– టీఎన్జీవో అధ్యక్షులు జగదీశ్వర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో పంచాయతీ కార్యదర్శుల సమస్యలను పరిష్కరించాలని టీఎన్జీవో అధ్యక్షులు మారం జగదీశ్వర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సెంట్రల్ ఫోరమ్ రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశాన్ని ఈ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సందిల బలరాం అధ్యక్షతన నిర్వహించారు. జగదీశ్వర్ మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులకు క్యాడర్ స్ట్రెంత్‌ను నిర్ధారణ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉన్న ఖాళీల్లో పదోన్నతులను కల్పించాలని సూచించారు. 2019లో నియామకం అయిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు రెండేండ్లకు ప్రొబేషన్ నిర్ణయం చేయాలని చెప్పారు. ఓపీఎస్లను జేపీఎస్లాగా కన్వర్షన్ చేయాలన్నారు. 317 జీవో బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యదర్శులపై సోషల్ ఆడిట్ రికవరీల గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి ఎస్ఎం ముజీబ్ హుస్సేనీ, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్లు, సత్య నారాయణగౌడ్, కొండల్ రెడ్డి, ములుగు జిల్లా అధ్యక్షులు పోలు రాజు, పంచాయతీ కార్యదర్శి ఫోరం కార్యదర్శి వెంకట రమణ, అసోసియేట్ అధ్యక్షులు శ్రావణ్, సదానందం, రఫీ, కోశాధికారి నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.