తెలుగు వెలుగుల నీడ ‘గురజాడ’

Shadow of Telugu lights 'Gurajada'‘దేశమును ప్రేమించమన్నా,మంచి అన్నది పెంచమన్నా, వొట్టి మాటలు కట్టిపెట్టోరు, గట్టి మేలు తల పెట్టవోరు, పాడి పంటలు పొంగి పొరలె దారిలో నువ్వుపాటు పడవోరు,తిండి కలిగితే కండ కలదోరు,కండ కలవాడె మనిషోరు” ఈ దేశభక్తి గీతం ఎవరు రాశారని అడిగితే ఇట్టే చెప్పే సమాధానం గురజాడ అప్పారావు. తన రచనల ద్వారా వాడుక భాష వ్యాప్తికి, సమాజ సంస్కరణకి కృషి చేసిన ఆయన అభ్యుదయ కవితా పితామహుడిగా కీర్తి గడించారు. తెలుగు సాహిత్య రంగంలో తన కంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న సాహితీకారుడు.1862 సెప్టెంబర్‌ 21న ఉమ్మడి ఏపీలోని విశాఖపట్నం జిల్లా యలమంచిలి మండలం రాయవరం గ్రామంలో జన్మించిన ఆయన 1915 నవంబర్‌ 30న 53 ఏండ్ల వయసులో మృతిచెందారు. విజయనగరంలోనే స్థిరపడ్డ గురజాడ తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి. తెలుగు సాహి త్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఒకరు, హేతువాది. 19వ, 20వ శతాబ్ది మొదటి దశకంలోనూ అతను చేసిన రచనలు ఈనాటికీ ప్రజల మన్ననలను పొందుతున్నాయి. అతను ప్రజలందరికీ అర్ధమయ్యే జీవభాషలో రచనలు చేశారు. వీరి కన్యాశుల్కం నాటకానికి సాహితీ లోకంలో ఒక ప్రత్యేకమైన స్థానం. ఈ నాటకంలో అతను సృష్టించిన గిరీశం, మధురవాణి రామప్ప పంతులు మొదలైన పాత్రలు ప్రఖ్యాతి పొందాయి. అభ్యుదయ కవితా పితామహుడు అని బిరుదు పొందిన అప్పారావు, తెలుగు సాహిత్యంలో వాడుక భాష ఒరవడికి కృషి చేసిన వారిలో ముఖ్యుడు. విజయనగరంలో ఆయన డిగ్రీ చదువుతున్నప్పుడు వాడుక భాషా ఉద్యమ నాయకుడు గిడుగు రామమూర్తి అతనికి సహాధ్యాయి.వారిద్దరూ ప్రాణస్నేహితులు. గిడుగు రామమూర్తితో కలిసి వాడుక భాషా వ్యాప్తికి ఉద్యమించారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కన్యాశుల్కము నాటకాన్ని 1890 ప్రాంతాల్లో పూర్తి వాడుకభాషలో రచించారు. ఆ రోజుల్లో ప్రబలంగా వున్న కన్యాశుల్కం, వేశ్యావృత్తి వంటి దురాచారాలపై విమర్శ ఈ నాటకానికి కథావస్తువు. ఇప్పుడు మనకు దొరుకుతున్న కన్యాశుల్కం రెండవ కూర్పును 1909లో రచించారు.1892లో గురజాడ వారి కన్యాశుల్కము నాటకాన్ని తొలిసారిగా ప్రదర్శించారు. మొదటి ప్రదర్శనకే ఎంతో పేరు వచ్చింది. దీంతో సాహిత్యంలో వాడుక భాష ప్రయోగానికి ఒక రకంగా నాంది పలికినట్టయింది. గురజాడ, గిడుకు ఇద్దరూ కలిసి పత్రికల్లో, సభల్లో, మద్రాసు విశ్వవిద్యాలయంలో గ్రాంథిక భాషావాదులతో అలసట ఎరగకుండా తలపడ్డారు. గిడుగు వాదనాబలానికి, గురజాడ రచనాశక్తి వ్యవహారిక భాషోద్యమానికి వినియోగ పడ్డాయి.వీరు నాడు తెలుగు భాషకు చేసిన కృషికి మరింత వన్నెతెచ్చే విధంగా నేడు కవులు, రచయితలు రచనలు చేయాలి. తెలుగు భాషకు సాటి ఏదీ లేదని చాటిచెప్పాలి.
(నేడు గురజాడ వర్థంతి)
– కామిడి సతీష్‌రెడ్డి, 9848445134