– ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో మలుపు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్‌ట్యాపింగ్ కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితు డైన ఎస్‌ఐబీ మాజీ ఐజీ ప్రభాకర్‌రావు తాజాగా అమెరికా ప్రభుత్వాన్ని రాజకీయ శరణు కోరారు. ఈ మేరకు అక్కడి ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు. దీంతో ఇప్పటి వరకు అమెరికా నుంచి ప్రభాకర్‌రావు ను ఇంటర్‌పోల్ సహాయంతో రాష్ట్రానికి తీసుకొస్తారనే ఊహలకు తెరపడినట్టేనా అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో ఫోన్‌ట్యాపింగ్ కేసు వెలుగు చూడకముందే మాజీ ఐజీ ప్రభాకర్‌రావుతో పాటు ఈ కేసులో మరో నిందితుడైన ఐ న్యూస్ సీఈఓ శ్రవణ్‌కుమార్‌లు అమెరికాకు వెళ్లిపోయారు.
ఒకవైపు, ఈ కేసులో నిందితులుగా చేర్చబడిన నలుగురు పోలీసు అధికారులను అరెస్ట్ చేసిన దర్యాప్తు అధికారులు.. మరోవైపు, అమెరికాకు వెళ్లిపోయిన మాజీ ఐజీ ప్రభాకర్‌రావు, శ్రవణ్ కుమార్‌ల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. వీరిద్దరు కూడా అమెరికాలో ఉన్నారనే సమాచారంతో ఇక్కడికి తీసుకు రావటానికి ఇంటర్‌పోల్ సహాయాన్ని కోరారు. ఒకపక్క, ఈ ప్రక్రియ సాగుతుండగానే ప్రభాకర్‌రావుకు చెందిన పాస్‌పోర్ట్‌ను రద్దు చేస్తూ రాష్ట్రంలోని ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం అమెరికాలోని న్యూ జెర్సీలో తన కుమారుడి వద్ద ప్రభాకర్‌రావు ఉన్నట్టు సమాచారం.
దీంతో తనకు అమెరికాలోని రాజకీయ శరణు ఇవ్వాలని కోరుతూ అక్కడి ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నట్టు తెలిసింది. దీనిపై యూఎస్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందోననే ఉత్కంఠ రాష్ట్ర పోలీసు అధికారుల్లో నెలకొన్నది. అయితే, ఫోన్‌ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాకర్‌రావుతో పాటు శ్రవణ్ కుమార్‌లను తీసుకురావటానికి తమ ప్రయత్నా లు కొనసాగుతూనే ఉంటాయనీ, ఇందుకు అవసర మైన సహాయాన్ని విదేశాంగశాఖ అధికారుల నుంచి తీసుకుంటామని రాష్ట్ర పోలీసు అధికారులు తెలిపారు.