వర్యంలో ”ఇంజినీరింగ్‌ సాంకేతికతలో నూతన ఆవిష్కరణలు, స్థిరమైన అభివృది”్ధ అనే అంశంపై రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఈ సందర్భంగా కలకత్తా ఇనిస్టిట్యూట్‌ అఫ్‌ ఇంజినీర్స్‌ ఇండియా వైస్‌ చైర్మెన్‌ డాక్టర్‌ నూతన్‌ కుమార్‌ దాస్‌ మాట్లాడుతూ నూతన ఆవిష్కరణల ఆవశ్యకతపై ఐక్యరాజ్య సమితి సూచనల అమలుకు ఇంజినీరింగ్‌ నిపుణులు మరింతగా కృషి చేయాలని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులు, వనరుల క్షీణత, సామాజిక-ఆర్థిక అసమానతలు వంటి అనేక సమస్యలకు పరిష్కారాలు కనుగొనాల్సిన అవసరముందని వ్యాఖ్యానించారు. నూతన పరిశ్రమలు, స్మార్ట్‌ నగరాలు, బాధ్యతాయుతమైన వినియోగం ఉత్పత్తికి సంబంధించిన అంశాలతో పాటు 2030 నాటికీ ఎంచుకున్న లక్ష్యాలను సాధించేందుకు పరిశోధనలు జరగాలని అభిప్రాయపడ్డారు. కళశాల డైరెక్టర్‌ డాక్టర్‌ జి. రామేశ్వర్‌రావు మాట్లాడుతూ ఇస్కీ గత నాలుగు దశాబ్దాలుగా పర్యావరణం, పవర్‌ అండ్‌ ఎనర్జీ, క్వాలిటీ అండ్‌ ప్రొడక్టివిటీ, మేనేజ్‌ మెంట్‌ టెక్నాలజీ, ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ, మైనింగ్‌కు సంబంధించిన అంశాలపై పరిశోధనలు చేస్తున్నదని అన్నారు. దేశంలోని పలు ఇంజనీరింగ్‌ శాఖలకు చెందిన ఉద్యోగులు శిక్షణ కోసం ఇక్కడికి వస్తుంటారనీ, డాక్టర్‌ అబ్దుల్‌ కలాం కూడా ఈ సంస్థలో ఒకప్పుడు ఫ్యాకల్టీగా ఉన్నారని గుర్తు చేశారు. రెండు రోజులు జరిగే ఈ అంతర్జాతీయ సమావేశంలో క్లీన్‌ ఎనర్జీ టెక్నాలజీస్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, రవాణా మౌలిక సదుపాయాలు తదితర విషయాలపై చర్చించనున్నట్టు తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 76 పరిశోధనాత్మక వ్యాసాలు వచ్చాయనీ, వాటిలో 26 మంది రచయితలను ఎంపిక చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కళాశాల మాజీ అధ్యక్ష్యులు డాక్టర్‌ నరేంద్రసింగ్‌, ఇంజనీరింగ్‌ అధికారులు, అసోసియేట్‌ సభ్యులు పీఎం. గుణరాజ, ఎం నాగరాజ్‌, డాక్టర్‌ చౌడే గౌడ, డాక్టర్‌ ఎస్‌.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.